సాక్షి, అమరావతి: రైతుకు అందే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమేనని, ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వల్ల రైతుపై ఒక్కపైసా భారం కూడా పడదని హామీ ఇచ్చారు. అమల్లో ఉన్న పథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నామని, వచ్చే 30–35ఏళ్లపాటు ఉచిత విద్యుత్ పథకానికి ఢోకా లేకుండా చేస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కేబినేట్ గురువారం సమావేశమైంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఉచిత విద్యుత్ పథకం- నగదు బదిలీకి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అన్ని వ్యవసాయ కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు తెలిపారు. ‘‘కనెక్షన్ ఉన్న రైతు పేరు మీద బ్యాంకు ఖాతా ఉంటుంది. కరెంటు బిల్లు డబ్బు అందులో నేరుగా జమ కానుంది. అదే డబ్బును రైతులు డిస్కంలకు చెల్లించనున్నారు. దీని వల్ల రైతుపై ఎలాంటి భారం ఉండదు’’ అని స్పష్టం చేశారు. (చదవండి: రైతులు పైసా కట్టక్కర్లేదు)
‘‘చంద్రబాబు ఉచిత విద్యుత్తు సాధ్యం కాదన్నారు. కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవడమేనని ఎద్దేవా చేశారు. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుది. సుమారు 8వేల కోట్ల మేర ఉచిత విద్యుత్తు బకాయిలు పెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలు తీర్చాం. రూ. 1700 కోట్లతో ఫీడర్లను అప్‌గ్రేడ్ చేశాం. నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. పగటిపూట 9 గంటల కరెంటు, ఇప్పటికే 89శాతం ఫీడర్లలో అమలు అవుతోంది. రబీ సీజన్ నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. 10వేల మెగావాట్ల సోలార్‌తో పథకాన్ని మరింత గొప్పగా దీర్చిదిద్దుతాం. ఉచిత విద్యుత్ పథకానికి ఢోకా లేకుండా ప్రణాళికలు రచిస్తున్నాం. ఉచిత విద్యుత్‌పై పేటెంట్ ఒక్క వైఎస్సార్‌కే ఉంది. అందుకే పథకానికి ఆయన పేరు’’ అని సీఎం జగన్ తెలిపారు.(చదవండి:మహానేత స్ఫూర్తితోనే వైఎస్ జగన్ పరిపాలన)
శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఉచిత విద్యుత్ పథకం అమలు కానున్నట్లు వెల్లడించారు. అదే విధంగా ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలకు అనుగుణంగానే వ్యవసాయ విద్యుత్తు వినియోగదారులకు నగదు బదిలీ పథకాన్ని చేపట్టాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment