జగనన్న విదేశీ విద్యా దీవెనకు 546 దరఖాస్తులు | 546 applications for Jagananna Videsi Vidya Deevena | Sakshi
Sakshi News home page

జగనన్న విదేశీ విద్యా దీవెనకు 546 దరఖాస్తులు

Published Tue, Nov 1 2022 4:50 AM | Last Updated on Tue, Nov 1 2022 5:00 AM

546 applications for Jagananna Videsi Vidya Deevena - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద వర్గాలకు చెందిన పిల్లలు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం ఉద్దేశించిన ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’కు సోమవారం నాటికి మొత్తం 546 దరఖాస్తులొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం మహోన్నత లక్ష్యంతో ప్రకటించిన ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు తొలుత సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఇచ్చిన సంగతి తెల్సిందే. ఆ గడువు ముగిసిన అనంతరం ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకుగాను అక్టోబర్‌ నెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

అర్హత ఉన్న ప్రతి విద్యార్థికీ విదేశీ విద్య అందాలనే లక్ష్యంతో తాజాగా ఆ గడువును మరింత కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు హర్షవర్థన్‌ చెప్పారు. సోమవారంతో ముగిసిన గడువు మరికొంత కాలం కొనసాగుతుందని.. అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. కాగా, ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు విదేశాల్లో చదువుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


ప్రపంచ వ్యాప్తంగా ఒకటి నుంచి 200 క్యూఎస్‌ ర్యాంకులు కలిగిన వర్సిటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయమందిస్తుంది. ఒకటి నుంచి వంద క్యూఎస్‌ ర్యాంకింగ్‌ కలిగిన వర్సిటీల్లో సీట్లు తెచ్చుకున్న విద్యార్థులకు ఫీజు రూ.కోటి అయినా నూరు శాతం ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తుంది. అలాగే క్యూఎస్‌ ర్యాంకుల్లో 101 నుంచి 200 లోపు కలిగిన వర్సిటీల్లో సీట్లు తెచ్చుకుంటే.. రూ.50 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేసేలా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని రూపొందించారు.

ఈ పథకానికి వార్షిక ఆదాయం రూ.8 లక్షల వరకు పెంచడం విశేషం. అర్హులందరికీ ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ ఇస్తుంది. ఇప్పటి వరకు 546 దరఖాస్తులు రాగా, వాటిలో శాఖల వారీగా పరిశీలించి ఆమోదించినవి 82 ఉన్నాయి. మరో 48 ధరఖాస్తులు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో తిరస్కరించారు. 416 దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement