సాక్షి, అమరావతి: తొమ్మిది నెలలుగా కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తూ దీటుగా ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 1,02,29,745 పరీక్షలు చేశామని, ప్రతి 10 లక్షల జనాభాకు 1,91,568 పరీక్షలు చేశామని, జనాభాలో 19.15 శాతం మందికి పరీక్షలు నిర్వహించామని వివరించారు. కోవిడ్ పరీక్షల్లో దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ తొలిస్థానంలో ఉందన్నారు. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్ ఈ మూడింటిపైన ప్రభుత్వం వాయువేగంగా వ్యవహరించిందని తెలిపారు. కరోనా నియంత్రణ చర్యలు, ఆరోగ్య శ్రీ వైద్య సేవలు, నాడు–నేడుపై శుక్రవారం అసెంబ్లీలో స్వల్ప వ్యవధి చర్చలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. పాజిటివిటీ రేటు సగటున 16 శాతం నుంచి 8.51 శాతానికి తగ్గిందని, ఈ వారం 1.48 శాతం మాత్రమే ఉందన్నారు. మరణాల రేటు దేశంలో 1.4 శాతం ఉండగా, మన దగ్గర కేవలం 0.81 శాతం మాత్రమే ఉందన్నారు. గతంలో రోజుకు 100 మంది చనిపోగా ఇప్పుడు 7 నుంచి 8 మందికి తగ్గిందని, అది కూడా జరగకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
కోవిడ్ పోరాట యోధులకు కృతజ్ఞతలు
రాష్ట్రంలో కరోనా బారిన పడిన ప్రజల సంఖ్య 8,70,076. రికవరీ అయిన వారు 8,56,320 మంది కాగా 7,014 మంది చనిపోయారు. మరో 6,742 యాక్టివ్ కేసులున్నాయి. ఇంతమంది కోలుకున్నారంటే ఎంత శ్రమకోర్చామో ఊహించవచ్చు. ఇందుకు మన డాక్టర్లు, నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్లు, పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులు, కలెక్టర్లు.. అందరికీ కృతజ్ఞతలు. మిగిలిన రాష్ట్రాలలో కోవిడ్ చికిత్సకు రూ.లక్షలు ఖర్చవుతున్నాయన్న విమర్శలు వచ్చాయి. మన రాష్ట్రంలో అలాంటి ఫిర్యాదులు రాలేదు. ప్రభుత్వం 243 ఆస్పత్రులను అధీనంలోకి తీసుకుని మౌలిక సదుపాయాలు, సిబ్బందిని సమకూర్చింది. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే 104 నెంబరుకు ఫోన్ చేస్తే చాలు టెస్టింగ్, అవసరమైతే ఆస్పత్రిలో చేర్చడం, బెడ్ సమకూర్చడం, చికిత్స తర్వాత తిరిగి ఇంటికి పంపించడం వరకు అన్ని సేవలు ఒక్క కాల్‌తో పొందేలా సదుపాయాలు కల్పించాం. దేశం మొత్తం మనల్ని అభినందిస్తోంది.
ఖర్చుకు వెనకాడకుండా ఖరీదైన వైద్యం..
ఇవాళ రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు 30 డోసులు ప్రతి ఆస్పత్రిలో ఉన్నాయి. ఒక్కోదాని ఖరీదు రూ.5,500. ఒక్కొక్కరికి కనీసం 6 ఇంజెక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. అందుకయ్యే ఖర్చే రూ.30– రూ.35 వేల వరకు ఉంది. పాక్సులీజోమా ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు రూ.17 వేలు. ఇవి కూడా ప్రతి జిల్లా ఆస్పత్రిలో అందుబాటులో ఉంచి ప్రతి ఒక్కరినీ మానవతా దృక్పథంతో ఆదుకుంటాం. ఇంట్లో ఐసొలేషన్‌కు అవకాశం లేని వారికి కోవిడ్ కేర్ సెంటర్లు అండగా నిలుస్తున్నాయి. 14410 కు ఫోన్ చేస్తే వైద్య సహాయం అందుతుంది.
మరికొన్నాళ్లు జాగ్రత్తగా ఉందాం..
కోవిడ్ వ్యాప్తిలో ఇప్పుడు చివరి దశకు వచ్చాం. కొద్ది నెలలు కాస్త జాగ్రత్తగా ఉంటే గండం నుంచి బయటపడొచ్చు. అమెరికాలో మొన్న ఎన్నికలు జరిగాయి. ఇవాళ అక్కడ రోజుకు 2 లక్షల కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 2,500 మంది రోజూ చనిపోతున్నారు. ఎన్నికలు జరిగాయి కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది. బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ లాక్‌డౌన్‌లో ఉన్నాయి. కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాక్సిన్ రావడానికి మరో 3, 4 నెలలు పట్టొచ్చని కేంద్రం చెబుతోంది. ఒకవేళ వచ్చినా మొత్తం రాష్ట్ర జనాభాకు అందకపోవచ్చు. తొలుత కోటి మందికే వాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంది. మిగిలిన వారికి వాక్సిన్ ఇవ్వడానికి సమయం పడుతుంది. చలి పెరుగుతోంది కాబట్టి కరోనా కేసులు పెరుగుతున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ విధించారు. చాలా కష్టపడి ఈ పరిస్థితికి వచ్చాం కాబట్టి కొద్ది నెలలు జాగ్రత్తగా ఉంటే పరిస్థితిని పూర్తిగా అదుపు చేయవచ్చు.
రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని చెప్పను..
కేంద్ర ప్రభుత్వం తొలి దశలో కోటి మందికి వాక్సిన్ అందచేస్తామని తెలిపింది. టీకా నిల్వ చేసేందుకు దాదాపు 4,065 కోల్డ్ ఛెయిన్ ఎక్విప్‌మెంట్ కావాలి. 2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల లోపు వాక్సిన్లు ఉంచాలి. వాక్సిన్ రవాణా కోసం 29 రిఫ్రిజిరేటెడ్ వాహనాలు సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వం ఇవన్నీ సిద్ధం చేస్తున్నా బయటకు కనిపించవు. లోపల ఇవన్నీ జరుగుతున్నాయి. ‘నేను రోజుకు 18 గంటలు పని చేస్తున్నా. నాకు నిద్ర లేదు’ అని చెప్పను. ప్రతి ఒక్కరూ బాగా పని చేస్తున్నారు.
ఆరోగ్యశ్రీ.. ఆరోగ్య ఆసరా
వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింప చేశాం. 1,000 నుంచి 2,059 వ్యాధులకు ఆరోగ్యశ్రీని విస్తరించాం. బయటి రాష్ట్రాలలో కూడా ఆరోగ్యశ్రీ చికిత్స కోసం 130 ఆస్పత్రులు గుర్తించాం. నెట్‌వర్క్ ఆస్పత్రులకు చంద్రబాబు సర్కారు ఎగ్గొట్టిన బకాయిలు తీర్చాం. ఆరోగ్య ఆసరా పథకం ద్వారా ఆపరేషన్ తర్వాత వైద్యులు సూచించినంత కాలం రోగి ఇంట్లో విశ్రాంతి పొందే సమయంలో ఆర్థిక సహాయం అందిస్తున్నాం. విలేజ్ క్లినిక్‌లు మొదలు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్ ఆస్పత్రులను జాతీయస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మారుస్తున్నాం. రాష్ట్రంలో 11 టీచింగ్ ఆస్పత్రులు ఉండగా కొత్తగా మరో 16 వస్తున్నాయి. రానున్న మూడేళ్లలో రూ.16 వేల కోట్లతో వైద్య ఆరోగ్య రంగంలో సమూల మార్పులు తెస్తాం. పేదలెవరూ వైద్యం కోసం అప్పులపాలు కాకూడదన్న తపనతో పని చేస్తున్నాం.
కరోనా నియంత్రణలో ఏపీ దేశానికే ఆదర్శం
నీతిఆయోగ్, ప్రధాని మోదీ ప్రశంసలే నిదర్శనం: మంత్రి ఆళ్ల నాని
కరోనా నియంత్రణలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అన్నారు. నీతిఆయోగ్, ప్రధాని ప్రశంసలే దీనికి నిదర్శనమన్నారు. ‘కరోనా నియంత్రణ–ఆరోగ్యశ్రీ–వైద్య రంగంలో సంస్కరణలు’పై శుక్రవారం అసెంబ్లీ స్వల్ప కాలిక చర్చలో ఆయన ప్రసంగించారు. సీఎం జగన్ అనునిత్యం సమీక్షలు చేస్తూ మార్గనిర్దేశం చేయడం వల్లే రాష్ట్రంలో సమర్థంగా కరోనాను కట్టడి చేయగలిగామని తెలిపారు. డాక్టర్లు, పారామెడికల్, శానిటేషన్, వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేశారని కొనియాడారు. 243 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కోవిడ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేశాం. ప్రత్యేకంగా 21,662 మంది డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిని తాత్కాలిక పద్ధతిన నియమించాం. 9,712 మంది డాక్టర్లు, పారామెడికల్ పోస్టు లను శాశ్వత పద్ధతిలో భర్తీ చేశాం. హైదరా బాద్‌లో కూర్చున్న చంద్రబాబు ప్రజలను పరా మర్శించలేదు. పైగా ప్రజలను భయపెట్టేలా మాట్లాడారు. రాజకీయ స్వార్థంతో ఇలా ప్రజలను భయపెట్టిన బాబుకు ప్రజలు వచ్చే ఎన్నికల్లో మరింత బుద్ధి చెబుతారు. ఆయన హయాంలో వైద్య ఆరోగ్య రంగాలను భ్రష్టు పట్టించారు’ అని ఆళ్ల నాని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment