
‘కూటమి’ కపటంపై నిరసనాగ్రహం
అనంతపురం అర్బన్:కూటమి సర్కారు కపటంపై టీచర్లు నిరసనాగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ‘ఫ్యాప్టో’ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ధర్నాకు పీడీ అసోసియేషన్ అమరావతి సంఘాల నాయకులు అక్కులప్ప, పీఎస్‌హెచ్‌ఎం గోవిందరెడ్డి, తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో చైర్మన్ శ్రీనివాస్‌నాయక్, సెక్రటరీ జనరల్ పురుషోత్తం, వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతున్నా ఇప్పటికీ ఉద్యోగులపై దృష్టి పెట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆత్మ గౌరవం దెబ్బతిని అసంతృప్తిలో ఉన్నారని, దీని పర్యవసానాన్ని ప్రభుత్వం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. తక్షణం 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. 11వ పీఆర్‌సీ కాలపరిమితి ముగిసి 21 నెలలైనా 12వ వేతన సవరణ కమిటీపై నూతన ప్రభుత్వం దృష్టి సారించకపోవడం అన్యాయమన్నారు. 12 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనీర్లకు సంబంధించి 11వ పీఆర్‌సీ, డీఏ, సంపాదిత సెలవుల బకాయిలు, సీపీఎస్ ఉద్యోగుల బకాయిలు దాదాపు రూ.30 వేల కోట్లు ఉన్నాయ న్నారు. ఇప్పటికి ప్రభుత్వం రెండు విడతలుగా కేవలం రూ.7,300 కోట్ల బకాయిలను చెల్లించిందన్నారు. మిగిలిన రూ.23 వేల కోట్ల చెల్లింపుపై ప్రభుత్వ కార్యాచరణ ప్రకటించాలన్నారు. అనంతరం కలెక్టర్ వినోద్‌కుమార్‌ను నాయకులు కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో కో– చైర్మన్లు ఓబుళేసు, లింగమూర్తి, డిప్యూటీ సెక్రటరీ జనరర్లు గోవిందరాజులు, రమణారెడ్డి, వెంకటేష్, కార్యదర్శి రత్నం, కోశాధికారి రెహమాన్, కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరెడ్డి, సిరాజుద్ధీన్, రామాంజినేయులు, లింగమయ్య, గోపాల్ రెడ్డి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
‘ఫ్యాప్టో’ మరికొన్ని డిమాండ్లు..
స్థానిక సంస్థల్లో పనిచేస్తూ కోవిడ్ సమయంలో మరణించిన ఉద్యోగ, ఉపాధ్యాయుల వారసులకు కారుణ్య నియామకాలను కలెక్టర్ ఫూల్ నుంచి చేపట్టాలి.
కేంద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు, పోలీసులకు, ఇతర ఉద్యోగులు దాదాపు 10 వేల మందికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.
ఉమ్మడి సర్వీస్ రూల్స్ 72, 73, 74 ప్రకారం ఉపాధ్యాయులకు ఎంసీఓలు, డిప్యూటీ డీఓలు, డైట్ లెక్చరర్లగా పదోన్నతి కల్పించాలి.
ఎంటీఎస్ ఉపాధ్యాయులకు 12 నెలల పూర్తి వేతనం ఇవ్వాలి.
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం ఉపాధ్యాయులను ఫుల్‌టైం ఉపాధ్యాయులుగా పరిగణించాలి.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంతో పాటు సమాంతరంగా తెలుగు మీడియం కొనసాగించాలి.
డిమాండ్ల సాకారానికి ‘ఫ్యాప్టో’ ధర్నా
పెద్ద సంఖ్యలో పాల్గొన్న టీచర్లు