పురుగుల మందు డబ్బా పట్టుకుని ఆందోళన చేస్తున్న వివాహిత సంగీత
సాక్షి,టెక్కలి(శ్రీకాకుళం): భర్త సరిగా చూడడం లేదు.. న్యాయం చేయండి.. అంటూ ఏడాదిన్నరగా పోలీసుల చుట్టూ తిరిగిన ఆ తల్లి అలసిపోయింది. తన పిల్లలకు హక్కుగా ఉన్న ఆస్తిని విక్రయించబోతుంటే ఏకంగా కన్నబిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైపోయింది. టెక్కలిలోని కచేరి వీధికి చెందిన ఉర్లాపు సంగీత అనే వివా హిత తన ఇద్దరు పిల్లలు మృదుల, తేజలతో కలిసి పురుగు మందు డబ్బా చేతబట్టుకుని బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
స్థానిక కచేరి వీధికి చెందిన ఉర్లాపు సూర్యకుమార్, టెక్కలి మండలం గంగాధరపేట గ్రామానికి చెందిన సంగీతకు 2011లో వివాహం జరిగింది.
వీరికి ప్రస్తుతం పదేళ్ల కుమార్తె, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. కొంతకాలం కిందట భార్యాభర్తలు హైదరాబాద్‌లో పనులు చేసుకుంటూ ఉండేవారు. రెండేళ్ల కిందట ఇద్దరికీ మనస్ఫర్థలు రావడంతో సంగీత తన భర్త సూర్యకుమార్‌పై కోర్టులో కేసు వేశారు. ఉమ్మడి ఆస్తిగా ఉన్న ఇల్లు, స్థలంపై తనకు, తన పిల్లల కు హక్కు కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ స్థలం వివాదం కోర్టు పరిధిలో ఉండగా.. తన భర్త సూర్యకుమార్ పాటు అత్త ఉర్లాపు చిన్నమ్మడు, ఆడపడుచు లక్ష్మి, బావ రమేష్‌లు కలిసి రెవెన్యూ అధికారుల ద్వారా తన పేరును హక్కుదారుగా తప్పించారని, 2021 అక్టోబర్ 29వ తేదీన రెవెన్యూ అధికారు ల ద్వారా లీగల్ హైర్ చేయించి ఇంటి స్థలాన్ని పట్టణానికి చెందిన మోణింగి శ్రీనివాసరావు అనే వ్యక్తికి తనకు తెలియకుండా విక్రయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కోర్టులో ఉన్న స్థలానికి రెవెన్యూ అధికారులు ఎలా అనుమతి ఇచ్చారని, రిజిస్ట్రేషన్ ఎలా చేశారని బాధితురాలు వాపోయారు. తనకు న్యాయం చేయాలని టెక్కలి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా స్పందించలేదని, బుధవారం మధ్యాహ్నం తాను లేని సమయంలో స్థలం కొనుకున్న వ్యక్తి జేసీబీ సాయంతో ఇంటిని కూలదోసి స్థలాన్ని చదును చేసే ప్రయత్నం చేశారని తెలిపారు. తమను చంపేందుకు తన భర్త గొడ్డలి పట్టుకుని తిరిగా డని ఆమె భయాందోళన వ్యక్తం చేశారు. పిల్లలతో సహా తాను రోడ్డున పడ్డానని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక డీసీసీబీ బ్యాంకు ఎదురుగా ఉన్న స్థలం వద్ద బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ 2 గోపాలరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకోగా పోలీసుల తీరును తప్పుపడుతూ బాధితురాలు మరోసారి కన్నీరుమున్నీరయ్యారు. ఆత్మహత్యాయత్నం చేస్తున్న బాధితురాలికి పోలీసులు సర్ది చెప్పడానికి ప్రయత్నించినా ఆమె వినలేదు. తనకు న్యాయం చేసేవరకు ఇక్కడే తన పిల్లలలో నిరసన కొనసాగిస్తానంటూ ఆమె స్థలంలోనే బైఠాయించారు.
Comments
Please login to add a commentAdd a comment