
సాక్షి బెంగళూరు: ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామ సచివాలయాల తరహా వ్యవస్థను కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం నడిపిస్తోంది. ఏపీలో ప్రభుత్వ సేవలన్నీ గ్రామ స్థాయిలోనే ప్రజలకు అందేలా సీఎం వైఎస్ జగన్ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో కర్ణాటకలోని బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం గత నెల 27న ‘గ్రామ వన్ సేవా కేంద్రాలు’ ఏర్పాటు చేసింది. వీటిద్వారా ప్రభుత్వ సేవలు, పథకాలు, ధ్రువీకరణ పత్రాలను ఒకేచోట ప్రజలకు అందజేస్తున్నారు. కర్ణాటకలోని 12 జిల్లాల్లో 3,024 పంచాయతీల్లో ఈ గ్రామ వన్ సేవా కేంద్రాలు సేవలందిస్తున్నాయి.
మార్చి చివరి నాటికి అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ కేంద్రాలను ప్రారంభించేందుకు కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాగా గ్రామ వన్ ఒక సాంకేతిక ఆధారిత కార్యక్రమం. ప్రజలు ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. గ్రామస్థాయిలోనే దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు ఈ కేంద్రాల వల్ల కలుగుతోంది. బ్యాంకింగ్ సేవలు, ఆధార్ కార్డు, ఆయుష్మాన్ కార్డు, ఏపీఎల్, బీపీఎల్ కార్డు తదితర 100 సేవలను ఈ కేంద్రాల ద్వారా అందిస్తున్నారు. ఇవి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. దరఖాస్తు చేసుకున్న తర్వాత దాని స్థితిగతులను తెలుసుకునేందుకు మొబైల్ నంబర్‌కు ఒక సందేశాన్ని కూడా పంపిస్తున్నారు.