సాక్షి, అమరావతి: మన బడి నాడు–నేడు కార్యక్రమానికి నిధుల కొరత లేదని, స్కూళ్లకు ఎండాకాలం సెలవులను సద్వినియోగం చేసుకుంటూ రెండో దశ పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. తల్లిదండ్రుల కమిటీల ఖాతాల్లో రూ.734.21 కోట్లు ఉన్నాయని, తదుపరి ఖర్చుల కోసం మరో రూ.1,400 కోట్లు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మన బడి నాడు – నేడు, జగనన్న విద్యా కానుకపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నతాధికారులకు మార్గ నిర్దేశం చేశారు.
జూన్ 12 లోగా ఐఎఫ్‌పీ ప్యానెళ్ల బిగింపు
ఐఎఫ్‌పీ పానెళ్లను బిగించడం ద్వారా 15,715 స్కూళ్లలో మొదటి విడత నాడు– నేడు పనులు పూర్తైనట్లు అవుతుంది. దీంతో 6వ తరగతి, ఆపై తరగతులకు సంబంధించి 30,230 క్లాస్‌రూమ్స్‌లో డిజిటలైజేషన్ పూర్తవుతుంది. జూన్ 12వతేదీ లోగా ఐఎఫ్‌పీ ప్యానెళ్ల బిగింపు పూర్తి కావాలి. రెండో దశలో 16,461 స్కూళ్లలో నాడు– నేడు చేపడుతున్నాం. ఫేజ్ – 3లో సుమారు మరో 13 వేల స్కూళ్లలో నాడు– నేడు ద్వారా పనులు జరుగుతాయి.
వేసవి సెలవుల్లో పనులపై దృష్టి పెట్టాలి
మూడు విడతల్లో దాదాపు 45 వేల ప్రభుత్వ స్కూళ్లలో నాడు – నేడు పనులు పూర్తవుతాయి. వేసవి సెలవుల్లో పనులు చేయడానికి పూర్తి అవకాశాలు ఉంటాయి. ఈ సమయాన్ని పనుల కోసం బాగా వినియోగించుకోవాలి. కలెక్టర్లు దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి.
తొలి విడతలో ఎక్కడైనా లోపాలుంటే సరిదిద్దాలి
మొదటి విడతలో నాడు– నేడు పనులు చేపట్టిన పాఠశాలలపై పూర్తిస్థాయి ఆడిట్ చేపట్టాలి. ఎక్కడైనా లోపాలుంటే వెంటనే సరిదిద్దాలి. ఇంత పెద్ద సంఖ్యలో స్కూళ్లలో పనులు చేపడుతున్నాం. నాణ్యత లోపించకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రామ, వార్డు సచివాలయాల సేవలను సమర్థంగా వినియోగించుకోవాలి. పేరెంట్స్ కమిటీ సేవలను కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇసుక, సిమెంట్, స్టీలు లాంటివి కొరత లేకుండా పంపిణీపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. తద్వారా పనుల్లో ఆలస్యం జరగకుండా నివారించవచ్చు.
ట్యాబ్‌లు బాగున్నాయా?
8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు కలిపి సుమారు 5,18,740 ట్యాబ్‌లు ఇచ్చాం. వీటి ద్వారా విద్యార్థులకు ప్రయోజనం అందేలా చూడాలి. అవి సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? అన్నదానిపై సమీక్ష చేయాలి. సమస్యలుంటే ఏం చేయాలో ఎస్‌వోపీలు రూపొందించాం. హెడ్మాస్టర్‌కు గానీ స్థానిక సచివాలయాల్లో గానీ అందచేస్తే మూడు రోజుల్లోగా రిపేరు చేసి తిరిగిస్తారు. ఈ మేరకు ఎస్‌వోపీల అమలుపై కలెక్టర్లు పర్యవేక్షించాలి.
నెలకోసారి డిజిటల్ డే
గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు స్కూళ్లకు వెళ్లి ఉపాధ్యాయులు, పిల్లలకు ట్యాబ్‌ల వినియోగంపై అవగాహన కల్పిస్తారు. నెలకోసారి తప్పనిసరిగా డిజిటల్ డే పాటిస్తూ వారు స్కూళ్లకు వెళ్తారు. ప్రభుత్వం ఇచ్చిన ట్యాబుల వినియోగంపై అవగాహన కల్పించడం, వినియోగించడంపై శిక్షణ ఇస్తారు.
జూన్ 12న స్కూళ్లు తెరవగానే ‘విద్యాకానుక’
స్కూళ్లు జూన్ 12న తిరిగి తెరుస్తారు, అదే రోజు వారికి జగనన్న విద్యాకానుక అందించాలి. ఇందులో ఎలాంటి ఆలస్యానికి తావు ఉండకూడదు. దాదాపు 43.10 లక్షల మందికి జగనన్న విద్యాకానుక అందుతుంది. విద్యాకానుక పంపిణీపై ప్రోటోకాల్‌ను పాటించాలి. విద్యాకానుక ద్వారా అందించే వస్తువుల క్వాలిటీపై కూడా బెస్ట్ ప్రోటోకాల్ పాటించాలి. బై లింగ్యువల్ (ద్విభాషా) పాఠ్య పుస్తకాలు, మూడు జతల యూనిఫామ్, నోట్‌బుక్స్, బ్యాగ్, షూ, రెండు జతల సాక్స్, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ, బెల్టు, వర్క్‌బుక్స్‌తో కూడిన కిట్ నాణ్యతను పిల్లలకు అందించే ముందు కచ్చితంగా పరీక్షించాలి.
కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను మానిటరింగ్ చేయాలి. జగనన్న విద్యాకానుకపై ఏ ఒక్క స్కూలు, ఏ విద్యార్థి నుంచి నాకు ఫిర్యాదులు రాకూడదు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్లు పిల్లలకు విద్యాకానుక అందించాలి. గతంలో పుస్తకాలు సమయానికి ఇచ్చేవారు కాదు. అక్టోబర్, నవంబర్ నెలలొచ్చినా పిల్లలకు అందేవి కావు. నా పాదయాత్ర సమయంలో ఆ ఇబ్బందులు నేను స్వయంగా చూశా. మనం వచ్చాక పాఠశాలలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాం. మొత్తం వ్యవస్థలో మార్పులు తీసుకునివచ్చాం. పాఠశాలల్లో నైట్ వాచ్‌మెన్లను నియమించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.
మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం
మాదక ద్రవ్యాల నిర్మూలనపై పోలీసు అధికారులు దృష్టిపెట్టాలి. ప్రతి యూనివర్సిటీ, కాలేజీల్లో ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రదర్శిస్తూ పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలి. జిల్లాల పోలీసు కార్యాలయాల్లో ప్రత్యేక డివిజన్‌ను సిద్ధం చేయాలి. విద్యాసంస్థల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని నిరంతరం సమాచారం సేకరించాలి. పిల్లలు వాటి బారిన పడకుండా కౌన్సెలింగ్ నిర్వహించాలి. మాదక ద్రవ్యాల తయారీదారులు, రవాణా, పంపిణీదారులపై అత్యంత కఠినంగా వ్యవహరించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని 15 వేల మందికిపైగా మహిళా పోలీసుల (మహిళా సంరక్షణ కార్యదర్శులు) సేవలను సమర్థంగా వినియోగించాలి.
Comments
Please login to add a commentAdd a comment