పరీక్షల నిర్వహణతోనే ప్రయోజనం | Admission to higher studies is a problem if the inter examinations are not held | Sakshi
Sakshi News home page

పరీక్షల నిర్వహణతోనే ప్రయోజనం

Published Thu, Jun 24 2021 4:11 AM | Last Updated on Thu, Jun 24 2021 4:11 AM

Admission to higher studies is a problem if the inter examinations are not held - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాఠశాల విద్య తదుపరి ఉన్నత తరగతుల ప్రవేశాలు టెన్త్,  ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలతో ముడిపడి ఉండడంతో ఇప్పుడందరి దృష్టి వీటి నిర్వహణపైనే కేంద్రీకృతమైంది. ఉన్నత తరగతుల ప్రవేశాలే కాకుండా విద్యార్థుల భవిష్యత్తు కూడా ఈ పరీక్షల్లో సాధించే మెరిట్‌పై ఆధారపడి ఉండడంతో ఈ పరీక్షల ప్రాధాన్యత చర్చకు దారితీస్తోంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ పరీక్షల నిర్వహణకు ఆయా బోర్డుల అధికారులు షెడ్యూళ్లు ప్రకటించి ఏర్పాట్లు చేసినా కరోనా కేసులు పెరగడంతో వాయిదా పడ్డాయి. కేసులు తగ్గి పరిస్థితుల అనుకూలతను బట్టి పరీక్షలపై ముందుకెళ్లాలని ప్రభుత్వం భావించింది. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా ఈ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో వ్యాజ్యాల విచారణతో పరీక్షలపై ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. విద్యార్థుల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఈ పరీక్షలు నిర్వహించకపోతే అది వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది తలెత్తిన పరిస్థితులను వారు దీనికి తార్కాణంగా చూపిస్తున్నారు. 

ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు ఇబ్బంది
రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జి టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని 4 ట్రిపుల్‌ ఐటీల్లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లోకి టెన్త్‌ మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది కోవిడ్‌ కారణంగా పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో టెన్త్‌ విద్యార్థులందరినీ ఆల్‌పాస్‌గా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. విద్యార్థులకు గ్రేడ్లు లేకుండా పాస్‌ చేయడంతో ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు ఆర్జీయూకేటీ–సెట్‌ పేరిట ప్రత్యేకంగా ప్రవేశపరీక్ష నిర్వహించాల్సి వచ్చింది. ఫిజిక్సు, కెమిస్ట్రీ, మేథమెటిక్స్‌ సబ్జెకులపై ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలతో జరిగిన ఈ పరీక్షను లక్షమందికిపైగా టెన్త్‌ విద్యార్థులు రాయవలసి వచ్చింది. మారుమూల గ్రామీణ ప్రాంత ప్రభుత్వ స్కూళ్లలో చదివే నిరుపేద విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యను అందించడానికి ట్రిపుల్‌ ఐటీలు ఏర్పాటు కాగా గత ఏడాది టెన్త్‌ పరీక్షలు నిర్వహించనందున ఆ లక్ష్యానికి విఘాతం ఏర్పడింది. ప్రవేశపరీక్ష వల్ల ట్రిపుల్‌ ఐటీల్లోని 60 శాతం సీట్లు ప్రయివేటు స్కూళ్ల విద్యార్థులకే దక్కాయి. 

ఇంటర్‌ ప్రవేశాలకూ అడ్డంకే
ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు గత ఏడాదిలోనే ఆన్‌లైన్‌ విధానాన్ని ఇంటర్‌బోర్డు ప్రవేశపెట్టింది. ప్రయివేటు విద్యాసంస్థలు ఇష్టానుసారం ప్రవేశాలు నిర్వహించకుండా సీబీఎస్‌ఈ నిబంధనలను అనుసరించి సీట్లు కేటాయిస్తూ ఆన్‌లైన్లో ఈ ప్రవేశాలను బోర్డు ద్వారా చేపట్టేలా ఏర్పాట్లు చేసింది. అయితే టెన్త్‌ పరీక్షలు జరగకపోవడం, న్యాయస్థానం తీర్పుతో గత ఏడాది ఆన్‌లైన్‌ ప్రవేశాలు జరగలేదు. ఈ విద్యాసంవత్సరంలో కూడా టెన్త్‌ పరీక్షలు జరగకపోత ఆన్‌లైన్‌ ప్రవేశాలకు ఇబ్బందే. మెరిట్‌ ఆధారంగా కేటాయించాల్సిన సీట్లను ప్రవేటు కార్పొరేట్‌ సంస్థలు తమ ఇష్టానుసారం అధిక ఫీజులు చెల్లించేవారికి కేటాయించుకుంటాయి. టెన్త్‌ పరీక్షలకోసం ఎస్సెస్సీ బోర్డు 4,199 కేంద్రాలను ఏర్పాటుచేసింది. గదికి 15 మందికి మించకుండా నిర్ణీత భౌతికదూరం ఉండేందుకు గతంలో కన్నా 44 శాతం అదనంగా పరీక్ష కేంద్రాలను పెంచింది. ఈ తరుణంలో కేసులు తగ్గి పరిస్థితులు అనుకూలిస్తే పరీక్షల నిర్వహణే మంచిదన్న భావన వ్యక్తమవుతోంది.

ఇంటర్‌ పరీక్షలు జరగకపోతే పై చదువుల ప్రవేశాలకు సమస్యే
ఉన్నత విద్యాకోర్సుల్లోకి ప్రవేశాలు ఇంటర్మీడియట్‌లో సాధించిన మెరిట్‌ ఆధారంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్‌ వంటి ప్రొఫెషనల్‌ కోర్సులకు సంబంధించిన ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఈఏపీసెట్‌)లో ఇంటర్మీడియట్‌లోని మార్కులకు 25 శాతం వెయిటేజి ఉంది. ఇంటర్‌ పరీక్షలు నిర్వహించకపోతే ర్యాంకుల నిర్ధారణ కష్టం. పరీక్షలు పెట్టకుండా సీబీఎస్‌ఈ ప్రతిపాదించిన విధానంలో మార్కులు కేటాయించినా మెరిట్‌ విద్యార్థులకు నష్టం జరిగే పరిస్థితి ఏర్పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి ఇంటర్‌లోని మార్కుల మెరిట్‌ ఆధారంగా బీఎస్సీ, బీకాం, బీఏ తదితర నాన్‌ ప్రొఫెషనల్‌ డిగ్రీ కోర్సుల్లోకి ఆన్‌లైన్‌ పద్ధతిలో ప్రవేశాలను కల్పిస్తోంది. ఇంటర్‌ పరీక్షలు లేకపోతే ఆ ప్రవేశాలకూ సమస్యే. పరీక్షల కోసం ఇంటర్మీడియట్‌ బోర్డు అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా 3 పులల కిందటే ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించింది. మే 5 నుంచి 1,452 పరీక్ష కేంద్రాల్లో థియరీ పరీక్షలు జరగాల్సి ఉన్నా కరోనా కేసుల దృష్ట్యా వాయిదా పడ్డాయి. ఇప్పటికే ప్రాక్టికల్‌ పరీక్షలు పూర్తయినందున విద్యార్థులు, సిబ్బంది ఆరోగ్య భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకుని థియరీ పరీక్షలు కూడా నిర్వహించడమే మేలని పలువురు పేర్కొంటున్నారు.

పేపర్లు కుదించి పరీక్షల నిర్వహణ మేలు
టెన్త్‌లో 11 పేపర్లను 6కు కుదించి పరీక్షలు నిర్వహించేలా ఇంతకుముందు ఎస్సెస్సీ బోర్డు షెడ్యూల్‌ ఇచ్చింది. 6 రోజుల్లోనే పరీక్షలు ముగిసేలా ఏర్పాట్లు చేసింది. అదే పద్ధతిలో ఇంటర్మీడియట్‌లోనూ పరీక్షలు నిర్వహించడమే మంచిదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కొన్ని ప్రత్యామ్నాయ విధానాలపై కేంద్రవిద్యాశాఖకు ప్రతిపాదనలు కూడా పంపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement