దళారుల చేతిలో మోసం | 8 people went to Oman For employment stuck | Sakshi
Sakshi News home page

ఉపాధి కోసమని ఒమన్‌ వెళ్లిన 8 మంది అవస్థలు

Aug 20 2022 4:13 AM | Updated on Aug 20 2022 10:03 AM

8 people went to Oman For employment stuck - Sakshi

తమను కాపాడాలని కోరుతున్న ఒమెన్‌లో చిక్కుకున్న యువకులు

రెండేళ్ల పాటు వెల్డింగ్‌ పనులుంటాయని చెప్పారని, మంచి జీతాలొస్తాయని నమ్మించడంతో ఒక్కొక్కరూ రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకూ చెల్లించారు. తీరా చూస్తే దళారులు చెప్పిన కంపెనీ ఆ దేశంలోనే లేదు.

కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎనిమిది మంది దళారుల చేతిలో మోసపోయారు. వారి మాటలు విని ఓ కంపెనీలో వెల్డింగ్‌ పనులు చేసే నిమిత్తం ఒమన్‌ దేశానికి వెళ్లారు.. అక్కడకు వెళ్లాక అసలు అలాంటి కంపెనీయే లేదని తెలియడంతో లబోదిబోమంటున్నారు. వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన తామాడ కృష్ణారావు(తోటపల్లి), కీలు మాణిక్యరావు(తేరపల్లి), కర్ని లోకనాథం(గోపీనాథపురం), కంచిలి మండలానికి చెందిన పి.రవికుమార్, గున్నా గోపాల్‌(పెద్దపాలేరు), సోంపేట మండలానికి చెందిన సీల వాసుదేవరావు(బి.రామచంద్రపురం), సంతబొమ్మాళి మండలానికి చెందిన కల్గి నాయుడు(గోవిందపురం), మందస మండలానికి చెందిన తలగాన నీలకంఠం(బాలాజీపురం)లు ఈ ఏడాది మేలో విశాఖపట్నంలోని కార్తికేయ కన్సల్టెంట్‌ కంపెనీ ద్వారా ఒమెన్‌కు వెళ్లారు.

రెండేళ్ల పాటు వెల్డింగ్‌ పనులుంటాయని చెప్పారని, మంచి జీతాలొస్తాయని నమ్మించడంతో ఒక్కొక్కరూ రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకూ చెల్లించారు. తీరా చూస్తే దళారులు చెప్పిన కంపెనీ ఆ దేశంలోనే లేదు. చివరకు ఒంటెలకు కాపలా కాస్తూ రోజులు గడుపుతున్నామని, మూడు నెలలుగా ఉపాధి లేక, కడుపు నిండా తిండి లేక ఇబ్బందిపడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద ఉన్న పాస్‌ పోర్టు, వీసాలు నకిలీవంటూ అక్కడి పోలీసులు తీసుకెళ్లారని అక్కడ నుంచి బంధువులకు సమాచారం అందజేశారు. 

క్షేమంగా ఇంటికి తీసుకొస్తాం..: మంత్రి అప్పలరాజు 
ఉపాధి కోసం వెళ్లి ఒమన్‌ దేశంలో చిక్కుకుపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు హామీ ఇచ్చారు. జరిగిన విషయాన్ని బాధితుల బంధువులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఆయన శుక్రవారం పలాసలోని తన క్యాంపు కార్యాలయం నుంచి బాధితులతో ఫోన్‌లో మాట్లాడారు. ఒమన్‌లో వారు పడుతున్న కష్టాలను తెలుసుకున్నారు. అధైర్యపడొద్దని ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని, క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత తీసుకుంటుందని ధైర్యం చెప్పారు. ఇండియన్‌ ఎంబసీ అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. బాధితుల తల్లిదండ్రులు, బంధువులు ఎవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు.
చదవండి:గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3,000 కోట్లు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement