సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులను చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి 50 కి.మీకు ఒక్క పోర్టు లేదా ఫిషింగ్ హార్బరు (మినీ పోర్టు)లను నిర్మిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి నాలుగు పోర్టులతో పాటు పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టి రికార్డు సృష్టించింది. ఇందుకోసం సుమారు రూ.20,000 కోట్లు వ్యయం చేస్తుండటం గమనార్హం. తొలి దశలో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల పనులు దాదాపు పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధం కానున్నాయి.
ఎగుమతులను ప్రోత్స హించే విధంగా తీర ప్రాంత అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. 2022 సంవత్సరానికి నీతి ఆయోగ్ ప్రకటించిన ఎగుమతి సన్నద్ధత రాష్ట్రాల్లో రాష్ట్రం 59.27 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. మరోవైపు మత్స్యకారులు చేపల వేటకు గుజరాత్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు.
మరో వైపు పోర్టులను ఆధారంగా చేసుకుని చుట్టుపక్కలా పారిశ్రామిక ప్రగతిని వెదజల్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. సుమారు 8,000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కుతో పాటు తెట్టు వద్ద కార్గొ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. ఫిషింగ్ హార్బర్ల సమీపంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఎగుమతుల్లో 10 శాతం వాటా లక్ష్యం
దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎగుమతుల్లో 10 శాతం వాటాను చేజిక్కించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. 2030 నాటికి 10 శాతం మార్కెట్ వాటాతో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవాలన్న లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆరు నెలల కాలంలో రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల విలువ రూ. 82,732.65 కోట్ల నుంచి రూ.85,021.74 కోట్లకు చేరాయి.
ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా ఎగుమతుల విలువ రూ. 18,17,640.99 కోట్ల నుంచి రూ. 17,42,429.99 కోట్లకు పడిపోవడం గమనార్హం. 2022–23 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రాష్ట్రం రూ.1,59,368.02 కోట్ల ఎగుమతులు చేయడం ద్వారా 4.40 శాతం వాటాతో ఆరో స్థానంలో నిలవగా, ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో రూ. 85,021.74 కోట్ల ఎగుమతులతో దేశ ఎగుమతుల్లో రాష్ట్ర వాటాను 4.88 శాతంకు పెంచుకొని ఐదో స్థానానికి ఎగబాకింది.
ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు
♦ విశాఖపట్నం జిల్లా భీమిలి
♦ అనకాపల్లి జిల్లా రాజయ్యపేట, దొండవాక
♦ విజయనగరం జిల్లా చింతపల్లి
♦ తిరుపతి జిల్లా రాయదరువు
♦ కాకినాడ జిల్లా ఉప్పలంక
Comments
Please login to add a commentAdd a comment