
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థులకు వారి సమ్మతిని అనుసరించి ‘జగనన్న వసతి దీవెన’ స్థానంలో ల్యాప్‌టాప్‌లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులను డిజిటల్ దిశగా నడిపించడంతోపాటు కరోనా వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు అభ్యసనాన్ని కొనసాగించేందుకు వీలుగా ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయనున్నారు. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరు చేస్తున్న ప్రభుత్వం వారికి భోజన వసతి సదుపాయాల కోసం జగనన్న వసతి దీవెన కింద ఏటా రూ.20 వేల వరకు అందిస్తున్న సంగతి తెలిసిందే.
2021–22 విద్యా సంవత్సరంలో జగనన్న వసతి దీవెన కింద ఇచ్చే నగదుకు బదులు ల్యాప్‌టాప్‌లు కావాలని కోరుకొనే వారికి వీటిని అందించనున్నారు. వీరికి రెండు రకాల కంప్యూటర్లను వారి అభీష్టాన్ని అనుసరించి పంపిణీ చేయిస్తారు. వాటిలో ఒకటి బేసిక్ కన్ఫిగరేషన్‌తో ఉన్నది కాగా రెండోది అడ్వాన్సుడ్ కన్షిగరేషన్‌తో కూడుకున్నది. ఈ ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు సంబంధించి ఏపీటీఎస్ ద్వారా విధివిధానాలు ఖరారు చేయనున్నారు. అలాగే ఈ ల్యాప్‌టాప్‌లలో ఏమైనా లోపాలు తలెత్తితే విద్యార్థులు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేసిన వారం రోజుల్లో ఆయా కంపెనీలు సమస్యను పరిష్కరించాలి. రెండు రకాల మోడళ్లకు సంబంధించిన కన్ఫిగరేషన్ సమాచారాన్ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్యాశాఖ) ఉత్తర్వుల్లో పొందుపరిచారు.