అంగన్‌వాడీలపై ఉక్కుపాదం!
తాడిపత్రి రూరల్: అంగన్‌వాడీలపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయ కుండా మోసపూరితంగా వ్యవహరిస్తున్న వైనంపై నిరసన తెలిపేందుకు అంగన్‌వాడీలు సోమవారం విజయవాడలో మహా ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో జిల్లా నుంచి మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న అంగన్‌వాడీలను ఎక్కడికక్కడ పోలీసులతో చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుంది. పైగా వారిని భయపెట్టేందుకు సెక్టార్ మీటింగ్ అంటూ డ్రామాకు తెరలేపింది. మహా ధర్నాకు బయలుదేరిన తీవ్ర పరిణామాలు ఉంటాయని ఐసీడీఎస్ అధికారులు హెచ్చరికలకు దిగారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు అంగన్‌వాడీల కదలికలపై నిఘా ఉంచారు. ముందస్తు నోటీసులు అందించారు. అయినా విజయవాడ మహాధర్నాకు వెళ్తున్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లను బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. యూనియన్ నాయకుల ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలకూ వెనుకాడలేదు. అంగన్‌వాడీ సెంటర్లను మూసివేసి ధర్నాకు వెళ్లే వారి వివరాలను సేకరించాలని గ్రామ సచివాలయ మహిళా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అయితే, ఎన్ని అడ్డంకులు సృష్టించినా మహా ధర్నాకు వెళ్లి తీరుతామని అంగన్‌వాడీలు తెలిపారు.
అంగన్‌వాడీల డిమాండ్లు ఇలా...
● అంగన్‌వాడీలకు నెలకు రూ.28 వేల వేతనంతో పాటు గ్రాట్యుటీ అమలు చేయాలి.
● హెల్పర్ల పదోన్నతులపై విధివిధానాలను అమలు చేయాలి.
● ఇంటి అద్దెలు, టీఏ బిల్లులు మంజూరు చేయాలి.
● సర్వీస్‌లో మృతి చెందిన వారికి మట్టి ఖర్చుల కింద రూ. 20 వేలు ఇవ్వాలి.
● ప్రీ స్కూల్‌ను బలోపేతం చేసి ‘తల్లికి వందనం’ అమలు చేయాలి.
● ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇవే హామీలు ఇచ్చారని, వీటిని వెంటనే అమలు చేయాలని అంగన్‌వాడీలు డిమాండ్ చేస్తున్నారు.
భయపడేది లేదు..
కూటమి ప్రభుత్వం చేస్తున్న బెదిరింపులకు అంగన్‌వాడీలు భయపడరు. ప్రభుత్వ మెడలు వంచైనా హామీలను నెరవేర్చుకుంటాం. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంగన్ వాడీలను గుర్రాలతో తొక్కించినా భయపడలేదు. ప్రస్తుతం మహాధర్నాను అడ్డుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నారు.
– శకుంతల, ఉమ్మడి జిల్లా అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు
సెలవు ఇవ్వం
ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం ఎవరికీ సెలవు ఇవ్వడం లేదు. సెక్టార్ మీటింగ్ పెట్టుకోవాలని ఆదేశాలు ఉన్నాయి. ప్రభుత్వం అమలు చేయనున్న పథకాల గురించి వివరించడానికి సూపర్‌వైజర్లు మీటింగ్ పెట్టుకుంటున్నారు. అంగన్‌వాడీలపై ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు చేయడం లేదు.
– సాజిదాబేగం, సీడీపీఓ, తాడిపత్రి
అంగన్‌వాడీలపై ఉక్కుపాదం!
అంగన్‌వాడీలపై ఉక్కుపాదం!
Comments
Please login to add a commentAdd a comment