మనసా.. వాచా.. ఇచ్చిన మాటే.. ఇన్నేళ్ల అజెండా | CM Jagan 3 Years Rule in Andhra Pradesh Creates New History in Politics | Sakshi
Sakshi News home page

CM Jagan: మనసా.. వాచా.. ఇచ్చిన మాటే.. ఇన్నేళ్ల అజెండా

Published Sat, May 28 2022 2:39 AM | Last Updated on Sat, May 28 2022 9:21 PM

CM Jagan 3 Years Rule in Andhra Pradesh Creates New History in Politics - Sakshi

అమరావతి– సాక్షి ప్రతినిధి: మూడేళ్లు. ఒకరకంగా తక్కువే. కానీ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అది చాలా ఎక్కువ. మీడియా– రాజకీయాలు – వ్యవస్థలన్నీ కలిసిపోయి ఒక వర్గానికే కొమ్ముకాస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో వారికి వ్యతిరేకంగా జెండా ఎగురవేసి నెగ్గటమే ఒక చరిత్ర. ఆ తరవాత కూడా కుట్రలను తిప్పికొడుతూ దిగ్విజయంగా ముందుకెళ్లటం మరో చరిత్ర. అలా ఈ మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ ఒక కొత్త చరిత్రను రాసుకుంటూ ముందుకెళుతోంది. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి ప్రధాన రంగాల్లో సమూల మార్పులు మొదలయ్యాయి. ఎలాంటి సంక్షోభ సమయంలోనైనా పేదల బతుక్కి ఢోకా లేదన్న భరోసా ఈ రాష్ట్రంలో మాత్రమే ఉంది. ఏ ఆధారం లేని వృద్ధులు సహా పలు వర్గాలకు ఠంచన్‌గా ఒకటో తేదీనే పింఛను నడుచుకుంటూ ఇంటికొస్తోంది.

దాదాపు 31 లక్షల మందికిపైగా పేద కుటుంబాల సొంతింటి కల... స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని దశాబ్దాల తరవాత నెరవేరుతోంది. మహిళలు చిరు వ్యాపారాలు సైతం చేస్తూ తమ కాళ్లపై తాము నిలబడ్డారు. ఒకటేమిటి... చెప్పుకుంటూ పోతే మూడేళ్లలో ఈ రాష్ట్రం ఎన్నో మార్పులు చూసింది. మూడేళ్ల కిందటి కంటే తామిప్పుడు బాగున్నామనేది ఇక్కడి ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్న నిజం. మున్ముందు మరింత బాగుంటామన్న నమ్మకమూ వారికుంది. మూడేళ్ల కిందట మే 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి... అభివృద్ధికిచ్చే నిర్వచనమిది. ఆ మార్పును ‘సాక్షి’ పాఠకులకు చూపించడానికే ఈ వరస కథనాలు... 

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మళ్లీ ఎన్నికల ముందు మాత్రమే నేతలకు గుర్తుకు రావటమన్నది గతమంతా చూసిన చరిత్ర. వైఎస్‌.జగన్‌ దీనికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. మేనిఫెస్టోలో చెప్పింది చెయ్యటమే తన పరిపాలన అజెండాగా పెట్టుకున్నారు. మాట తప్పకూడదన్న చిత్తశుద్ధితో తొలిరోజు నుంచే హామీల అమలుకు నడుంకట్టారు. అందుకే మూడేళ్లలో నవరత్నాల ద్వారా 95 శాతానికి పైగా హామీలను అమలు చేయగలిగారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రెండున్నర లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసి.. మరో 42వేల కోట్లు బకాయిలు పెట్టినా...పులిమీద పుట్ర మాదిరి మూడేళ్లుగా కోవిడ్‌ మహమ్మారి విజృంభించి రాషŠట్ర ఆదాయం తగ్గిపోయినా వెనుకంజ వేయలేదు. సంక్షోభంలో సైతం జన జీవనాలు తల్లకిందులు కాకూడదన్న ఉద్దేశంతో వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా రూ.1.40 లక్షల కోట్లను నేరుగా జనం ఖాతాల్లోకి బదిలీ చేశారు. వీటి లబ్దిదారులను కుల, మత, రాజకీయాలకు తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా వైఎస్‌ఆర్‌ నవశకం పేరిట ఇంటింటి సర్వే చేయించి మరీ ఎంపిక చేశారు. అందుకే ఈ మొత్తంలో పైసా కూడా పక్కదోవ పట్టకుండా నేరుగా అర్హుల్ని చేరింది.  

కరోనా సంక్షోభంలో అండగా 
ఎన్నో రాష్ట్రాలు... కరోనా సాకుతో పథకాలు ఆపేశాయి. వ్యాపార సంస్థలు సైతం జీతాలకు కోతలు పెట్టాయి. ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం ఈ సమయంలో మరింత అండగా ఉండాలనుకున్నారు. విపత్తు సమయంలోనూ వైఎస్‌ఆర్‌ భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం, రైతులకు సున్నా వడ్డీ, ఉచిత పంటల బీమా, మత్స్యకారులకు వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా,  విద్యార్ధులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ అందజేశారు. రాష్ట్ర జనాభాల్లో 95 శాతం మందికి వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ ద్వారా భరోసా ఇచ్చారు. కోవిడ్‌–19 , బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలనూ ఆరోగ్య శ్రీలోకి చేర్చి లక్షల మంది పేదల బతుకుల్ని ఆర్థిక మహమ్మారి కాటేయకుండా కాపాడారు. ఆరోగ్య ఆసరాను ఆరంభించి... ఆసుపత్రుల్లో చికిత్స అనంతరం వైద్యులు సూచన మేరకు విశ్రాంతి సమయంలో పెన్షన్‌ ఇచ్చారు.  

ప్రతి నిరుపేదకూ సొంతిల్లు! 
కూడు–గూడు– గుడ్డ కనీసావసరాలని తెలుసు కానీ... పేదలకు సొంతిల్లు ఎప్పటికీ కలే. ఈ కలను నిజం చేశారు ముఖ్యమంత్రి జగన్‌. పేదల ఇళ్ల కోసం వేల ఎకరాలను వేల కోట్ల రూపాయలతో భూములు సేకరించిన ప్రభుత్వం చరిత్రలో ఇదొక్కటే. ఏకంగా 31 లక్షల మందికి పైగా మహిళల పేరిట ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయించి... ప్రభుత్వ సంపదను అర్హులకు చేరవేయటమెలాగో చూపించారు. నిరుపేదలను పైకి తేవటమెలాగో మార్గదర్శనం చేస్తూ.. మరోవంక రాజకీయంగా, అధికారిక పదవుల్లో కూడా సమాజంలోని అన్ని వర్గాలకూ అవకాశాలిస్తూ ముందడుగు వేశారు. ఈ మేరకు చట్టాలూ చేశారు. ముఖ్యంగా సమాజంలో సగం ఉన్న మహిళలకు అన్నింటా సమాన అవకాశాలు కల్పిస్తూ చట్టం చేసి అమలు చేశారు. గతంలో చంద్రబాబు పాలనలో  సంపద, పదవులు కొన్ని వర్గాలకే... కొందరు వ్యక్తులకే పరిమితం. అందుకే అట్టడుగు పేదలు, రైతులు, మహిళలు, విద్యార్ధుల్లో నిరాశ నిస్పృహలు తలెత్తి ఆందోళనలకు దిగారు. గడిచిన మూడేళ్లలో అలాంటి ఛాయలే లేకపోవటం పాలనపై ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ లాంటిదే.  

గ్రామ స్వరాజ్యం ఎట్‌ ఏపీ 
గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని... అధికారం చేపట్టిన 5 నెలలకే అతి వేగంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా అమల్లోకి తెచ్చారు జగన్‌. ప్రభుత్వ పథకమైనా, కార్యక్రమమైనా లేక ఆ గ్రామస్థులకు ఏ అవసరం వచ్చినా  కేరాఫ్‌ గ్రామ, వార్డు సచివాలయాలే. గ్రామాల్లో ప్రతీ 50 ఇళ్లకూ ఓ వలంటీర్‌. పట్టణాల్లో 100 ఇళ్లకు ఓ వార్డు వలంటీర్‌. ఇలా 2.70 లక్షల మంది సైన్యంతో ప్రభుత్వ పాలన, పథకాలను ఇళ్ల ముందుకు తీసుకెళ్లారు. ఈ గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా 1.34 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. దేశ చరిత్రలో ఇదో అరుదైన చరిత్రని చెప్పాలి. అధికారం చేపట్టిన 5 నెలల్లోనే 4.04 లక్షల మంది యువతకు ఉద్యోగాలివ్వటమంటే మామూలు కాదు. ఇక మద్యంతో పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలు ఎలా చెడిపోతున్నాయో పాదయాత్రలో స్వయంగా చూడటంతో... అధికారంలోకి వచ్చిన వెంటనే 20 శాతం మద్యం దుకాణాలు తగ్గించడమే కాక బెల్టు షాపులు, పర్మిట్‌ రూమ్స్‌ను తీసేశారు.  

విద్య, వైద్యం, వ్యవసాయం... 
– విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను ప్రాధాన్య రంగాలుగా తీసుకుని... వాటిల్లో సామాజిక మౌలిక వసతుల కల్పనకు ఏకంగా రూ.49,110 కోట్లతో ప్రాజెక్టులను చేపట్టారు.  

– ‘మన బడి నాడు–నేడు’ కార్యక్రమంతో 61,661 స్కూళ్లు రూపు రేఖలు మార్చేందుకు ఏకంగా రూ.16,450.69 కోట్ల వ్యయం చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ,ఇప్పటికే తొలి దశలో 15,713 స్కూళ్లలో రూ.3697.86 కోట్లతో పనులు పూర్తి చేశారు. రెండో దశలో 25 వేలకుపైగా స్కూళ్లలో రూ.8000 కోట్ల వ్యయంతో నాడు–నేడు పనులను చేపట్టారు. 

– బాబు సర్కారు నీరు గార్చిన ఆరోగ్య శ్రీకి ఊపిరి పోయడమే కాకుండా పేద, మధ్య తరగతికి కూడా వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ వర్తించేలాగ వార్షిక ఆదాయ పరిమితిని 5 లక్షలకు పెంచి... రాష్ట్రంలోని 95 శాతం కుటుంబాలకు ఆరోగ్య భరోసా ఇచ్చారు. 39 వేల పోస్టుల భర్తీకి అనుమతించి... ఇప్పటికే 9 వేల పోస్టులకు పైగా భర్తీ చేశారు.  

– ప్రస్తుతం ఉన్న ఆస్పత్రుల్లో వసతుల కల్పనతో పాటు కొత్త ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి రూ.16,255 కోట్ల వ్యయంతో ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నారు. రూ.7,880 కోట్ల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేసున్న 16 మెడికల్‌ కాలేజీల్లో ఇప్పటికే పులివెందుల, పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నం, అమలాపురం, విజయనగరం కాలేజీల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 

– గ్రామాల్లోని రైతులకు అక్కడే విత్తనం నుంచి పంటల విక్రయం వరకు అండగా ఉండేందుకు ‘రైతు భరోసా కేంద్రాల’కు రూపకల్పన చేశారు సీఎం జగన్‌. 10,315 వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల శాశ్వత భవన నిర్మాణాలను రూ.2269.30 కోట్లతో చేపట్టారు.  

– ఆర్బీకేలకు అనుబంధంగా వ్యవసాయ అనుబంధ రంగాల మౌలిక వసతుల కల్పనకు ఏకంగా రూ.16,404.86 కోట్ల వ్యయంతో గోదాములు, కోల్డ్‌ రూమ్‌లు, డ్రైయింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ తదితర ప్రాజెక్టులను చేపడుతున్నారు.  
 
జీవితాలు దెబ్బతినకుండా కాపాడారు... 
పశ్చిమ దేశాల్లో అత్యంత క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పడు ప్రజల ఖాతాల్లోకి ఉచితంగా డబ్బులు వేసి వారి కొనుగోలు శక్తి పెంచడం ద్వారా జనజీవనం దెబ్బతినకుండా చూసే పద్దతిని హెలీకాఫ్టర్‌ మనీగా పిలుస్తాం. ఇక్కడ పథకాల ద్వారా ప్రజల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేసి ముఖ్యమంత్రి జగన్‌ వారి జీవన ప్రమాణాలు పెంచుతున్నారు. ఇలా చేసి కరోనా కష్టకాలంలో ప్రజల ఉపాధి పోయి, జనజీవనం అస్థవ్యస్థమయ్యే ప్రమాదం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించారనే చెప్పాలి. కరోనాతో ప్రజలే కాదు, ప్రభుత్వాలు సైతం ఆదాయం లేక అల్లాడిపోయాయి. అలాంటి క్లిష్ట సమయంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించడమంటే తేలిక్కాదు. ఈ నగదు ప్రజల అత్యవసరాలకు ఉపయోపడింది. జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా కాపాడింది. 
– డాక్టర్‌ శామ్యూల్‌ దయాకర్, రాజనీతి శాస్త్రం విభాగం హెడ్, ఆంధ్ర లయోలా కాలేజీ, విజయవాడ. 

ప్రజలతోపాటు మార్కెట్‌ను బతికించారు 
కోవిడ్‌ సంక్షోభ సమయంలో ఆదాయం లేని ప్రజలకు ఏదో ఒక రూపంలో డబ్బులు అందించడం వల్ల వారిలో కొనుగోలు శక్తి పెరిగి మార్కెట్‌ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇది వారి జీవన ప్రమాణాలను పెంచటంతో పాటు మార్కెట్‌ వ్యవస్థను బతికించింది. డిమాండ్‌ సప్‌లై పద్దతి పుంజుకుని నిలదొక్కుకుంది. కోవిడ్‌ సమయంలో రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా సామాన్యుల కష్టాలను తీర్చేందుకు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా సీఎం జగన్‌ కొనసాగించడం దేశంలోనే రికార్డు. 
– కొనకళ్ల విద్యాధరరావు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, ఇండస్ట్రీస్‌ అధ్యక్షుడు, విజయవాడ 

సీఎం భరోసా ఎప్పటికీ మరువలేం 
కోవిడ్‌ మహమ్మారి విజృంభించిన సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లకే పరిమితయ్యాం. ఆ కష్ట సమయంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన భరోసా ఎప్పటికీ మరిచిపోలేం. ఉపాధి కోల్పోయిన ఎంతో మందికి సంక్షేమ పథకాలతో ప్రాణాలు నిలిపారు. రెండేళ్ల క్రితం కోవిడ్‌ విజృంభించిన సమయంలో నాకు అమ్మ ఒడి పథకంలో రూ.15 వేలు వేశారు. అదే ఏడాది డ్వాక్రా రుణమాఫి రూ.18,500, సున్నా వడ్డీగా రూ.2,500 వచ్చాయి. ఈ ఏడాది జగనన్న విద్యా దీవెన ద్వారా రూ.25వేలు, డ్వాక్రా రుణమాఫీ రూ.18,500, సున్నా వడ్డీ రూ.2,500 ఇస్తున్నారు. 
– కె.విజయ, గృహిణి, అయిభీమవరం, పశ్చిమగోదావరి జిల్లా.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement