సాక్షి, అమరావతి: రాజకీయ కురువృద్ధులు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థించారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉంటూ, మచ్చలేని నాయకుడిగా, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన నాయకుడు సాంబశివరాజు అని సీఎం కొనియాడారు. ఆయన మరణం విజయనగరం జిల్లాతో పాటు, రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు. పెనుమత్స సాంబశివరాజు కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. (పెనుమత్స సాంబశివరాజు కన్నుమూత)
తెలుగు ప్రజలకు తీరని లోటు: ధర్మాన
మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు అని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేశారని, విలువలతో నిజాయితీ గా రాజకీయాలు చేశారని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సాంబశివరాజు కృషి మరువలేనిది: ఆళ్ల నాని
విజయనగరం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో మంచి పేరు సంపాదించిన సాంబశివరాజు మరణం ఉత్తరాంధ్ర కే కాకుండా వైస్సార్సీపీ తీరని లోటని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. వైఎస్సార్‌సీపీలో క్రమశిక్షణతో పార్టీ కార్యక్రమాలు ఎంతో చిత్త శుద్ధితో నిర్వహించి.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడంలో సాంబశివరాజు చేసిన కృషి మరువలేనిదని, ఈ ఆపత్కాలంలో వారి కుటుంబానికి భగవంతుడు మనో దైర్యం కలిగించాలని ప్రార్ధిస్తున్నట్టు ఆళ్ల నాని పేర్కొన్నారు.
రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు..
పశ్చిమగోదావరి: వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు మృతి పట్ల గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు సంతాపం తెలిపారు. సాంబశివరాజు మరణం తనను వ్యక్తిగతంగా తీవ్రంగా బాధించిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాంబశివరాజు నీతి నిజాయితీ కలిగి విలువలతో రాజకీయాలు నెరపిన మచ్చలేని తొలితరం రాజకీయ నాయకుడని పేర్కొన్నారు. ఏనాడు పదవుల కోసం, అధికారం కోసం పాకులాడిన వ్యక్తి కాదని, దాన ధర్మాలతో ఉన్న ఆస్తులు కరిగించుకున్న ధర్మాత్ముడని శ్రీరంగనాథ రాజు అన్నారు.
గురుతుల్యులను కోల్పోయా...
పెనుమత్స సాంబశివరాజు మృతి పట్ల పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని, ఎందరికో ఆదర్శప్రాయులైన సాంబశివరాజు లేని లోటు ఎవరూ తీర్చలేనిదని, ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆయన అడుగుజాడల్లో పని చేసి ఎన్నో విషయాలను నేర్చుకున్నామని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు.
అభివృద్ధిలో చెరగని ముద్ర..
మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మృతిపై మంత్రి అవంతి శ్రీనివాసరావు సంతాపం తెలిపారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లోనే కాదు అభివృద్ధిలో కూడా సాంబశివరాజు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెన్నంటి నిలిచి వారి ఆశయ సాధన కోసం చివరి వరకు పనిచేసిన సాంబశివరాజు లేని లోటు పార్టీకి తీర్చలేనిదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment