ముంగిళ్లలో వైద్యం | 104 services to the villagers In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ముంగిళ్లలో వైద్యం

Published Sun, Apr 10 2022 11:32 AM | Last Updated on Sun, Apr 10 2022 12:06 PM

104 services to the villagers In Andhra Pradesh - Sakshi

కణేకల్లుకు చెందిన సుబ్బయ్య దివ్యాంగుడు. ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. సాయంగా ఎవరూ లేకపోవడంతో చికిత్స చేయించుకునేందుకు ఆస్పత్రికి వెళ్లలేకపోయాడు. రెండు రోజుల తర్వాత 104 వాహనం గ్రామానికి రాగా వైద్యులే సుబ్బయ్య ఇంటివద్దకు వచ్చి మరీ పరీక్షలు చేశారు. అవసరమైన మందులూ అందించారు. 

బొమ్మనహాళ్‌కు చెందిన సుశీలమ్మ వృద్ధురాలు. వయసుమీద పడటంతో నడవలేని పరిస్థితుల్లో ఉంది. ఆమె ఇటీవల అనారోగ్యానికి గురికాగా 104 వైద్యులే ఆమె ఇంటికి వచ్చి చికిత్స చేశారు.

ఇలా గ్రామీణ ప్రాంతాల వారికి ఎందరికో 104 వాహనం ద్వారా మెరుగైన వైద్యం అందుతోంది. 
రాయదుర్గం: వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ముంగిళ్లలోనే వైద్యసేవలు అందిస్తోంది. అత్యాధునిక సౌకర్యాలు, వైద్య పరికరాలతో కదిలే కార్పొరేట్‌ ఆస్పత్రి లాగా రూపొందించిన 104 మొబైల్‌ మెడికల్‌ క్లినిక్‌ గ్రామీణ ప్రాంతాల్లోని వారికి వరంలా మారింది.  ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, సాంక్రమిక∙వ్యాధుల రోగులకు సంజీవనిలా మారింది.  రూ.201 కోట్లు ఖర్చు చేసి 1,088 వాహనాలను కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.... వాటిలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి 104, 108 వాహనాలుగా తీర్చిదిద్దింది. 2020 జూలై 1వ తేదీన ఈ వాహనాలన్నీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేసి చరిత్ర సృష్టించారు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్‌ 1న అధునాతనమైన సౌకర్యాలతో కూడిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను సీఎం విడుదల చేశారు. 

ప్రతి గ్రామానికీ నెలలో రెండుసార్లు
104 వాహనం ప్రతి గ్రామానికి నెలలో రెండుసార్లు వెళ్తుంది. సాధారణ జబ్బులతో పాటు చిన్నారుల్లో వచ్చే డయేరియా, కౌమారదశలో ఉన్నవారికి వచ్చే రక్తహీనత, సాంక్రమిక వ్యాధుల నిర్ధారణ, చర్మవ్యాధులు, మలేరియా, చికెన్‌ గున్యా, లెప్రసీ, క్షయ, మధుమేహం, రక్తపోటు  తదితర వ్యాధుల నిర్ధారణకు 9 రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసీజీ, ఆక్సిజన్‌ సిలిండర్‌తో పాటు  వాహనంలో 32 రకాల వైద్య పరికరాలు, 74 రకాల మందులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఈ వాహనంలో వైద్యపరీక్షలు చేయడానికి డాక్టర్‌ సీటింగ్‌తో పాటు డేటా ఎంట్రీ కోసం ఆపరేటర్‌కు ప్రత్యేక సౌకర్యాలు   కల్పించారు.

12,03,429 మందికి వైద్య సేవలు
2020 జూలై 1వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 104 వాహనాలను ప్రారంభించారు.  అప్పటి   నుంచి ఉమ్మడి జిల్లా (అనంతపురం, శ్రీసత్యసాయి) వ్యాప్తంగా ఉన్న  62 వాహనాల ద్వారా 896 గ్రామ సచివాలయాల పరిధిలో 2022 మార్చి వరకు 21 నెలల్లో 12,03,429 మందికి వైద్య పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

ఇంటివద్దకే వైద్యం 
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఓపీ చూసే 104 వైద్యులు 1.30 గంటల నుంచి నడవలేని లేని స్థితిలో ఉన్న వృద్ధులు,  దివ్యాంగులు, ఇతర రోగుల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యసేవలు అందిస్తున్నారు. అలాగే పాఠశాలలు, అంగన్‌ వాడీ కేంద్రాల పర్యవేక్షణతో పాటు సీజనల్‌ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.  

ఆర్థిక భారం తగ్గింది 
నాకు షుగర్, బీపీ ఉన్నాయి. పట్టణానికి వెళ్లి ప్రైవేటు వైద్యులతో పరీక్షలు చేయించుకుని, మందులు కొనుక్కురావడానికి నెలకు రూ.వెయ్యి ఖర్చు వచ్చేది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 104 వాహనాన్ని ప్రజల ముంగిటకే పంపి వైద్య సేవలు అందిస్తుండటంతో  మాలాంటి వారికి ఆర్థిక భారం తగ్గింది.  
– సీతారామిరెడ్డి, కణేకల్లు

క్రమం తప్పకుండా 104 వస్తుంది
గతంలో నెలకోసారి, రెండు నెలలకు ఒకసారి వచ్చే 104 వాహనం ప్రస్తుతం 15 రోజులకు  ఒకసారి క్రమం తప్పకుండా వస్తుంది. 104  వైద్యులు రోగులను పరీక్షించి మాత్రలు, ఇంజక్షన్‌లు వేస్తారు. అవసరమైతే రక్త పరీక్షలు, ఈసీజీ నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో 104 వైద్య సేవలను ప్రభుత్వం ఉచితంగా అందించడం ఆనందంగా ఉంది. 
– తిప్పేస్వామి, బీఎన్‌హళ్లి గ్రామం, రాయదుర్గం మండలం

194 మంది సిబ్బందితో వైద్యసేవలు 
ఉమ్మడి జిల్లాలో 104 వాహనాలు 62 ఉన్నాయి. 62 మంది డాక్టర్లు, 66 మంది డీఈఓ(డేటా ఎంట్రీ ఆపరేటర్‌)లు, 66 మంది డ్రైవర్లు మొత్తం 194 మంది సిబ్బంది ప్రతినెలా నిర్ణయించిన తేదీల్లో  గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. 104 వాహనాల్లో      32 రకాల ఆధునిక పరికరాలతో పాటు పాము, తేలు, కుక్క కాటుకు మందులుంటాయి.  
–జి. కృష్ణమూర్తి, 104 ఉమ్మడి జిల్లా మేనేజర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement