రాయలసీమ వర్సిటీలో టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అ«ధ్యక్షుడి కుమారుడి వీరంగం
బయటి వ్యక్తులతో కలిసి విద్యార్థిపై దాడి
చంపేస్తానంటూ హెచ్చరిక
కర్నూలు కల్చరల్: తెలుగుదేశం నాయకుడి కుమారుడు, రాయలసీమ విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ పీజీ సీనియర్ విద్యార్థి రామ్‌ప్రకాష్ సోమవారం వీరంగం వేశాడు. తన జూనియర్ విద్యార్థి జి.సురేష్‌బాబును బయటినుంచి వచ్చిన స్నేహితులతో కలిసి దూషిస్తూ తీవ్రంగా కొట్టాడు. బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్ ఫేర్‌వెల్ పార్టీకి సంబంధించి డాటా సైన్స్ ల్యాబ్‌లో డెకొరేషన్, క్యాటరింగ్, సౌండ్ సిస్టమ్ పనులను తాను చెప్పినట్లు చేయలేదని సురేష్‌బాబు మీద రామ్‌ప్రకాష్ దాడిచేశాడు. అతడితోపాటు బయటి నుంచి వచ్చిన అతడి స్నేహితులు కూడా సురేష్‌బాబును తీవ్రంగా కొట్టారు.
దీనిపై సురేష్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘మా నాన్న టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జేమ్స్. నిన్ను కొట్టి చంపేస్తే ఎస్పీని మ్యానేజ్ చేస్తారు. కర్నూలులో ఉన్న సీఐలను, ఎస్‌ఐలను మ్యానేజ్ చేస్తారు. దాడిచేసినట్లు పోలీస్‌స్టేషన్‌లో కంప్‌లైంట్ ఇస్తే నేను నిన్ను చంపేస్తా..’ అని రామ్‌ప్రకాష్ వార్నింగ్ ఇచ్చినట్లు సురేష్‌బాబు పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారినుంచి తనకు ప్రాణహాని ఉందని తెలిపాడు.
ఈ విషయమై వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సముద్రాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గొడవ జరిగినట్లు తమకు ఆలస్యంగా తెలిసిందన్నారు. సురేష్‌బాబుతో మాట్లాడామని, బయటి వ్యక్తులు వచ్చి దాడిచేసినట్లు తెలిస్తే కేసు పెడతామని చెప్పారు. రామ్‌ప్రకాష్ తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడతామన్నారు. వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఎన్.టి.కె.నాయక్ సమక్షంలో మంగళవారం ఇద్దరు విద్యార్థులతో మాట్లాడి జరిగిన విషయం తెలుసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
‘కాంచనగంగ’పై నవరత్నాల బ్యానర్ ప్రదర్శించిన సురేష్‌బాబు
గాయపడిన సురేష్‌బాబు పర్వతారోహకుడు. 2022 మే 21న ప్రముఖ పర్వతాల్లో ఒకటైన కాంచనగంగ పర్వతాన్ని అధిరోహించి అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల బ్యానర్‌ను ప్రదర్శించాడు. రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిన ఇలాంటి విద్యార్థిపై దాడిచేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment