దహనం అయిన మృతదేహంను పరిశీలిస్తున్న డీఎస్పీ, సీఐ, ఎస్సైలు.
ప్రకాశం ,ఉలవపాడు: కరోనా...కడచూపులోనూ కన్నీటి కష్టాలు పెడుతోంది. కట్టె కాల్చడానికి దహన సంస్కారాలు చేయడానికి వీలు లేక కుటుంబ సభ్యులు దొంగతనంగా దహనం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం కరోనా సోకిన మృతదేహాలను పూడ్చిపెట్టడం, దహనం చేయడంలో ఇబ్బందులు లేవని అవగాహన కల్పిస్తున్నా నేటికీ అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందులు చెప్పనలవి కాదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే శనివారం రాత్రి ఉలవపాడు మండల పరిధిలోని చాగల్లు అటవీ భూమిలో మృతదేహాన్ని దహనం చేసిన సంఘటన. రోడ్డు ప్రమాదంలోమృతి చెందిన తన కుమారుడికి కరోనా ఉందని తెలియడంతో అంత్యక్రియలు చేయడానికి వీలులేక ఆ తండ్రి ఇబ్బందులు పడి గుర్తు తెలియని చోట టైర్లతో తగలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్‌తో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని జాగ్రత్తలతో ఖననం లేదా దహనం చేస్తే చాలని చెబుతున్నా గ్రామాల్లో అడ్డుచెప్పడం ఆగడం లేదు.
అంత్యక్రియలకు నిరాకరించడం వల్లే..
గ్రామాల్లో కరోనాతో మృతి చెందిన వారిని రానివ్వకుండా అంత్యక్రియలు చేయకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలను కుటుంబ సభ్యులు ఎంచుకుంటున్నారు. దీని వలన కుటుంబ సభ్యులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. గ్రామాల్లో పరిస్థితులు కరోనా వలన చాలా దారుణంగా ఉంటున్నాయి. మృతదేహాలను కనీసం పూడ్చిపెట్టే వీలులేదు. కాల్చడానికి కుదరడం లేదు. మరణం బాధని కలిగిస్తే మరణం తరువాత చేయాల్సిన కార్యక్రమాలు మరింత వేదన మిగులుస్తున్నాయి.
అవగాహన తప్పదు...
కరోనా మృతదేహాల అంత్యక్రియల విషయంలో ప్రభుత్వం ఎంతో బాధ్యతగా అవగాహన కల్పిస్తోంది. న్యాయశాఖ ఆధ్వర్యంలో పలు సూచనలు తెలియచేస్తున్నారు. కానీ గ్రామాల్లో పరిస్థితి మారడం లేదు. కరోనా మృతదేహాల అంత్యక్రియల విషయంలో మరింత అవగాహన పెరగాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజల్లో భయం ఇలాంటి పరిస్థితి కల్పించేలా చేసింది. ప్రజల సందేహాలను నివృత్తి చేస్తూ మానవత్వం మంటకలవకుండా చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
దహనం చేసిన మృతదేహం..కోవిడ్ సోకిన వ్యక్తిదే
ఉలవపాడు: మండల పరిధిలోని చాగల్లు గ్రామ అటవీ శాఖ పరిధిలోని జామాయిల్ తోటలో మృతదేహాన్ని శనివారం రాత్రి దహనం చేసిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని ఈ మృతదేహానికి సంబంధించి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. పలు కోణాల్లో విచారించిన పోలీసులు కేసును చేధించారు. సంతనూతలపాడు మండలం మైనంపాడు పంచాయతీ చల్లపాలేనికి చెందిన కరిచేటి శింగయ్య (29) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో మార్చి 23 నుంచి ఇంటి వద్దే ఉంటూ వర్క్‌ఫ్రం హోం చేసుకుంటున్నాడు. ఈ నెల 23న మార్బుల్స్ కొనడానికి ఒంగోలుకు ద్విచక్ర వాహనం పై వెళ్లి తిరిగివస్తుండగా రాత్రి 8 గంటల సమయంలో పేర్నమిట్ట వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొనడంతో మృతి చెందాడు. 24 న పోస్ట్‌మార్టం నిర్వహించిన తరువాత కరోనా పాజిటివ్ ఉన్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి అంత్యక్రియలు చేయడానికి గ్రామంలో వెళ్లి అడుగగా గ్రామస్తులు ఒప్పుకోలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో 25న రిమ్స్ బయట ఓ అంబులెన్స్ డ్రైవర్ దహనక్రియలు చేయడానికి రూ.25 వేలు ఇస్తే అన్నీ తాను చూసుకుంటానని చెప్పడంతో రూ.17 వేలకు మాట్లాడుకున్నారు.
దహనం చేయడానికి టైర్లు, పెట్రోలు కొనుగోలు చేసుకున్నాడు. చాగల్లు వద్ద అడవిలో మృతదేహాన్ని డ్రైవర్ తీసుకుని వచ్చి దహనం చేశారు. రాత్రి వరకు మంటలు వస్తుండడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సమాచారం సేకరించారు. రిమ్స్‌కు సంబంధించిన వైద్యులు పోస్టుమార్టం చేయడానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఇది పోస్టుమార్టం చేసిన మృతదేహం అని, కరోనా సోకిన వ్యక్తికి చేసిన ప్యాకింగ్ అని తెలిపారు. దీని పై వివరాలు సేకరించడంతో కేసు ఓ కొలిక్కి వచ్చింది. వారి తల్లితండ్రులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పరిశీలించారు. తమ కుమారుడి మృతదేహంగా గుర్తించారు. అప్పటికే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చి సంఘటనా స్థలిలో వివరాలు సేకరించారు. కందుకూరు డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ విజయకుమార్ ఆధ్వర్యంలో ఎస్సై దేవకుమార్ లు ఒక్కరోజులోనే కేసును ఛేదించారు. వారి తండ్రి వద్ద స్టేట్‌మెంటును రికార్డు చేసుకున్నారు. గ్రామంలో అంత్యక్రియలు నిరాకరించడంతో ఈ పరిస్థితి వచ్చి దహనం చేసినట్లు పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment