AP EAMCET Toppers List 2023: Andhra Pradesh Boys Tops In APEAPCET, Know Details Inside - Sakshi
Sakshi News home page

ఏపీ ఈఏపీసెట్‌.. అబ్బాయిలదే హవా

Published Thu, Jun 15 2023 2:27 AM | Last Updated on Thu, Jun 15 2023 9:43 AM

Andhra Pradesh Boys Tops In APEAPCET - Sakshi

వరుణ్‌ (ఫస్ట్‌ ర్యాంక్‌– ఇంజనీరింగ్‌), జశ్వంత్‌ (ఫస్ట్‌ ర్యాంక్‌– అగ్రి అండ్‌ ఫార్మసీ)

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీటెక్, బీఎస్సీ అగ్రి­కల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఫార్మసీ, బీవీఎస్సీ, ఫార్మ్‌డీ, బీఎస్సీ నర్సింగ్‌ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏపీ ఈఏపీసెట్‌)–2023 ఫలితాల్లో అబ్బాయిలు సత్తా చాటారు. ఇంజనీరింగ్‌ విభాగంలో టాప్‌ టెన్‌ ర్యాంకులు మొత్తం అబ్బాయిలే కొల్లగొట్టారు. అలాగే అగ్రికల్చర్‌ విభాగంలోనూ వారిదే ఆధి­పత్యం. టాప్‌ టెన్‌ ర్యాంకుల్లో 8 మంది అబ్బా­యిలు, ఇద్దరు అమ్మాయిలు నిలిచారు.

ఏపీ ఈఏపీ­సెట్‌ ఫలితాలను బుధవారం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో మొత్తం 3,38,739 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 3,15,297 మంది పరీక్షకు హాజరు కాగా 2,52,717 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్‌ విభాగంలో 2,38,180 మంది దరఖాస్తు చేసుకోగా 2,24,724 మంది పరీక్ష రాశారు. వీరిలో 1,71,514 (76.32 శాతం) మంది అర్హత సాధించారు. ఇక అగ్రికల్చర్‌ విభాగంలో 1,00,559 మంది దరఖాస్తు చేయగా 90,573 మంది పరీక్ష రాశారు.

వీరిలో 81,203 (89.65 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది మాదిరిగానే ఇంజనీరింగ్‌ వైపు అత్యధికంగా అబ్బాయిలు, అగ్రికల్చర్‌ వైపు అమ్మాయిలు మొగ్గు చూపారు. ఇంజనీరింగ్‌ విభాగంలో ఎన్టీఆర్‌ జిల్లా నందిగామకు చెందిన చల్లా ఉమేష్‌ వరుణ్‌ 158.03 మార్కులతో (తెలంగాణ ఎంసెట్‌లో 3వ ర్యాంకు), అగ్రికల్చర్‌ విభాగంలో తూర్పుగోదావరి జిల్లా కాతేరుకు చెందిన బూరుగుపల్లి సత్యరాజ్‌ జశ్వంత్‌ 153.88 మార్కులతో (తెలంగాణ ఎంసెట్‌ టాపర్‌) ప్రథమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు.

తొలి పది ర్యాంకులు బాలురకే..
ఇంజనీరింగ్‌ విభాగంలో తొలి పది ర్యాంకులు, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగంలో టాప్‌ టెన్‌లో ఎనిమిది ర్యాంకులను అబ్బాయిలు కైవసం చేసుకున్నారు. అయితే రెండు విభాగాల్లో కలిపి బాలుర కంటే బాలికలు 3.99 శాతం అధికంగా ఉత్తీర్ణత నమోదు చేశారు. తెలంగాణ విద్యార్థులకు ఇంజనీరింగ్‌ విభాగంలో 2, 10 ర్యాంకులు, అగ్రికల్చర్‌ విభాగంలో 3, 6 ర్యాంకులు వచ్చాయి.

ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం చేస్తున్న ఖర్చు నైపుణ్య మానవ వనరుల అభివృద్ధిపై పెట్టుబడిగా పరిగణిస్తోందని చెప్పారు. జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సులు, నూతన విద్యా విధానం, ఉన్నత విద్యలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయికి ఎదిగేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేశారు.

ఫలితంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల చేరిక, ఉత్తీర్ణత శాతం పెరుగుతోందని తెలిపారు. త్వరలోనే దేశ విద్యా వ్యవస్థలో ఏపీని మొదటి స్థానంలో నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు రాగానే జూలై 15న కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రారంభించి ఆగస్టు 15లోగా పూర్తి చేస్తామన్నారు. 

వీరికి మార్కులు అప్‌లోడ్‌ చేశాక ర్యాంకులు
రాష్ట్రంలో రెగ్యులర్‌ ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులై ఈఏపీసెట్‌లో అర్హత సాధించిన వారందరికీ ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు ప్రకటించారు. అయితే సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఏపీవోఎస్‌ఎస్, తదితర సిలబస్‌తో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు, ఇటీవల సప్లిమెంటరీలో ఇంటర్‌ పాసైన ఏపీ విద్యార్థుల మార్కుల డేటా రాకపోవడంతో కొంత మందికి ర్యాంకులను కేటాయించాల్సి ఉందని ఈఏపీసెట్‌ చైర్మన్‌ జి.రంగ జనార్దన తెలిపారు.

అభ్యర్థుల నుంచి డిక్లరేషన్‌తోపాటు మార్కులను అప్‌లోడ్‌ చేశాక వీరికి వెయిటేజీ కలిపి ర్యాంకులు ప్రకటిస్తామన్నారు. ఫలితాల వెల్లడి కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ రామ్మోహనరావు, కార్యదర్శి నజీర్‌ అహ్మద్, సెట్స్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ సుధీర్‌రెడ్డి, ఈఏపీ సెట్‌ కన్వీనర్‌ శోభాబిందు తదితరులు పాల్గొన్నారు. 

ర్యాంకర్ల వాయిస్‌
కార్డియాలజిస్ట్‌నవుతా..
మాది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ మండలంలోని కాతేరు. మా నాన్న సాయిరామకృష్ణ రైతు, అమ్మ రజిని గృహిణి. నాకు ఇంటర్‌ బైపీసీలో 985 మార్కులు వచ్చాయి. తెలంగాణ ఎంసెట్‌లో అగ్రి అండ్‌ ఫార్మసీ విభాగంలో ఫస్ట్‌ ర్యాంకు సాధించాను. నీట్‌లో ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 65వ ర్యాంకు వచ్చింది. మంచి కాలేజీలో ఎంబీబీఎస్‌ చదివి కార్డియాలజీలో స్పెషలైజేషన్‌ చేస్తా. 
  – బూరుగుపల్లి సత్యరాజ్‌ జశ్వంత్, ఫస్ట్‌ ర్యాంకర్, అగ్రి అండ్‌ ఫార్మసీ విభాగం
 
అమ్మానాన్న ప్రోత్సాహంతోనే అగ్రస్థానం
మాది ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ. నాన్న చల్లా విశ్వేశ్వరరావు బిజినెస్‌ రంగంలో ఉన్నారు. నాకు ఇంటర్‌లో 983 మార్కులు వచ్చాయి. తెలంగాణ ఎంసెట్‌లో మూడో ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్‌ ఓపెన్‌ కేటగిరీలో 263వ ర్యాంక్‌ సాధించాను. క్లాసులో ఫస్ట్‌ రావాలని కష్టపడి చదివాను. అమ్మానాన్న ప్రోత్సాహంతోనే ఫస్ట్‌ ర్యాంకు సాధించగలిగాను.
– చల్లా ఉమేష్‌ వరుణ్, స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్, ఇంజనీరింగ్‌ విభాగం 

ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ చేస్తా.. 
మాది శ్రీకాకుళం జిల్లా తోటాడ. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నాకు నీట్‌లో ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకు వచ్చింది. తెలంగాణ ఎంసెట్‌లో ఐదో ర్యాంక్‌ సాధించాను. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ చేయడమే నా లక్ష్యం.
–బోర వరుణ్‌ చక్రవర్తి, రెండో ర్యాంక్, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగం

ఎంఐటీలో ఎంఎస్‌ చేస్తా..
మా స్వస్థలం.. చిలకలూరిపేట. నాన్న హనుమంతరావు రైతు. అమ్మ కళావతి వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో ఉద్యోగం చేస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్‌ ర్యాంకు తెచ్చుకుని ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ చేయాలనే లక్ష్యంతో ఉన్నా. బీటెక్‌ తర్వాత ఎంఐటీలో ఎంఎస్‌ చేస్తా.
– అడ్డగడ వెంకట శివరామ్, 6వ ర్యాంకు, ఇంజనీరింగ్‌ విభాగం, చిలకలూరిపేట 

ఐఐటీలో సీటు సాధించడమే నా లక్ష్యం..
మా స్వస్థలం ప్రకాశం జిల్లా మార్కాపురం. ప్రస్తుతం గుంటూరులో ఉంటున్నాం. నాన్న శ్రీనివాసరెడ్డి వ్యవసాయం చేస్తున్నారు. అమ్మ అనురాధ గృహిణి. నాకు ఇంటర్‌లో 971 మార్కులు వచ్చాయి. ఇటీవల తెలంగాణ ఎంసెట్‌లో 2వ ర్యాంకు సాధించాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు వస్తుందని ఎదురు చూస్తున్నాను. ఐఐటీలో ఇంజనీరింగ్‌ చేయడమే నా లక్ష్యం.  
– యక్కంటి ఫణి వెంకట మణీందర్‌రెడ్డి, 7వ ర్యాంకు, ఇంజనీరింగ్‌ విభాగం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement