మూడేళ్ల కిందట... సరిగ్గా ఇదే రోజు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొత్త చరిత్రను లిఖించే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. తన మేనిఫెస్టోను నమ్మి 150 సీట్ల అఖండ మెజారిటీతో జేజేలు కొట్టిన జనాకాంక్షలను నెరవేర్చడానికి తొలిరోజు నుంచే శ్రమించటం మొదలెట్టారు. ఫలితం... స్కూళ్లు, ఆసుపత్రులు మారాయి. ఆర్బీకేలతో రైతు జీవితమూ మారింది. సచివాలయాలు గ్రామాలకే వచ్చాయి. ప్రభుత్వ పథకాలు వలంటీర్ల చలవతో ఇళ్లకే వచ్చాయి.
మొత్తంగా గ్రామాల జీవన చిత్రమే మారిపోయింది. రెండేళ్లకుపైగా కోవిడ్ జనజీవితాల్ని, ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేసింది. అయినా రాష్ట్రంలో ఏ కార్యక్రమమూ ఆగలేదు. ఈ మూడేళ్లలో వివిధ సామాజిక వర్గాల్లోని నిరుపేదలు, నిరాధారుల అభ్యున్నతికి సీఎం జగన్ ఏకంగా రూ.1.84 లక్షల కోట్లు ఖర్చుచేశారు. దీన్లో 1.41 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే వేశారు. అందుకే... తానేం చేశారో ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఎమ్మెల్యేలను, పార్టీ నేతలను రాష్ట్రంలోని ప్రతి గడపకూ పంపి మరీ చెబుతున్నారు.
అమరావతి–సాక్షి ప్రతినిధి: మే 30, 2019న ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనుంచి రాష్ట్ర ప్రజలందరికీ చెప్పిన మాటకు అనుగుణంగా మూడేళ్ల పాలన కొనసాగించారు. కోవిడ్ సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయి.. మరో పక్క వ్యయం పెరిగినప్పటికీ పేదల సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను నిరంతరంగా అమలు చేశారు. పైగా సంక్షేమ క్యాలెండర్‌ను ముందే ప్రకటించి ఆ మేరకు పథకాల ప్రయోజనాలను ఆయా వర్గాలకు అందించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మూడేళ్లలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపులు, అగ్రవర్ణ పేదల సంక్షేమం, అభ్యున్నతికి ఏకంగా రూ.1,84,930.60 కోట్లు వ్యయం చేశారు.
ఇందులో ఆయా వర్గాల సంక్షేమ పథకాలకు నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.1,41,247.94 కోట్లు ఇవ్వగా, నగదేతర పథకాల ద్వారా రూ.43,682.65 కోట్లు వ్యయం చేశారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం కూడా ఈ వర్గాలకు ఇంత తక్కువ వ్యవధిలో ఈ స్థాయి మొత్తం వెచ్చించిన దాఖలాలు లేవు. గత చంద్రబాబు సర్కారులో ఈ వర్గాలకు బ్యాంకు రుణాలే దిక్కయ్యాయి. అవి కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే మంజూరయ్యేవి. టీడీపీ నేతలు సిఫార్సు చేసిన వారికి, లంచాలు ఇచ్చిన వారికే రుణాలు వచ్చేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. అర్హతే ప్రమాణికంగా లబ్దిదారుల ఖాతాలకు నగదు బదిలీ చేశారు. నగదు బదిలీలో అత్యధిక లబ్దిదారులు జనాభా నిష్పత్తి ప్రకారం బీసీ వర్గాలే.
బీసీలకు తగిన వాటా
బీసీలంటే దేశానికి బ్యాక్ బోన్ అంటూ పాద యాత్రతో పాటు ఎన్నికల ముందు నిర్వహించిన బీసీ సదస్సులో కొత్త నిర్వచనం చెప్పిన వైఎస్ జగన్..మూడేళ్ల పాలనలో ఇటు అభివృద్ది, సంక్షేమంలో బీసీలకు సామాజిక న్యాయం చేశారు. నవరత్నాల్లోని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల ద్వారా బీసీల కోసం రూ.89,024.67 కోట్లు వెచ్చించారు. ఇందులో రూ.65,973.10 కోట్లు నేరుగా నగదు బదిలీ ద్వారానే అందజేశారు.
అభివృద్ది పథకాల కింద నాన్ డీబీటీ ద్వారా మరో రూ.23,051.56 కోట్లు వెచ్చించారు. ఇళ్ల స్థలాల లబ్దిదారుల్లో అత్యధికంగా 16.70 లక్షల మంది బీసీ లబ్దిదారులే. ఈ వర్గాల ఇళ్ల స్థలాల సేకరణ, పరిహారం చెల్లింపునకు ఏకంగా రూ.14,661 కోట్లు వెచ్చించారు. వైఎస్సార్ రైతు భరోసా కింద 24.61 లక్షల బీసీ రైతులకు రూ.9,369.86 కోట్లు అందజేశారు.
ఎస్సీ వర్గాలకు భారీ వ్యయం
నవరత్నాల ద్వారా మూడేళ్లలోనే ఎస్సీల సంక్షేమం, అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.31,153.95 కోట్లు వ్యయం చేసింది. ఇందులో సంక్షేమ పథకాల ద్వారా నేరుగా నగదు బదిలీతో రూ.22,528.04 కోట్లను జమ చేయగా.. నగదేతర బదిలీ పథకాల ద్వారా రూ.8,625.91 కోట్లు వ్యయం చేశారు. వైఎస్సార్ రైతు భరోసా కింద 5.23 లక్షల ఎస్సీ రైతులకు రూ.2063.70 కోట్లు ఇచ్చారు. 6.36 లక్షల ఎస్సీల ఇళ్ల స్థలాల సేకరణ, పరిహారం కోసం రూ.5589 కోట్లు వ్యయం చేశారు.
ఎస్టీల సంక్షేమానికి రూ.9,243.68 కోట్లు
ఎస్టీల అభివృద్ది, సంక్షేమానికి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.9,243.68 కోట్లు వ్యయం చేశారు. ఇందులో సంక్షేమ పథకాల ద్వారా నేరుగా రూ. 7,035.51 కోట్లు నగదు బదిలీ చేయగా.. నగదేతర పథకాల ద్వారా మరో రూ.2,208.17 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది. వైఎస్సార్ రైతు భరోసా కింద 3.92 లక్షల ఎస్టీ రైతులకు రూ. 1346.95 కోట్లు నగదు బదిలీ చేశారు. అలాగే 1.41 లక్షల ఎస్టీల ఇళ్ల స్థలాల సేకరణ, పరిహారం కోసం రూ.1242 కోట్లను వ్యయం చేశారు.
మైనారిటీల కోసం రూ..8,595.50 కోట్లు
చంద్రబాబు సర్కారులో మైనారిటీలంటే ఓటు బ్యాంకు మాత్రమే. జగన్ మూడేళ్లలో వారి సంక్షేమం, అభివృద్ది కోసం రూ.8,595.50 కోట్లు వ్యయం చేశారు. ఇందులో నేరుగా రూ.5,456.76 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయగా... మరో రూ.3,138.74 కోట్ల మేర ప్రయోజనాలు ఇతర పథకాల ద్వారా అందాయి. 2.52 లక్షల మంది మైనారిటీల ఇళ్ల స్థలాల సేకరణ, పరిహారం కోసం రూ.2,214 కోట్లు వ్యయం చేశారు. వైఎస్సార్ రైతు భరోసా కింద 60 వేల మైనారిటీ రైతులకు రూ.251.75 కోట్లు ఇచ్చారు.
కాపుల కోసం రూ.14,438.78 కోట్లు
చంద్రబాబు సర్కారు కాపులను రిజర్వేషన్ల పేరుతో మభ్యపెట్టి వంచించగా జగన్ సర్కారు ఆచరణ సాధ్యమైన హామీలనే ఇచ్చి మూడేళ్లలో అమలు చేసి చూపించింది. కాపుల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.14,438.78 కోట్లు వెచ్చించారు. దీన్లో సంక్షేమ పథకాల ద్వారా నేరుగా రూ.12,011.50 కోట్లు నగదు బదిలీ చేశారు. ఇతర పథకాల ద్వారా మరో రూ. 2,427.20 కోట్ల మేర ప్రయోజనాలు అందాయి. 2.46 లక్షల మంది కాపుల ఇళ్ల స్థలాల సేకరణ, పరిహారం కోసం రూ.2,160 కోట్లు వ్యయం చేశారు. వైఎస్సార్ రైతు భరోసా కింద 7.85 లక్షల కాపు రైతులకు రూ.2923.59 కోట్లు ఇచ్చారు.
అగ్రవర్ణ పేదలకు రూ.28,716.02 కోట్లు
పేదరికానికి కులం, మతం లేదని గట్టిగా నమ్మిన జగన్... అగ్రవర్ణాల్లోని పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం మూడేళ్లలో రూ.28,716.02 కోట్లు వ్యయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment