మీడియాతో మాట్లాడుతున్న ముస్లిం పర్సనల్ లా బోర్డు రాష్ట్ర అధ్యక్షుడు అల్తాఫ్ రజా. చిత్రంలో ముస్లిం పెద్దలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముస్లింలను రెచ్చగొట్టి అలజడులు సృష్టించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు పన్నుతున్న కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు రాష్ట్ర అధ్యక్షుడు అల్తాఫ్ రజా మైనార్టీ యువతకు సూచించారు. ‘చలో నంద్యాల’ పేరుతో నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముస్లింలను కరివేపాకు మాదిరిగా వాడుకుని వదిలేసే పార్టీల తీరు మారకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం కృష్ణా జిల్లా కొండపల్లిలోని హజ్రత్ సయ్యద్ షా బుఖారి ఆస్థాన ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో హాజరైన ముస్లిం మైనార్టీలతో కలసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
నంద్యాలలో షేక్ అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని, ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ తక్షణమే స్పందించి నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించడం అభినందనీయమన్నారు. ఇద్దరు ఐపీఎస్ అధికారులతో వెంటనే ఉన్నత స్థాయి విచారణ జరిపి ఘటనకు బాధ్యులైన సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌ను సస్పెండ్ చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారన్నారు. పోలీసులే నిందితులుగా ఉన్న కేసులో బెయిల్ రద్దు కోరుతూ ప్రభుత్వమే పిటిషన్ దాఖలు చేయడం ఇదే తొలిసారి అని తెలిపారు. సలాం అత్తకు రూ.25 లక్షలు పరిహారం అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందన్నారు.
ఆ కార్యక్రమాలకు దూరంగా ఉందాం..
ముస్లిం యువతను రెచ్చగొట్టి ప్రభుత్వానికి దూరం చేసేందుకు కొన్ని పార్టీలు ‘చలో నంద్యాల’ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అల్తాఫ్ రజా సూచించారు. కొంత మందిని అడ్డుపెట్టుకుని చేస్తున్న స్వార్థ రాజకీయాలను ఆపకుంటే రోడ్డుపైకి వచ్చి నిలదీస్తామని, గత ప్రభుత్వ పాలనలో ముస్లింలకు చేసిన అన్యాయాలను ఎలుగెత్తి చాటుతామని హెచ్చరించారు.
దోషులను తేల్చాలి..
దేశంలో మరెక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ ముస్లింలకు సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరుస్తున్నారని అల్తాఫ్ తెలిపారు. ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చి గౌరవించారని, నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే మైనార్టీలకు అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియచేద్దామని సూచించారు. సలాంపై మోపిన దొంగతనం కేసు, అపవాదులపై క్షుణ్నంగా విచారణ జరిపి అసలు దోషులను గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు.
దేశ ద్రోహం కేసులు గుర్తున్నాయ్..
ఘటనలో నిందితులైన ఇద్దరు పోలీసులను ప్రభుత్వం వెంటనే అరెస్టు చేస్తే కొందరు రాజకీయ నేతలు వారికి బెయిల్ ఇప్పించారని అల్తాఫ్ రజా పేర్కొన్నారు. ఇప్పుడు ముస్లింలపై ప్రేమ నటిస్తున్న పార్టీ గతంలో ‘నారా హమారా’లో ప్రశ్నించిన వారిపై దేశ ద్రోహం కేసులు నమోదు చేయడం, గుంటూరు సభలో అక్రమ కేసులు బనాయించడాన్ని ఎవరూ మరచిపోలేదన్నారు. చంద్రబాబు పాలనలో ముస్లింలపై మోపిన అక్రమ కేసులను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎత్తి వేశారని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment