కల్యాణ క్రతువు నిర్వహిస్తున్న అర్చకులు
సాక్షి అమలాపురం: పరమ పవిత్ర వశిష్ట నదీ తీరంలో నృశింహుని కల్యాణం నయనానందకరంగా జరిగింది. సముద్ర సంగమ ప్రాంతం అంతర్వేది పుణ్య క్షేత్రం పులకరించిపోయింది. అసంఖ్యాకంగా వచ్చిన భక్తులు నృసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల కల్యాణాన్ని తన్మయత్వంతో వీక్షించారు. కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కల్యాణం మంగళవారం రాత్రి 12.46 గంటలకు రోహిణి నక్షతయుక్త తులా లగ్న పుష్కరాంశంలో అంగరంగ వైభవంగా జరిగింది.
వైష్ణవ సంప్రదాయబద్దంగా వైఖానస ఆగమానుసారం ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు, వేద పండితుడు చింతా వేంకట శాస్త్రి పర్యవేక్షణలో అర్చక బృందం కల్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్యాణం జరిగినంత సేపూ మొగల్తూరుకు చెందిన ఆలయం ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ శ్రీరాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహద్దూర్ చేతులు కట్టుకొని స్వామివారి చెంత నిలబడి భక్తిశ్రద్ధలతో కొలిచారు.
టీటీడీ, అన్నవరం దేవస్థానం శ్రీస్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించాయి. నాలుగు గంటల పాటు సాగిన కల్యాణాన్ని చూసి భక్తులు మురిసిపోయారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పంచముఖ ఆంజనేయస్వామి, కంచుగరుడ వాహనాలపై అర్చకులు శ్రీస్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహించారు.
అంతర్వేది లక్ష్మీనృసింహుని ఆలయ నిర్మాత కొపనాతి కృష్ణమ్మ మెడలో ఆవిష్కరించే గజమాల యాత్ర ఊరేగింపు మంగళవారం ఘనంగా నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment