
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలో అసైన్డ్‌దారుల నుంచి భూములు కొనుగోలు చేసి, వాటిని భూ సమీకరణ కింద ఇచ్చిన వారికి అప్పటి ప్రభుత్వం కేటాయించిన నివాస, వాణిజ్య ప్లాట్లను రద్దు చేసే విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలొద్దని హైకోర్టు ఆదేశించింది. కేటాయింపుల రద్దు కోసం జారీ చేసిన జీవో 316, తదనుగుణ నోటీసు విషయంలో తదుపరి చర్యలేవీ వద్దని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేశ్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతి రాజధాని అవుతుందని ముందే తెలుసుకుని అప్పటి అధికార పార్టీకి చెందిన పలువురు వ్యక్తులు రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన అసైన్డ్‌దారుల నుంచి నామమాత్రపు ధరకు భూములు కొనుగోలు చేశారు. వాటిని భూ సమీకరణ కింద ప్రభుత్వానికి స్వాధీనం చేసి అందుకు ప్రతిగా రాజధాని ప్రాంతంలో నివాస, వాణిజ్య ప్లాట్లు పొందారు.
అసైన్డ్ భూముల విక్రయం చట్ట విరుద్ధం కావడంతో అలా భూములు కొని ప్లాట్లు పొందిన వారి ప్లాట్లను రద్దు చేసే నిమిత్తం ప్రభుత్వం జీవో 316 తీసుకొచ్చింది. ఈ జీవోను సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన పెండ్యాల మరియదాసు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్లాట్ల రద్దు నిమిత్తం అధికారులు జారీ చేసిన నోటీసులను సవాల్ చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ విచారణ జరిపి, జీవో 316కు అనుగుణంగా ఎలాంటి తదుపరి చర్యలొద్దని అధికారులను ఆదేశిస్తూ
మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment