ఏపీలో ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం పేరు మార్చగానే కొందరు గగ్గోలు పెడుతున్నారు. బ్రహ్మండం బద్ధలయిందా అన్నట్టుగానే గావు కేకలు పెడుతున్నారు. డాక్టర్ వైఎస్సార్ పేరు ఎందుకు పెట్టారన్న విషయాన్ని మాత్రం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. నిజాలేంటో మీరే గమనించండి.
వైద్య,ఆరోగ్య రంగంలో పెను విప్లవానికి శ్రీకారం చుట్టారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. పేదోడికి కార్పొరేట్ వైద్యాన్ని ఓ హక్కుగా మలుస్తూ ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన చేసి పకడ్బందీగా అమలు చేశారు. లక్షలాది మంది ఆ పథకంతో ప్రాణాలు నిలుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు భారతదేశంలో ఎక్కడికెళ్లినా సరే ఆరోగ్యశ్రీ అన్న పేరు వినపడితే చాలు ఎవ్వరికైనా గుర్తుకు వచ్చేది వైఎస్సార్ పేరే. 2003లో పాదయాత్ర సందర్బంగా ప్రజల కష్టసుఖాలు వారి నోటనే విన్న వైఎస్సార్ నిరుపేదలకు ఏ అనారోగ్యం కలిగినా ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి లేదని గమనించారు. అందుకే తాను అధికారంలోకి వస్తే ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలని దృఢ సంకల్పం తీసుకున్నారు.
2004లో వైఎస్సార్ అధికారంలోకి రాగానే ఎన్నికల హామీలకు సంబంధించిన కీలక ఫైళ్లపై సంతకాలు చేసిన తర్వాత మొదటి చూపు పేదల ఆరోగ్యంపైనే పెట్టారు. అలా ఆరోగ్య శ్రీ పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి వచ్చింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు ఆరోగ్యశ్రీని మెచ్చుకోవడమే కాకుండా తమ రాష్ట్రాల్లో దీని ఎలా అమలు చేయచ్చా అని అధ్యయనాలు చేశారు కూడా.
ఈ పథకంతో నిరుపేద కుటుంబీకులు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో కోటీశ్వరులతో సమానంగా వైద్యం అందుకోగలిగారు. ఎన్నో గుండె ఆపరేషన్లు ఎందరి ప్రాణాలనో కాపాడాయి. వారి కుటుంబాల్లో సంతోషాలు నింపాయి. అందుకే 2009 ఎన్నికల్లోనూ వైఎస్సార్‌కు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య శ్రీ పథకం అంతంత మాత్రంగా అమలయ్యేది. ఇందులో భాగంగా ప్రవేశ పెట్టిన 108, 104వాహనాలు మూలన పడ్డాయి. వాటికి మరమ్మతులు చేయించకుండా కొత్త వాటిని కొనకుండా పథకాన్ని నీరుగార్చింది చంద్రబాబు నాయుడి ప్రభుత్వం.
ప్రజల్లో మళ్లీ ఆరోగ్యంపై ఒక రకమైన బెంగ. ఈ క్రమంలోనే 2018లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారు. యాత్ర పొడవునా గ్రామగ్రామాన నిరుపేద ప్రజలను కలుసుకున్న జగన్ వారి జీవన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో తాను అధికారంలోకి వస్తే వైద్య,ఆరోగ్య రంగంలో తన తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే తాను రెండడుగులు ముందుకు వేస్తానని భరోసా ఇచ్చారు.
2019 ఎన్నికల్లో ప్రజలు జగన్‌మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన జగన్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని ఎవరూ ఊహించని విధంగా విస్తరించారు.
►వెయ్యికి పైగా రుగ్మతలకు మాత్రమే ఆరోగ్యశ్రీలో చికిత్స అందేది. దాన్ని రెండు వేల నాలుగు వందలకు పెంచిన జగన్‌మోహన్ రెడ్డి వచ్చే అక్టోబరు 5నుండి ఏకంగా 3,118 వైద్య ప్రక్రియలను ఆరోగ్యశ్రీలో చేరుస్తున్నారు.
►90శాతం ప్రజలకు ఆరోగ్య శ్రీ వెన్నుదన్నుగా నిలిచింది. నాడు- నేడు పథకం కింద ఆసుపత్రుల రూపు రేఖలను మార్చేశారు.
►కార్పొరేట్ ఆసుపత్రులకు ఏ మాత్రం తీసిపోకుండానే కాదు కార్పొరేట్ ఆసుపత్రులను మించి ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరించారు. దానికి అనుగుణంగా ఆసుపత్రుల్లో వైద్యులు, ఇతరత్రా సిబ్బంది నియామకాలు చేపట్టారు.
►వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి మన రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క వైరాలజీ ల్యాబ్ కూడా లేదు. ఈ విషయం కరోనా వల్లనే బయట పడింది. వైరాలజీ ల్యాబ్‌లు కూడా లేవని వారు చెప్పడంతో అప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరాలజీ ల్యాబులను ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వాటికి నిధులు మంజూరు చేసి యుద్ద ప్రాతిపదికన వాటిని అందుబాటులోకి తెచ్చారు.
►కరోనా రెండో వేవ్‌లో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత సమస్య రావడంతో ఏపీలో అది పునరావృతం కాకుండా చూసేందుకు ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు వేగంగా నిధులు విడుదల చేసి చక్కటి విజన్ చాటుకున్నారు
►వాక్సినేషన్‌లో దేశానికే ఆదర్శంగా నిలిచారు.
ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే ఏ రాష్ట్రమైనా చురుగ్గా పనిచేయగలుగుతుంది. పనులు చురుగ్గా జరిగితేనే ప్రగతి రథ చక్రాలు వేగంగా ముందుకు కదులుతాయి. ఆ చక్రాలు వేగం అందుకుంటేనే అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఈ లక్ష్యంతోనే తన తండ్రి వైఎస్సార్ అడుగు జాడల్లో జగన్‌మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ వన్‌గా నిలపాలని కంకణం కట్టుకున్నారు. మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలతో పోటీపడేలా ఏపీని వైద్య రంగంలో తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
తెలుగుదేశం పార్టీ రెండు దశాబ్ధాల పాటు అధికారంలో ఉన్నా ఒక్కటంటే ఒక్క వైద్య కళాశాలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయలేదు. వైద్య రంగంపైనా ప్రజారోగ్యంపైనా టిడిపికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనడానికి ఇదే తిరుగులేని నిదర్శనం. జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మూడేళ్ల వ్యవధిలోనే రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయడం రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త అధ్యాయం అంటున్నారు మేధావులు. స్వాతంత్ర్యం వచ్చిందగ్గర నుంచి 2019 వరకు 72 ఏళ్ల లో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు కావడం గమనార్హం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్థాపించారు. 1947 నుండి 2004 వరకు వీటిలో ఎనిమిది కాలేజీలు నెలకొల్పితే 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నారు. చిత్రం ఏంటంటే పార్టీ ఆవిర్బావం నుంచి రెండు దశాబ్ధాల నిడివి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా పెట్టలేదు.
తండ్రిగా వైఎస్సార్, కొడుకుగా వైఎస్ జగన్.. ఆరోగ్య రంగానికి.. తద్వారా ప్రజలకు చేసిన సేవలు ఎప్పటికీ ఎవరూ మరిచిపోలేరు. అందుకే హెల్త్ యూనివర్సిటీకి పేరు పెట్టడానికి వైఎస్సార్ తప్ప మరో వ్యక్తి సమీప దూరంలో కనిపించరు.
Comments
Please login to add a commentAdd a comment