టెన్త్‌ ఫలితాల్లో తిరుగులేని ‘మన్యం’.. రాష్ట్రవ్యాప్తంగా 72.26 శాతం ఉత్తీర్ణత  | Andhra Pradesh Tenth Results Released | Sakshi
Sakshi News home page

AP Tenth Results: టెన్త్‌ ఫలితాల్లో తిరుగులేని ‘మన్యం’..రాష్ట్రవ్యాప్తంగా 72.26 శాతం ఉత్తీర్ణత 

Published Sun, May 7 2023 5:14 AM | Last Updated on Sun, May 7 2023 5:14 AM

Andhra Pradesh Tenth Results Released  - Sakshi

టెన్త్‌ ఫలితాల్లో ఈ ఏడాది పార్వ­తీపురం మన్యం జిల్లా తిరుగులేని ఫలితాలు సాధించింది. 87.47 శాతం ఉత్తీర్ణతతో ఈ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 60.39 శాతం ఫలి­తాలతో నంద్యాల జిల్లా చివరి స్థానం దక్కించుకుంది. అలాగే, ఈ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్రం మొత్తం మీద ఈ ఏడాది 6,05,052 మంది పరీక్షలకు హాజరుకాగా.. 4,37,196 మంది అంటే 72.26 శాతం మంది విద్యా­ర్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికల ఉత్తీర్ణత శాతం 75.38 శాతమైతే బాలురది 69.27 శాతం. 933 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, 38 పాఠశాలల్లో ‘జీరో’ ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాలను విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం విజయవాడలోని ఓ హోటల్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలిస్తున్నాయన్నారు. అందుకు ఈ ఏడాది పదో తరగతి ఫలితాలే నిదర్శమన్నారు. గత విద్యా సంవత్సరం ఫలితాల్లో 67.26 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది ఐదు శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారన్నారు.

ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో అత్యధికంగా 95.25 శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. ఇంగ్లిష్‌ మీడియంలో సైతం 80.82 శాతం మంది ఉత్తీర్ణత సాధించడం విశేషమని ఆయన తెలిపారు. జీరో శాతం ఉత్తీర్ణత నమోదైన 38 పాఠశాలల్లో కారణాలను విశ్లేషిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరంలో అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నూరు శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల ఉపాధ్యాయులను ప్రోత్సహించే దిశగా కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి బొత్స చెప్పారు. మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీకౌంటింగ్‌ లేదా రీవెరిఫికేషన్‌ కోసం సబ్జెక్టుకు రూ.500 చొప్పున.. జవాబుపత్రాల నకలు కావాల్సిన వారు సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున చెల్లించి పొందచ్చని ఆయన తెలిపారు. ఆయా విద్యార్థులు ఈనెల 13వ తేదీలోగా  ఠీఠీఠీ. ఛిజఝట. ్చp. జౌఠి. జీn వెబ్‌సైట్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

జూన్‌ 2 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ..
ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు ఆందోళన చెందొద్దని, ఈ విద్యా సంవత్సరం వృధా కాకుండా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని.. అధైర్య పడకుండా దీనిని ఒక సవాలుగా తీసుకుని సప్లమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని మంత్రి బొత్స తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు అండగా ఉండాలన్నారు. జూన్‌ 2 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, టైంటేబుల్‌ను త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. అలాగే, ఫెయిలైన విద్యార్థుల కోసం సంబంధిత పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి సప్లిమెంటరీ పరీక్షల్లో విజయం సాధించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. వీటికి హాజరయ్యేవారు ఆదివారం (ఈనెల 7వ తేదీ) నుంచి మే 17వ వరకూ ఫీజు చెల్లించవచ్చని, రూ.50 అపరాథ రుసుంతో మే 22 వరకూ అవకాశం కల్పించామన్నారు. ఇక ఈ పరీక్షా ఫలితాలను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వెబ్‌సైట్‌  ఠీఠీఠీ. bట్ఛ. ్చp. జౌఠి. జీnలో పొందుపరిచామని, మరో నాలుగు రోజుల్లో మార్కుల జాబితాలను కూడా వెబ్‌సైట్‌లో ఉంచుతామని బొత్స వివరించారు. నిర్ణీత సమయంలో ఎస్సెస్సీ మార్కుల జాబితాలను సంబంధిత పాఠశాలలకు పంపిస్తామన్నారు. మరోవైపు.. సీఎం ఆలోచనల మేరకు మన విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేలా కృషిచేస్తున్నామన్నారు. పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ.. పరీక్షల్లో ఫెయిలైన వారు అధైర్యపడొద్దని హితవు పలికారు. విద్యార్థులు ఉన్నత చదువుల వైపు పయనించేలా రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విద్యా ప్రమాణాలు అందిస్తోందన్నారు.

ఆ ఆరుగురూ పాస్‌..
దృష్టిలోపం విద్యార్థుల కోసం డిజిటల్‌ విధానంలో నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు హాజరైన ఆరుగురు విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ తరహాలో పరీక్షలు నిర్వహించడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. అనంతపురం జిల్లాలోని పొలిమెర చైత్రిక, చెంచుగారి పావని, యక్కలూరి దివ్యశ్రీ, మేకా శ్రీధాత్రి, యేకుల సౌమ్య, ఉప్పర నాగరత్నమ్మల కోసం డిజిటల్‌ రూపంలో ఈ పరీక్షలు న్విహించారు. 

జీరో ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల ఒక్కటే..
ఈసారి జీరో ఫలితాలు వచ్చిన 38 స్కూళ్లలో 29 ప్రైవేటు, ప్రైవేటు ఎయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి. మరో 9 మాత్రమే ఇతర యాజమాన్యాల స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ పాఠశాల ఒక్కటే ఉండడం గమనార్హం. పాఠశాలల వారీగా చూస్తే.. ప్రైవేటువి 22, 
ప్రైవేటు ఎయిడెడ్వి 7, ప్రభుత్వ 1, జెడ్పీవి 5, ఆశ్రమ పాఠశాలలు మూడు జీరో ఫలితాలు సాధించాయి. 

‘ప్రైవేటు’ అనుమతులకు వెబ్‌సైట్‌
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు, గుర్తింపునిచ్చేందుకు తీసుకొచ్చిన సింగిల్‌ విండో ఆన్‌లైన్‌ పోర్టల్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. కొత్తగా ప్రైవేట్‌ పాఠశాలలు ఏర్పాటుచేసేవారు, ఇప్పటికే ఉన్న స్కూళ్లకు నిర్ణీత వ్యవధిలో ఆర్‌ అండ్‌ బీ, ఫైర్, మున్సిపాలిటీ, పంచాయతీ, రిజిస్ట్రేషన్‌ శాఖ, పోలీస్‌ శాఖ నుంచి అనుమతులు పొందాలని ఆయన స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఎస్‌. సురేష్‌కుమార్‌ ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి. దేవానంద్‌రెడ్డి, డైరెక్టర్‌ (కో–ఆర్డినేషన్‌) పి. పార్వతి, ఓపెన్‌ స్కూల్‌ డైరెక్టర్‌ కే. శ్రీనివాసరెడ్డి, కేజీబీవీ కార్యదర్శి మధుసూదనరావు, జాయింట్‌ డైరెక్టర్‌ మువ్వా రామలింగం పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement