వైఎస్‌ జగన్: ఇసుక విధానం.. మరింత సరళం | AP Cabinet Approves Easy Sand Policy for People - Sakshi
Sakshi News home page

ఇసుక విధానం.. మరింత సరళం

Published Fri, Nov 6 2020 3:00 AM | Last Updated on Fri, Nov 6 2020 11:22 AM

AP Cabinet Approves Easy Sand Policy To People In Andhra Pradesh - Sakshi

ఇసుక పాలసీపై మంత్రుల కమిటీ సమర్పించిన నివేదికను గురువారం సచివాలయంలో విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు పెద్దిరెడ్డి, కొడాలి నాని, బుగ్గన, సీఎస్‌ సాహ్ని, భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శిద్వివేది, గనుల శాఖ సంచాలకులు వెంకటరెడ్డి

సాక్షి, అమరావతి: కేబినెట్‌ సబ్‌ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రంలో మెరుగైన ఇసుక విధానానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై ఆఫ్‌లైన్‌లోనే ఇసుక పొందే అవకాశం కల్పించనుంది. రాజకీయ జోక్యానికి తావులేకుండా పారదర్శకంగా ఈ విధానాన్ని అమలు చేయనుంది. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా కేబినెట్‌ సమావేశం జరిగింది. నూతన ఇసుక విధానంపై చర్చిస్తూ.. రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎనిమిది ప్రభుత్వ రంగ సంస్థలను, ఎన్‌ఎండీసీ వంటి వాటిని సంప్రదించామని, ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు రాకుంటే 13 జిల్లాలను మూడు భాగాలుగా విభజించి, పారదర్శక పద్ధతిలో టెండర్లు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది.

ఇందులో భాగంగా  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి ఓ భాగం.. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం రెండో భాగం.. నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు మూడో భాగంగా టెండర్లు జరుగుతాయి. ఇసుక సరఫరా కూడా పూర్తి పారదర్శకంగా జరగాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మొత్తంగా 33 అంశాలపై చర్చ జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మీడియా సమావేశంలో వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఎడ్ల బండ్ల ద్వారా తీసుకెళ్లొచ్చు
► ఎడ్ల బండ్ల ద్వారా ఇసుక తీసుకెళ్లవచ్చు. ఇందుకు గ్రామ సచివాలయాల్లో కూపన్లు పొందాలి. బోట్స్‌మెన్‌ సొసైటీలు తదితరాలకు నిబంధనలు పూర్తిగా అమలు చేస్తారు. 
► బలహీన వర్గాల కాలనీలు, రీచ్‌లకు దగ్గర్లోని గ్రామాలు, ఆర్‌అండ్‌ఆర్‌ గ్రామాలకు సబ్సిడీపై ఇసుక ఇస్తారు.
► మద్యం, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటైన స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ)ను మరింత బలోపేతం చేస్తారు. మత్తు పదార్థాలు, నిషేధిత గుట్కా విక్రయాలు, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ బెట్టింగ్, డ్రగ్స్‌ నిర్మూలన పూర్తిగా ఎస్‌ఈబీ పరిధిలోకి తీసుకువస్తూ నిర్ణయం తీసుకున్నారు.
► ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఏర్పాటైన్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఎస్‌ఈబీకి అనుసంధానం చేస్తారు. ఎస్‌ఈబీని బలోపేతం చేసేందుకు ఔట్‌ సోర్సింగ్‌లో 71 పోస్టులు, డిప్యుటేషన్‌పై 31 మంది అధికారుల నియామకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 

జనవరి 1 నుంచి ఇళ్ల వద్దే రేషన్‌ బియ్యం
► జనవరి 1 నుంచి లబ్ధిదారుల ఇంటికే నాణ్యమైన (సార్టెక్స్‌) రేషన్‌ బియ్యం సరఫరా చేస్తారు. ఈ మేరకు కేబినెట్‌ సబ్‌ కమిటీ సిఫార్సులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇంటికి నాణ్యమైన బియ్యం చేర్చేందుకు 9,260 మొబైల్‌ వాహనాలు సిద్ధం చేశారు. మొబైల్‌ వాహనాల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, 20 శాతం ఈబీసీలకు కేటాయిస్తారు. ఆరేళ్లకు వాహనం లబ్ధిదారుడికి సొంతమవుతుంది.
► బియ్యం బస్తాలు దారి మళ్లకుండా ప్రతి బస్తాపై క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. వాహనాలకు జీపీఎస్‌ అమరుస్తాం. ప్రతి లబ్ధిదారుడికి రెండు రీ యూజ్డ్‌ బ్యాగులు అందజేస్తాం. ప్రస్తుతం ఈ విధానం శ్రీకాకుళం జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలవుతోంది.

పాడి పరిశ్రమ బలోపేతం
► సహకార రంగంలో మహిళల స్వావలంబనకు రూ.1,362.22 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు రూపొందించాం. 500 లీటర్ల కన్నా ఎక్కువ పాల సేకరణ జరిగే 9,899 గ్రామాల్లో బల్క్‌ మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.
► రాష్ట్రంలో పాల విప్లవం వెల్లి విరియనుంది. అమూల్‌తో ఎంఓయూ కుదిరింది. పశువుల దాణా, మందులు అన్నీ రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేస్తాం. ఇక్కడే మహిళలు నిర్వహించేలా పాల ఉత్పత్తి కేంద్రాలు ప్రారంభిస్తాం. ఆర్‌బీకేకు అనుసంధానంగా ఇవి పనిచేస్తాయి.
► ‘వైఎస్సార్‌ చేయూత’ ద్వారా పాడి పశువుల కొనుగోలుకు ప్రణాళిక రూపొందించాం. 
 
‘భూమి రక్ష’ పేరుతో సమగ్ర భూసర్వే 
సమగ్ర భూసర్వే జనవరి 1న ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,500 సర్వే బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 15 వేల మంది సర్వేయర్లు ఉంటారు. ఒక్కో మండలంలో నాలుగు నెలలు చొప్పున సర్వే కొనసాగుతుంది. 2023 జూన్‌ నాటికి సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అక్కడికక్కడే భూ వివాదాలను పరిష్కరించేలా ప్రత్యేక మొబైల్‌ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. 
 సర్వే చేసిన ప్రతి భూమికి యునిక్‌ నంబర్‌ కేటాయిస్తారు. ఈ నంబర్‌ ద్వారా పట్టాదారుడు తన భూమి వివరాలు పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అన్ని లావాదేవీలకు ఈ నంబర్‌ వర్తిస్తుంది. 
► వ్యవసాయ భూములతో పాటు గ్రామ కంఠాలు, మున్సిపాల్టీలలోని నివాసిత స్ధలాలకు సంబంధించి పక్కా పాస్‌బుక్, లీగల్‌ టైటిల్‌ కల్పించడమే లక్ష్యం. గ్రామ సచివాలయం కేంద్రంగా రిజిష్ట్రారు కార్యాలయం ఉంటుంది. భూ రక్షణకు సంబంధించి ఇదో విప్లవం. 

ఆక్వా కల్చర్‌ సీడ్‌ యాక్ట్‌–2020కి ఆమోదం
 2006లో రూపొందించిన ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా కల్చర్‌ సీడ్‌ (క్వాలిటీ కంట్రోల్‌) యాక్ట్‌ –2006 కు సవరణలు చేస్తూ రూపొందించిన ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా కల్చర్‌ సీడ్‌ యాక్ట్‌–2020కి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తద్వారా ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్, మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంతో పాటు, వినియోగదారులకు నాణ్యతతో కూడిన ఉత్పతులు అందుబాటులో ఉంటాయి.
ఆక్వా రైతులకు నాణ్యమైన ఫిష్‌ ఫీడ్‌ అందించేందుకు రూపొందించిన ఆంధ్రప్రదేశ్‌ ఫిష్‌ ఫీడ్‌ (క్వాలిటీ కంట్రోల్‌) యాక్టు –2020ని కూడా కేబినెట్‌ ఆమోదించింది. 

వైద్య కళాశాలకు స్ధలాల కేటాయింపు
► నూతన వైద్య కళాశాలల కోసం కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చిలకలపూడిలో 29.6 ఎకరాలు, విజయనగరం మండలం గాజులరేగలో 80 ఎకరాలు, విశాఖ జిల్లా పాడేరు మండలం తలారిసింగి వద్ద 35.01 ఎకరాలు, అనంతపురం జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం పెనుకొండలో 48.49 ఎకరాల స్థలం కేటాయించారు.  
► రాజమండ్రిలో 12.57 ఎకరాలు, నంద్యాల మండలం నూనెపల్లిలో 50 ఎకరాలు, విశాఖ జిల్లా అనకాపల్లిలో 50 ఎకరాలు, గుంటూరు జిల్లా బాపట్ల మండలం జమ్ములపాలెంలో 51.07 ఎకరాలు, గుంటూరు జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్‌ జనరల్‌ ఆసుపత్రి విస్తరణ కోసం 6 ఎకరాలు కేటాయించారు. 
► తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల విస్తరణ కోసం కాకినాడ అర్బన్‌ మండలం రమణయ్యపేట వద్ద 15.76 ఎకరాలు కేటాయింపు.
► విజయవాడ కృష్ణలంకలో నిర్మల శిశుభవన్‌ (అనాథ శరణాలయం)కు మిషనరీ ఆప్‌ ఛారిటీస్‌కు 2 వేల గజాల స్థలాన్ని గజం రూపాయి చొప్పున 99 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 
► విజయవాడ బందరు కాలువ పక్కన 2,266 గజాల స్థలాన్ని మిషనరీ ఆప్‌ ఛారిటీస్‌కు నిర్మల హృదయ భవన్‌ (వృద్ధాశ్రమం) ఏర్పాటు కోసం దీర్ఘకాలిక లీజుకు అనుమతించింది.

ఏ సీజన్‌లో పంట నష్టానికి ఆ సీజన్‌లోనే చెల్లింపు
 నవంబరు 17న ప్రారంభించనున్న వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
2019–20 ఖరీఫ్‌ నాటి నుంచి అమలయ్చే ఈ పథకం వల్ల 14.58 లక్షల రైతులకు ప్రయోజనం ఉంటుంది. దీని కోసం సుమారు రూ.510 కోట్లు కేటాయించారు.
గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1,050 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశాం. దీంతోపాటు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టాన్ని ఆ సీజన్‌లో చెల్లిస్తున్నాం. అక్టోబర్‌లో జరిగిన పంట నష్టాన్ని ఈ నెలలోనే చెల్లించాలని నిర్ణయించాం. 

క్రికెట్‌ స్టేడియంల ఏర్పాటుకు లీజు 
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం జగ్గుశాస్త్రులపేటలో క్రికెట్‌ స్టేడియం ఏర్పాటుకు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌కు 7.66 ఎకరాలను 30 ఏళ్ల పాటు లీజుకు ఇస్తారు. ఏడాదికి రూ.2 లక్షలు లీజు ధర కాగా.. ఏటా 12.5 శాతం లీజు పెంపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
► వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల మండలం కేవీ పల్లెలో క్రికెట్‌ స్టేడియం ఏర్పాటుకు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌కు 11 ఎకరాలను 30 యేళ్లపాటు లీజుకు కేటాయిస్తారు. ఏడాదికి రూ.2 లక్షల లీజు ధర కాగా.. ఏటా 12.5 శాతం లీజు పెంపునకు కేబినెట్‌ ఆమోదించింది. 

వ్యవసాయానికి నాణ్యమైన నిరంతర విద్యుత్‌
వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటల పాటు నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసేందుకు వీలుగా ప్రతిపాదించిన 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టు కోసం జారీ చేసిన జీవో ఎంఎస్‌ నెంబర్‌–18, జీవో ఎంఎస్‌ నెంబర్‌–19లలో సవరణలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 
► తద్వారా ఉచిత విద్యుత్‌కు అయ్యే ఖర్చు ఏటా రూ.8 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్లకు తగ్గనుంది.
► ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌డీసీ)ను బలోపేతం చేయడంతో పాటు ఆ సంస్థకు చట్టబద్దత కల్పించడం కోసం శాసనసభలో ప్రవేశపెట్టనున్న ముసాయిదా బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
► ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన నూటికి నూరు శాతం పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీ ఏపీఎస్‌డీసీ. ఇది సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులకు ఇది ప్లానింగ్, ఫండింగ్‌ చేస్తుంది. 

మచిలీపట్నం పోర్టుకు రూ.5,835 కోట్లు
► మచిలీపట్నం పోర్టు మొదటి దశ పనులకు రైట్స్‌ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఆమోదించడంతో పాటు ఆ ప్రాజెక్టు మొదటి దశ పనులకు పరిపాలనా అనుమతులకూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.5,835 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాలన్నది లక్ష్యం. 
► మొదటి దశ పనులకు అవసరమైన 225 ఎకరాల భూసేకరణ కోసం ఏపీ మారిటైం బోర్డు రూ.90 కోట్లు కేటాయించనుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మారిటైం బోర్డు మొత్తం రూ.4,745 కోట్లు సేకరించనుంది.

రూ.1,050 కోట్లతో ఏటీసీ టైర్ల తయారీ కంపెనీ
రూ.700 కోట్ల పెట్టుబడితో ఇంటిలిజెంట్‌ సెజ్‌ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో పాదరక్షల తయారీ యూనిట్, రూ.1,050 కోట్లతో ఏటీసీ టైర్ల తయారీ కంపెనీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల వల్ల 36,900 మందికి ఉపాధి లభిస్తుంది. 

మరిన్ని నిర్ణయాలు ఇలా..
► వైఎస్సార్‌ కడప జిల్లాలో ఏర్పాటు చేస్తున్న డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో కొత్తగా 224 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వీటిలో 138 టీచింగ్, 86 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఉన్నాయి.
► హోం శాఖ పరిధిలో రాష్ట్రంలోని 8 జిల్లా జైళ్ల (పురుషులు)లో డిప్యూటీ సూపరింటెండెంట్‌ పోస్టులను అడిషనల్‌ సూపరింటెండెంట్‌గా అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు నాలుగు కేంద్ర కారాగారాల్లో 4 అడిషనల్‌ సూపరింటెండెంట్‌ పోస్టుల భర్తీకి ఆమోదం.
► అగ్నిమాపక శాఖలో జోనల్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ పునర్‌ వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పుడున్న రెండు జోన్లు నాలుగు జోన్లుగా మార్పు.
► కొత్తగా రీజనల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టు –1, అడిషనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ పోస్టులు–2 మంజూరు.
► వైద్య, ఆరోగ్య శాఖలో టీచింగ్‌ ఫ్యాకల్టీకి ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం యూజీసీ తరహాలోనే జీతాలివ్వాలన్న నిర్ణయం. దీని వల్ల ఏటా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.400 కోట్లు అదనపు భారం పడుతుంది. సుమారు 3,500 మంది మెడికల్‌ టీచింగ్‌ ఫ్యాకల్టీకి ప్రయోజనం కలుగుతుంది.
► ఐదు సంవత్సరాల జైలు శిక్ష పూర్తి చేసుకున్న మహిళా ఖైదీలను విడుదల చేయాలన్న కేబినెట్‌ నిర్ణయంతో  48 మంది మహిళా ఖైదీలు విడుదల కానున్నారు.  
► కాపు నేస్తం, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వైఎస్సార్‌ వాహనమిత్ర, జగనన్న చేదోడు, చేయూత పథకాల్లో మిగిలిపోయిన అర్హులకు నవంబర్‌ 6వ తేదీ నుంచి పథకాలు వర్తింప చేయాలన్న నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.  

  • విశాఖలో రూ.14,634 కోట్లతో సుమారు 25 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఆదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్, ఇంటిగ్రేటెడ్‌ ఐటీ అండ్‌ బిజినెస్‌ పార్కు, స్కిల్‌ వర్సిటీ, రిక్రి యేషన్‌ సెంటర్‌కు కేబినెట్‌ ఆమోదం తెలి పింది. 2018లో అదాని సంస్థ ప్రతిపాదించిన భూమి కంటే తక్కువ భూమి కేటాయిస్తూ అప్పటి కంటే ఎక్కువ మందికి ఉపాధి లభిం చేలా నిర్ణయం తీసుకున్నారు. 2018లో చేసిన ప్రతిపాదనల ప్రకారం 500 ఎకరాల్లో డేటా సెంటర్‌ నిర్మాణం ద్వారా 6,000 మందికి ఉపాధి లభించనుండగా, ప్రస్తుతం మంత్రి మండలి ఆమోదించిన ప్రతిపా దన ద్వారా 130 ఎకరాల్లో ప్రాజెక్టు చేపట్టడం ద్వారా 24,990 మందికి ఉపాధి లభించనుంది. 
  • చిన్న, వీధి వ్యాపారాలు చేసుకునే వారు, చేతి వృత్తుల కళాకారులకు వడ్డీ లేకుండా ‘జగనన్న తోడు’ పథకం కింద రూ.10 వేల వడ్డీ లేని రుణం ఇస్తారు. రూ.వెయ్యి కోట్లు కేటాయించిన ఈ పథకం నవంబర్‌ 24న ప్రారంభం అవుతుంది. ఈ పథకం కింద 9.18 లక్షల మంది నమోదయ్యారు. బ్యాంకుల ద్వారా 5.60 లక్షల మందిని టై అప్‌ చేశారు.
  • డ్రోన్లు, రోవర్లు, 70 బేస్‌ స్టేషన్లు (కంటిన్యూస్‌ ఆపరే టింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్స్‌ కోర్స్‌) ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్ట నున్న సమగ్ర భూ రీసర్వే ప్రాజెక్టుకు పరిపాలనాపరమైన అనుమతులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రూ.987.46 కోట్లతో సమగ్ర భూ రీసర్వే చేపట్టనున్నారు.
  • ప్రతి ఇసుక రీచ్‌ దగ్గర 20 వాహనాలు ఏర్పాటు చేస్తారు. ఇసుక రీచ్‌ల వద్దే ధర నిర్ణయిస్తారు. అధిక ధరలకు అమ్మితే స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌కు ఫిర్యాదు చేయొచ్చు. కావాల్సిన వాహనాన్ని బుక్‌ చేసుకుని ఇసుక తీసుకెళ్లొచ్చు. వినియోగదారుడు సొంత వాహనంలోనైనా తీసుకెళ్లొచ్చు. పట్టా భూముల నుంచి ఇసుక తీసుకునే విధానాన్ని రద్దు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement