AP Cabinet Meeting: Andhra Pradesh Cabinet Has Taken Several Key decisions At Meeting - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

Published Thu, Jul 1 2021 2:05 AM | Last Updated on Thu, Jul 1 2021 4:49 PM

AP cabinet taken several key decisions that revolutionized agricultural sector - Sakshi

బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర రైతన్నలకు ప్రయోజనం కలిగేలా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8వతేదీన రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులకు మేలు చేకూర్చే పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, పంటలకు మెరుగైన ధర కల్పించే విధంగా కొత్త ఫుడ్‌ ప్రాసెసింగ్‌ విధానానికి ఆమోదం తెలిపింది. వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌ అవకాశాలను అందించే ఏకీకృత వ్యవస్థను నెలకొల్పేందుకు ‘ఈ–మార్కెటింగ్‌’ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్‌ రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తుండటాన్ని మంత్రివర్గం తీవ్రంగా ఖండించింది. దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మీడియాకు తెలిపారు. ఆ వివరాలు ఇవీ..

రైతు పథకాలకు శ్రీకారం..
వైఎస్సార్‌ జయంతి సందర్భంగా జూలై 8న రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన 1,898 వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల శాశ్వత భవనాలను ప్రారంభిస్తారు. వాటితో పాటు ఇంకా ప్రారంభించేవి.. 
– రూ.79.50 కోట్లతో నిర్మించిన 100 వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్, ఆక్వా, సీఏడీడీఎల్‌ ల్యాబ్స్‌..
– రూ.96.64 కోట్లతో నిర్మించిన 645 తొలి విడత కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు..
– రూ.31.74 కోట్లతో నిర్మించిన 53 వెటర్నరీ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, రూరల్‌ లైవ్‌ స్టాక్‌ యూనిట్లు
–  పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం రూ.7.53 కోట్లతో నిర్మించిన టెలీ మెడిసిన్‌ కాల్‌ సెంటర్‌
– పశు – మత్స్యదర్శిని మ్యాగజైన్‌
– ఆర్బీకేల ద్వారా పశు సంవర్థక, ఆక్వా రంగాలకు ఇన్‌పుట్స్‌ పంపిణీ..

వీటికి శంకుస్థాపన...
– ఆర్బీకేల స్థాయిలో 1,262 గోడౌన్ల నిర్మాణానికి శంకుస్థాపన.
– ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఒకటి చొప్పున ‘పోస్ట్‌ హార్వెస్ట్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ సెంటర్ల’ నిర్మాణానికి శంకుస్థాపన. రూ.200.17 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. అనకాపల్లి బెల్లం, రాజమండ్రి అరటి, శ్రీకాకుళం జీడిపప్పు, చిత్తూరు మామిడి, బాపట్ల చిరుధాన్యాలు, వైఎస్‌ఆర్‌ కడప అరటి, హిందూపురం వేరుశనగ, కర్నూలులో టమాట ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్మాణం.
– రూ.212.31 కోట్లతో మార్కెట్‌ యార్డుల్లో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు. 
– రూ.45 కోట్లతో కొత్తగా రైతు బజార్ల నిర్మాణానికి శంకుస్థాపన. 6 నూతన రైతు బజార్ల ప్రారంభం.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ విధానానికి ఆమోదం
పంటలకు మెరుగైన ధర కల్పిస్తూ రైతు కేంద్రంగా కొత్త ఫుడ్‌ ప్రాసెసింగ్‌ విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పంటల సాగుకు తోడ్పాటు అందించి ప్యాకేజింగ్‌ పరిశ్రమను ప్రోత్సహిస్తారు. రైతుల ఆదాయాలను పెంచాలన్నది లక్ష్యం. తద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే కాకుండా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేస్తారు. నాణ్యమైన, మెరుగైన వంగడాలను సాగు చేసేలా పంటల ప్రణాళిక అమలు చేస్తారు. అతి పెద్ద కంపెనీలతో ఒప్పందాల ద్వారా విస్తారమైన మార్కెటింగ్‌ అవకాశాలను అందుబాటులోకి తెస్తారు. పంటలు పండే ప్రాంతాలకు సమీపంలోనే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ క్లస్టర్స్‌ నెలకొల్పి నైపుణ్యాలను పెంపొందిస్తారు. ముడి పదార్థాల కొరత లేకుండా ఆర్బీకేలతో అనుసంధానం చేసి పంటలు సాగు చేసేలా, మంచి ఉత్పత్తులు వచ్చేలా చర్యలు చేపడతారు.

ఉటుకూరులో కడక్‌నాథ్‌ కోళ్ల పౌల్ట్రీ
కడప జిల్లా ఉటుకూరులో కడక్‌నాథ్‌ జాతి కోళ్ల పౌల్ట్రీ ఫాం ఏర్పాటును మంత్రివర్గం ఆమోదించింది. ఇప్పటికే అక్కడున్న పౌల్ట్రీఫాంను దీనికి అనుగుణంగా తీర్చిదిద్దుతారు. నాటుకోడి మాంసం, నాటుకోడి గుడ్లకు ఉన్న డిమాండ్‌ నేపథ్యంలో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జూలై 8న శంకుస్థాపన చేస్తారు. 20 వేల కడక్‌నాథ్‌ జాతి కోడిపిల్లలను ఉత్పత్తి చేసేలా మౌలిక సదుపాయాల కల్పిస్తారు. 

మొబైల్‌ వెటర్నరీ అంబులెన్స్‌లు 
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 175 మొబైల్‌ వెటర్నరీ అంబులెన్స్‌లను ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. 108, 104 తరహాలో ఈ అంబులెన్స్‌ల ద్వారా పశువైద్యం అందిస్తారు. మొబైల్‌ వాహనాల్లో హైడ్రాలిక్‌ లిఫ్ట్‌తోపాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. నిపుణులైన సిబ్బందిని నియమిస్తారు. కొత్త వాహనాలకు రూ.63 కోట్లతోపాటు నిర్వహణ ఖర్చులు కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ. 89.95 కోట్లు వెచ్చిస్తుంది. రైతులు కాల్‌ సెంటర్ల ద్వారా వెటర్నరీ డాక్టర్లుకు నేరుగా ఫోన్‌ చేసి పశువుల అనారోగ్య సమస్యలపై వివరాలు పొందవచ్చు.

ఏపీ ఫార్మర్స్‌ ఇ–విక్రయ కార్పొరేషన్‌ లిమిటెడ్‌
రైతులు,కొనుగోలుదారులు, వ్యాపారులను అనుసంధానించేందుకు ఇ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫాం ‘ఆంధ్రప్రదేశ్‌ ఫార్మర్స్‌ ఇ–విక్రయ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’ (ఏపీఎఫ్‌ఈవీసీఎల్‌) ఏర్పాటును మంత్రివర్గం ఆమోదించింది. రైతుల ఉత్పత్తులను అంతర్రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వ్యాపారులతో ఇ–ప్లాట్‌ఫాం అనుసంధానిస్తుంది. ఫైనాన్స్, ఇన్సూరెన్స్, వేర్‌ హౌసింగ్, లాజిస్టిక్స్, రియల్‌టైమ్‌ ప్రొడక్షన్‌ అప్‌డేట్స్, మిగులు నుంచి డిమాండ్‌ వరకూ మ్యాపింగ్, మార్కెట్‌ లింకేజీ, ట్రేడ్‌ ఫెసిలిటేషన్‌ తదితర అవసరాలను తీరుస్తారు. 

వైఎస్సార్‌ బీమా పథకానికి ఆమోదం
దారిద్య రేఖకు దిగువనున్న కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆదుకునేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ బీమా’ పథకాన్ని మంత్రివర్గం ఆమోదించింది. పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం వైదొలగిన నేపథ్యంలో పూర్తి బాధ్యతలు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  

వైఎస్సార్‌ జగనన్న కాలనీల నిర్మాణం వేగవంతం 
పేదలందరికీ ఇళ్ల నిర్మాణం పథకం పనులు వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ పథకం కింద మొత్తం 28.30 లక్షల ఇళ్లతో ప్రభుత్వం 17,005 వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీలను నిర్మిస్తోంది. ప్రత్యేక క్యాంపెయిన్‌గా జూలై 1, 3, 4 తేదీల్లో ఈ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. జూలై 10 కల్లా 7 లక్షలు, ఆగస్టు 31లోగా 3 లక్షల ఇళల్లో నిర్మాణ పనులు ప్రారంభం కావాలన్నది లక్ష్యం. ఆగస్టు 10 – సెప్టెంబరు 30 మధ్య మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఒక్కో ఇంటిలో 340 చదరపు అడుగుల్లో లివింగ్‌ రూమ్, బెడ్‌రూమ్, కిచెన్, టాయిలెట్, వరండా ఉంటాయి. 2 ఫ్యాన్లు, 2 ట్యూబ్‌లైట్లు, 4 బల్బులు ఏర్పాటు చేస్తారు. మొదటి విడతలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని జూన్‌ 2022 కల్లా పూర్తి చేయాలని నిర్ణయించారు. రెండో విడతలో మిగిలిన 12.70 లక్షల ఇళ్లను నిర్మిస్తారు. పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. జూన్‌ 3న ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించగా ఇప్పటికే 3.36 లక్షల ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి. 

అమ్మ ఒడి, వసతి దీవెన కింద ల్యాప్‌టాప్‌లు
జగనన్న అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెనల కింద లబ్ధిదారుల సమ్మతితో నగదుకు బదులుగా ల్యాప్‌టాప్‌ల పంపిణీని మంత్రివర్గం ఆమోదించింది.  9 నుంచి 12వ తరగతి విద్యార్థుల్లో 8,21,655 మంది ల్యాప్‌టాప్‌లు కావాలని కోరారు. జగనన్న వసతి దీవెన లబ్ధిదారుల్లో 1,10,779 మంది ల్యాప్‌టాప్‌లు కోరారు. డ్యుయల్‌ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్‌ డిస్క్, 14 అంగుళాల స్క్రీన్, విండోస్‌ 10 (ఎస్‌టీఎఫ్‌ మైక్రోసాఫ్ట్‌), ఓపెన్‌ ఆఫీస్‌ (ఎక్సెల్, వర్డ్, పవర్‌ పాయింట్‌) సదుపాయాలున్న లెనోవా, డెల్, ఏసర్, హెపీ ల్యాప్‌టాప్‌లను మూడేళ్ల వారంటీతో పంపిణీ చేస్తారు. మరమ్మతులు అవసరమైతే గ్రామ/ వార్డు సచివాలయాల ద్వారా ఫిర్యాదు చేసి సేవలు పొందవచ్చు. 
 
కొత్తగా రెండు విశ్వవిద్యాలయాలు 
రాష్ట్రంలో కొత్తగా రెండు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట వద్ద ఆంధ్రకేసరి మల్టీ డిసిప్లినరీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తారు. మొదటి దశలో రూ.339కోట్లు వెచ్చిస్తారు. ప్రస్తుతం ఉన్న పీజీ సెంటర్‌ను మరోచోటకు మారుస్తారు. 19 డిపార్ట్‌మెంట్లతో ఏర్పాటయ్యే ఈ వర్శిటీలో 50 మంది టీచింగ్, 50 మంది నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని నియమిస్తారు. తొలుత వెయ్యిమంది విద్యార్థులతో విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తారు. విజయనగరంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ(జేఎన్‌టీయూ–కే) కాలేజీని జేన్‌టీయూ– విజయనగరం యూనివర్శిటీగా మారుస్తారు. ఉత్తరాంధ్ర విద్యార్థులకు ప్రయోజనం కలిగించే ఈ విశ్వవిద్యాలయానికి అదనంగా 24 టీచింగ్‌ పోస్టులు, 17 నాన్‌ టీచింగ్‌ పోస్టులు మంజూరు చేశారు.  

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ నిర్మాణానికి ఆమోదం
పట్టణాలు, నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు లాభాపేక్ష లేకుండా అభివృద్ధి చేసిన ఇళ్ల స్థలాల ఏర్పాటుకు ఉద్దేశించిన ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌’ పథకాన్ని మంత్రివర్గం ఆమోదించింది. 150, 200, 240 చదరపు గజాల విస్తీర్ణంలో మూడు రకాలుగా ప్లాట్లు అందించే ఈ పథకానికి సంబంధించి విధివిధానాలను ఖరారు చేశారు. ఒక కుటుంబానికి ఒకటే ప్లాటు కేటాయిస్తారు. దరఖాస్తుదారుడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. ఆదాయం ఏడాదికి గరిష్టంగా రూ.18 లక్షల లోపు ఉండాలి.  18 ఏళ్ల పైబడి వయసు ఉండాలి. లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, తాగునీటి సరఫరా, భూగర్భ మురుగునీటి పారుదల సదుపాయం, పార్కులు, ఓపెన్‌ స్పేస్‌ లాంటి అన్ని వసతులతో స్మార్ట్‌టౌన్లు ఏర్పాటవుతాయి. ఇప్పటికే స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌కు విశేష స్పందన వచ్చింది. 3.79 లక్షల దరఖాస్తులు అందాయి. 

టిడ్కో నిధుల సమీకరణకు అనుమతి
ఏపీ టిడ్కో ఇళ్ల నిర్మాణానికి నిధుల సమీకరణకు మంత్రివర్గం అనుమతించింది. రూ.5,990.30 కోట్ల రుణ సేకరణకు బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.12,101 కోట్ల ఖర్చుతో 2,62,216 ఇళ్లను ప్రభుత్వం పూర్తి చేయనుంది. 

ఐటీ విధానానికి ఆమోదం 
2021– 2024 ఐటీ విధానాన్ని మంత్రివర్గం ఆమోదించింది. మౌలిక సదుపాయాలను గణనీయంగా అభివృద్ధి చేస్తారు. 3 కాన్సెప్ట్‌ సిటీలు, గ్రామ పంచాయతీ స్థాయిలో డిజిటల్‌ లైబ్రరీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. గ్రామాలకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పిస్తుంది. ఎక్కడనుంచైనా పనిచేసే వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ విధానంలో నైపుణ్యాలను మెరుగుపరచడానికి పెద్దపీట వేశారు. ఇందుకోసం విశాఖపట్నంలో హై ఎండ్‌ స్కిల్స్‌లో భాగంగా ఐటీ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ రీసెర్చ్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తారు. ఎస్‌ఐపీబీ ప్రతిపాదనలకూ ఆమోదం లభించింది.

సచివాలయాల్లోనే భూ వినియోగ మార్పిడి
వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకునే దరఖాస్తులను గ్రామ సచివాలయాల ద్వారా పరిష్కరించేలా చట్ట సవరణలను మంత్రివర్గం ఆమోదించింది. భవనాలు, లే–అవుట్ల అనుమతులతో వీటిని ఏకీకృతం చేస్తారు. ఏకీకృత కన్వర్షన్‌ రేటును కంప్యూటర్‌ ద్వారా ధర లెక్కించే విధానాన్ని తెస్తున్నారు. ఏపీఐఐసీ ద్వారా భూమి పొందే పరిశ్రమలకు ఈ విధానం నుంచి మినహాయింపు ఇస్తారు. వాటికి ఎప్పటికప్పుడు ప్రకటించే విధానాలు వర్తిస్తాయి. ఆక్వా కల్చర్, డెయిరీ, పౌల్ట్రీ రంగాలకు దీన్నుంచి మినహాయింపునిస్తారు. వ్యవసాయేతర భూములపై నిరంతర వివరాల సేకరించి రికార్డులు తయారు చేస్తారు.

కాకినాడలో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌
కాకినాడ డీప్‌ సీ వాటర్‌ పోర్టులో ఈపీసీఎల్‌ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌కు మంత్రివర్గం అనుమతినిచ్చింది. రూ.1, 600 కోట్లతో టెర్మినల్‌ అభివృద్ధి. రూ.200 కోట్లతో ఎల్‌ఎన్‌జీ స్టేషన్ల ఏర్పాటు. మొదటి విడతలో రూ.3,600 కోట్ల ఖర్చుతో దాదాపు 700 మందికి ఉపాధి అవకాశాలు.

సీమ కరువు నివారణ పథకానికి రూ.864.18 కోట్లు
పుట్టపర్తిలో చెరువులు నింపే రూ.864.18 కోట్ల ప్రాజెక్టును  మంత్రివర్గం ఆమోదించింది. రాయలసీమ కరవు నివారణ పథకం కింద పుట్టపర్తి నియోజకవర్గంలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి గ్రావిటీ, లిఫ్ట్‌ ద్వారా 195 చెరువుల్లో నీరు నింపేలా ఈ పథకాన్ని రూపొందించారు. 

ఇతర కీలక నిర్ణయాలు....
► కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో  2,180 ఎకరాల భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం. రైతులకు మేలు జరిగేలా స్టాంప్‌ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ ఫీజు, రిజిస్ట్రేషన్‌ ఫీజుల నుంచి మినహాయింపు ఇచ్చేందుకు అనుమతి. 
► సమగ్ర భూ సర్వే కోసం చట్ట సవరణలకు ఆమోదం. వ్యవసాయేతర భూమికి యాజమాన్య హక్కు పత్రాలు ఇచ్చేలా సవరణలు. ఆస్తిపరమైన వివాదాలు, కేసులకు చెక్‌ పెట్టేలా హక్కు పత్రాల జారీ. 
► గ్రామ కంఠాల్లో నివసిస్తున్న వారికి పట్టాలు ఇచ్చేలా పంచాయతీరాజ్‌ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం.
► కొత్తగా 104 వాహనాలు 539 కొనుగోలు, నిర్వహణకు అనుమతి. ఇందుకోసం ఈ ఏడాది రూ.165.09 కోట్లు వ్యయం. 
ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలుకు చర్యలు. 
► ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం వద్ద కిడ్నీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్, మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి 50.33 ఎకరాల భూమి కేటాయిస్తూ నిర్ణయం. 
► ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం మామిడిపాలెం వద్ద సూపర్‌ స్పెషాల్టీ ఆసుపత్రి కోసం 6.17 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించాలని
నిర్ణయం. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి నిర్మించి వైద్య కళాశాలకు అనుసంధానం.
► జిల్లా పరిషత్‌ సమావేశాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల కార్పొరేషన్ల ఛైర్మన్లు శాశ్వత ఆహ్వానితులుగా హాజరయ్యేందుకు మంత్రివర్గం ఆమోదం. జిల్లా పరిషత్‌లలో రెండో వైస్‌ ఛైర్మన్‌ పదవికి అవకాశం కల్పిస్తూ చట్ట సవరణలకు ఆమోదం. 
► 25 బీసీ కార్పొరేషన్ల స్థానంలో 56 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు బైలాస్‌కు మంత్రివర్గం ఆమోదముద్ర. 
► చిత్తూరు జిల్లా పుంగనూరులో కొత్తగా వ్యవసాయ పాలిటెక్నిక్‌ ఏర్పాటుకు ఆమోదం. ఏటా 40 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తూ రెండేళ్ల కోర్సు నిర్వహణ.
► కడప జిల్లా బి.కోడూరు మండలం ప్రభలవీడులో వెటర్నరీ డిస్పెన్సరీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం.
► శ్రీకాకుళం జిల్లా పలాసలో కొత్త డిగ్రీ కాలేజీకి 27 టీచింగ్‌ పోస్టులు, 14 నాన్‌ టీచింగ్‌ పోస్టులు మంజూరు. 
► కడప జిల్లా రాయచోటి డిగ్రీ కాలేజీకి 29 టీచింగ్‌ పోస్టులు, 14 నాన్‌ టీచింగ్‌ పోస్టులు మంజూరు. 
► కర్నూలు జిల్లా బేతంచర్లలో కొత్తగా ఏర్పాటైన ఐటీఐకి 27 పోస్టులు, నంద్యాల ఐటీఐకి 29 పోస్టులు మంజూరు. మొత్తం 56 పోస్టుల మంజూరుకు అనుమతి. 
► అనంతపురం ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీలో 28 పోస్టుల భర్తీకి ఆమోదం. 
► తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటుకు అనుమతి, 19 పోస్టులు మంజూరు.
► విజయవాడ ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్, తిరుపతి కళ్యాణి డ్యాం పీటీసీ, గ్రే హౌండ్స్, విజయనగరం పీటీసీ ప్రిన్సిపల్, విజయవాడ సిటీ సెక్యూరిటీ వింగ్, మంగళగిరి పీటీఓ పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయం.
► విజయవాడలోని గుణదలలో కొత్తగా శాంతిభద్రతల పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు.  మాచవరం, సత్యనారాయణపురం స్టేషన్ల పరిధిలోని కొన్ని ప్రాంతాలను కొత్త పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి మార్పు. ఈ పోలీస్‌ స్టేషన్‌కు ఒక సీఐ, 15 మంది కానిస్టేబుల్‌ పోస్టులు మంజూరు.
► రెడ్డి, కమ్మ, క్షత్రియ కార్పొరేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. 
► కోవిడ్‌ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి మంత్రివర్గం ఆమోదం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement