AP Assembly 2022: CM Jagan Speech At University Rename Bill Discussion | N.T.R University Of Health Sciences - Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌గారంటే నాకే గౌరవం ఎక్కువ: సీఎం జగన్‌

Published Wed, Sep 21 2022 12:48 PM | Last Updated on Wed, Sep 21 2022 2:13 PM

AP Assembly: Cm Jagan Speech At University Rename Bill Discussion - Sakshi

సాక్షి, అమరావతి: దివంగత ఎన్టీఆర్‌ అంటే తనకెంతో గౌరవమని, ఆయన్ని తక్కువ చేసి మాట్లాడే వారు మన దేశంలోనే ఉండరని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఐదవ రోజు భాగంగా బుధవారం.. హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చే బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడారు.

అనవసరంగా గొడవలు చేసి.. టీడీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోవడం దురదృష్టకరమని, వాళ్లు కూడా ఈ చర్చ సందర్భంగా ఉండి ఉంటే బాగుండేదని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. ‘‘ఎన్టీఆర్‌గారంటే అంటే నాకు ఎలాంటి కోపం లేదు. ఒకరకంగా.. ఎన్టీఆర్‌కు చంద్రబాబునాయుడుగారి కంటే జగన్‌మోహన్‌రెడ్డినే ఎక్కువ గౌరవం ఇస్తాడు. ఏపొద్దు కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం లేదు. పైగా ఎన్టీఆర్‌ మీద నాకు ఆప్యాయతే ఉంది. ఆయన్ని అగౌరవ పరిచే కార్యక్రమూ నా తరపున ఏనాడూ జరగద’’ని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

నందమూరి తారకరామారావు అని పలకడం చంద్రబాబు నాయుడికి నచ్చదని, అదే చంద్రబాబు నోట వెంట నందమూరి తారకరామారావు అనే మాట వస్తే పైన ఉన్న ఎన్టీఆర్‌గారికి నచ్చదని పేర్కొన్నారు సీఎం జగన్‌. ‘‘నటుడిగా, రాజకీయవేత్తగా గొప్పఖ్యాతి సంపాదించిన వ్యక్తి ఎన్టీఆర్‌. కూతురిని ఇచ్చిన అల్లుడు(చంద్రబాబు) వెన్నుపోటు పొడవడం, దానికి తోడు ఈనాడు రామోజీరావుగారి పథక రచన, మరో జర్నలిస్ట్‌ రాధాకృష్ణ డబ్బు సంచులు మోయడం.. ఇలాంటి పరిణామాలతో మానసిక క్షోభకు గురై ఎన్టీఆర్‌ అకాల మరణం చెందారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే.. చాలాకాలం బతికి ఉండేవారు. అసలు చంద్రబాబు సీఎం అయ్యి ఉండేవారు కాదు’’ అని సీఎం జగన్‌ని పేర్కొన్నారు. ఏ పక్షాన ఉన్నా తమ తరపున ఏనాడూ ఎన్టీఆర్‌ను ఒక్క మాట అనలేదని, పైగా పాదయాత్రలో ఇచ్చిన హామీ కింద ఎన్టీఆర్‌ జిల్లాగా పేరు పెట్టడం తెలిసిందేనని సీఎం జగన్‌ గుర్తు చేశారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇప్పించలేకపోయారన్నారు.

దివంగత మహానేత వైఎస్సార్‌.. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి. ఖరీదైన వైద్యాన్ని పేదలకు అందించిన మానవతావాద మహాశిఖరం. ప్రాణం విలువ తెలిసిన డాక్టర్‌. వైద్య రంగంలో సంస్కరణలకర్త. పేదవాడి సమస్యలు, జీవితాలు అర్థం చేసుకున్న వ్యక్తి అని సీఎం జగన్‌ గుర్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆరోగ్యశ్రీ పథకంతో పాటు ప్రజావైద్యం కోసం 108, 104 సర్వీసులు తెచ్చిన ఘనత ఆయనది. ఆ సమయంలో దేశం మొత్తం ఆయన గురించి గొప్పగా మాట్లాడుకుందని సీఎం జగన్‌ ప్రస్తావించారు. ఏపీ 11 మెడికల్‌ కాలేజీలకు ఎనిమిది, టీడీపీ ఆవిర్భావం కంటే ముందే ఉన్నాయి. 1983 నుంచి ఈరోజువరకు టీడీపీ చరిత్రలో ఒక్క మెడికల్‌ కాలేజీ పెట్టలేదు. మూడు మెడికల్‌ కాలేజీలు వైఎస్సార్‌ హయాంలోనే వచ్చాయి. ప్రస్తుతం మరో 17 మెడికల్‌ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. మొత్తంగా.. ఏపీలో ఉన్న(నిర్మాణ దశలో ఉన్నవి కలుపుకుని) 28 మెడికల్‌ కాలేజీల్లో 20 కాలేజీలు వైఎస్సార్‌, ఆయన కొడుకు(వైఎస్‌ జగన్‌) హయాంలోనే వచ్చాయి. అలాంటప్పుడు వైఎస్సార్‌ పేరు పెట్టకూడదనడం న్యాయమేనా?, అర్హత దక్కాల్సిన వాళ్లకు క్రెడిట్‌ ఇవ్వకపోవడం ధర్మమేనా? అని సీఎం జగన్‌, టీడీపీని నిలదీశారు.

ఎన్టీఆర్‌ విషయంలో ఆయన మీద ఎలాంటి కల్మషం లేదని, ఎవరూ అడగకపోయినా ఆయన పేరు మీద జిల్లా పెట్టామని, టీడీపీ హయాంలో ఏదైనా కట్టి ఉంటే.. దానికి ఎన్టీఆర్‌ పేరు పెట్టమని వాళ్లు అడిగితే సానుకూలంగా స్పందిస్తామని సీఎం జగన్‌ తెలియజేశారు. బాగా ఆలోచించే ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై నిర్ణయం తీసుకున్నామని, మార్పు ముందు ఎన్టీఆర్‌ పేరు మార్చడం కరెక్టేనా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నా అని సీఎం జగన్‌ చెప్పుకొచ్చారు. 

ఇదీ చదవండి: ‘ఎన్టీఆర్‌పై ప్రేమే ఉంటే చెప్పులు, రాళ్లు ఎందుకేశారు?’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement