
ప్రకాశం జిల్లా అల్లూరు గ్రామంలో వైద్య సేవలందిస్తున్న 104 వాహన సిబ్బంది
సాక్షి, అమరావతి: గ్రామాల్లో మంచానికే పరిమితమైన వృద్ధులు, దివ్యాంగులతోపాటు అనారోగ్య బాధితులకు 104 వాహనాల సంచార వైద్య సేవలు (ఎంఎంయూ) వరంగా మారాయి. అవస్థలు పడుతూ ఎటూ వెళ్లాల్సిన అవసరం లేకుండా వీటి ద్వారా సొంతూరిలోనే మెరుగైన వైద్య సేవలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి, గర్భిణిలకు 104 సేవలు ఎంతో మేలు చేకూరుస్తున్నాయి. ప్రతి నెలా ఠంచన్‌గా ప్రతి గ్రామాన్ని 104 ఎంఎంయూలు సందర్శిస్తూ ప్రజలకు వైద్యం అందిస్తున్నాయి. గత సర్కారు హయాంలో మంచం పట్టిన ఈ వ్యవస్థకు జవసత్వాలు కల్పించి ప్రతి మండలానికి ఒక 104 చొప్పున మొత్తం 656 వాహనాలను సీఎం జగన్ ప్రభుత్వం గతేడాది జూలై 1 నుంచి అందుబాటులోకి తెచ్చింది.
కర్నూలు జిల్లా పాండురంగాపురం గ్రామంలో వైద్యశిబిరం నిర్వహిస్తున్న దృశ్యం
వైద్య సేవలు అందుతున్నాయి ఇలా
► 104 వాహనం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 వరకు గ్రామంలోనే ఉంటుంది. 104 వైద్యుడితో పాటు సంబంధిత పీహెచ్‌సీ వైద్యుడు ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ అక్కడే అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం వరకూ గ్రామ సచివాలయం వద్ద రోగులకు వైద్య సేవలు అందిస్తారు. అనంతరం నడవలేని వారు, మంచానికే పరిమితమైన వృద్ధులు, దివ్యాంగులు, ఇతర రోగులకు ఇళ్ల వద్దకే వెళ్లి డాక్టర్లు సేవలు అందచేస్తారు.
► 104లో ఉండే డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రతి రోగి వివరాలను ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులో పొందుపరుస్తారు. ఆ వివరాలను టెలీమెడిసిన్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు అనుసంధానించి భవిష్యత్‌లో తక్షణమే మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు చేపట్టారు.
► రోగికి మెరుగైన వైద్య సేవలు అవసరం అయితే దగ్గరలోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, జిల్లా ఆసుపత్రులకు, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తారు.
► సంబంధిత రోగిని ఆసుపత్రికి తరలించే బాధ్యతను స్థానిక ఏఎన్‌ఎం నిర్వర్తిస్తుంది.
ఏమిచ్చి రుణం తీర్చుకోను?
పక్షవాతంతో బాధ పడుతున్న నాలాంటి వారికి 104 ప్రాణాలు నిలబెడుతోంది. ఆస్పత్రికి వెళ్లాలంటే ఎన్నో ప్రయాసలు పడేవాడిని. కుటుంబ సభ్యులు రావాల్సిందే. ఆటో అద్దెకు తీసుకుని ప్రతి వారం వెళ్లాల్సి వచ్చేది. ఎంత లేదన్నా కనీసం ఐదారు వందలు ఖర్చయ్యేవి. ఇప్పుడు ఆ సమస్యలన్నీ తొలిగాయి. 104 వైద్యురాలు డాక్టర్ జి. మానస సుప్రియ ఇంటికి వచ్చి మరీ వైద్య సేవలు అందిస్తున్నారు. ఎంత డబ్బిచ్చినా వైద్యులు ఇంటికి వచ్చి సేవలందించడం ఎక్కడో గానీ జరగదు. నాలాంటి వారికి అలాంటి సదుపాయాన్ని కల్పించిన ముఖ్యమంత్రి జగన్‌కు ఏమిచ్చినా రుణం తీరదు.
– చీకట్ల సత్యనారాయణ, ద్రాక్షారామం, తూర్పు గోదావరి జిల్లా
ఖర్చుల భారం తప్పింది
ఐదేళ్లుగా మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్నా. వీటికి తోడు రెండేళ్ల క్రితం ఆయాసం తోడైంది. ప్రతి నెలా మూడో మంగళవారం మా ఊరికి 104 వాహనం వస్తోంది. పైసా ఖర్చు లేకుండా వైద్య పరీక్షలు చేసి మందులు ఇస్తున్నారు. అదే ఆసుపత్రికి వెళితే చార్జీలు, మందులు, ఇతర ఖర్చుల రూపంలో నెలకు రూ. 3 నుంచి రూ.5 వేలు ఖర్చయ్యేవి.
– బాలమ్మగారి గోపాలురెడ్డి, అంగళ్లు గ్రామం చిత్తూరు జిల్లా
నెలలో రెండుసార్లు
నెలలో రెండు రోజులు 104 సంచార వైద్య సేవల వాహనం మా గ్రామానికి వస్తోంది. ఒక రోజు ముందే వలంటీర్లు మాకు సమాచారం ఇస్తున్నారు. షుగర్, బీపీ, పక్షవాతం, గుండె జబ్బులున్న వారిని డాక్టర్లు పరీక్షించి మందులు కూడా ఇంటి వద్దే అందిస్తున్నారు. వైద్యం కోసం పట్టణానికి వెళ్లాల్సిన పనిలేదు.
–బసవసుబ్బారెడ్డి, పాండురంగాపురం, నంద్యాల మండలం, కర్నూలు జిల్లా
కుటుంబమంతా 104 మందులే
మా కుటుంబమంతా గ్రామానికి వచ్చిన 104 వాహనం వద్దకే వెళ్లి ఉచితంగా పరీక్షలు, మందులు తీసుకుంటోంది. మా మనవరాలు గర్భవతి కావడంతో బీపీ, హిమోగ్లోబిన్
లాంటి పరీక్షలు చేశారు. కాల్షియం, ఐరన్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేశారు.
నాకు కూడా షుగర్, బీపీ మాత్రలు ఇచ్చారు. థైరాయిడ్ సమస్య ఉన్నవారికి కూడా పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తున్నారు.
– జయన్న, బిళ్లలాపురం గ్రామం, నంద్యాల మండలం
త్వరలో ఫ్యామిలీ డాక్టర్ విధానం
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలులోకి తీసురానుంది. అంతేకాకుండా ప్రతి గ్రామాన్ని 104 నెలలో రెండు సార్లు సందర్శించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే కొన్నిచోట్ల అమలులోకి తెచ్చాం. మండలంలోని రెండు పీహెచ్‌సీల్లో నలుగురు డాక్టర్లు ఉంటారు. 104లో కూడా ఒక వైద్యుడు ఉంటారు. వీరు ప్రతి గ్రామానికి వెళతారు. రెండు దఫాలు సందర్శించి వైద్యం అందించడం వల్ల వైద్యుడికి సంబంధిత కుటుంబాలపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది.
– వినయ్‌చంద్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో
తిరిగే అవస్థ తప్పింది
గుంటూరు జిల్లా గారపాడుకు చెందిన 55 ఏళ్ల గోలి సూర్యనారాయణ 12 ఏళ్లుగా పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. షుగర్ బాధితుడు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలతో మందులు వాడితే కానీ నియంత్రణలో ఉండదు. వైద్య పరీక్షల కోసం పది కి.మీ దూరంలోని 75 తాళ్లూరు పీహెచ్‌సీ లేదా సత్తెనపల్లి వెళ్లడం దూరాభారమే. ప్రత్యేకంగా ఆటోలో వెళ్లి రావాలంటే జేబుకు చిల్లు పడుతోంది. ఇలాంటి వారందరికీ 104 సంచార వైద్యం వరంగా మారింది. ఇప్పుడు ప్రతి నెలా వైద్యుడు, సిబ్బంది సూర్యనారాయణ ఇంటికే వెళ్లి షుగర్, రక్తపోటు, ఇతర పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు.
తక్షణ సేవలతో కోలుకుని...
అస్వస్థతతో మంచం పట్టిన ఈ వృద్ధురాలి పేరు పతాడ చిన్నమ్మి. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పాంచాలి స్వగ్రామం. ఈ నెల 4న లో బీపీతో కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు ఆశావర్కర్, ఏఎన్‌ఎం సహాయంతో 104కి సమాచారం ఇచ్చారు. సేవల ఎగ్జిక్యూటివ్ ప్రశాంత్ ఆధ్వర్యంలో సిబ్బంది కాశీ, హరగోపాల్ గ్రామానికి చేరుకుని వృద్ధురాలికి చికిత్స అందించడంతో ఆరోగ్యం కుదుటపడింది.
Comments
Please login to add a commentAdd a comment