సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న మందులతో దుష్ప్రభావాలు లేవని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్‌ఏఎస్), ఇతర సంస్థలు ఇచ్చిన నివేదికల మేరకు ఈ మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆనందయ్య ఇస్తున్న 5 రకాల మందుల్లో 3 రకాలకు అనుమతి ఇచ్చింది. కంట్లో వేసే డ్రాప్స్‌కు సంబంధించి నివేదికలు రావాల్సి ఉంది. మరో మందు తయారీ అధికారుల ముందు చూపించనందున అనుమతి ఇవ్వలేదు. ఆనందయ్య మందుపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా సీసీఆర్‌ఏఎస్ సహా పలు సంస్థలు ఇచ్చిన నివేదికల్లోని అంశాలను ఆయుష్ కమిషనర్ వి.రాములు, ఇతర అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నివేదికల ఆధారంగా ఈ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది.
పి, ఎల్, ఎఫ్ మందులకు అనుమతి
ఆనందయ్య మందు వాడితే కోవిడ్ తగ్గిందనడానికి నిర్ధారణలు లేవని, ఈ మందులో వాడే పదార్థాలు హానికరం కాదని ఈ నివేదికల్లో తేలిందని అధికారులు వివరించారు. దీన్ని ఆయుర్వేద మందుగా గుర్తించడానికి లేదని తెలిపారు. ఆనందయ్య 5 (పి, ఎల్, ఎఫ్, కె, ఐ) రకాల మందులు తయారు చేస్తున్నారు. వీటిలో ముడిపదార్థాలు లేనందున కె మందు తయారీని అధికారులకు చూపించలేదు. మిగిలిన 4 రకాల మందుల తయారీ చూపించారు. కంట్లో వేసే ఐ డ్రాప్స్ మందుకు సంబంధించి కొన్ని నివేదికలు రావాల్సి ఉంది. అందువల్ల దీనికి అనుమతించలేదు. కె మందు తయారీ చూపించనందున దానికి అనుమతి ఇవ్వలేదు. మిగిలిన పి, ఎల్, ఎఫ్ రకాల మందుల పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
కరోనాకు డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ.. ఎవరి ఇష్ట్రపకారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఆనందయ్య మందును వాడినంతమాత్రాన మిగిలిన మందులు ఆపవద్దని స్పష్టం చేసింది. ఆనందయ్య మందు తీసుకోవడానికి కోవిడ్ పాజిటివ్ వ్యక్తులు రాకుండా చూడాలని ఆదేశించింది. రోగులకు బదులు వారి సంబంధీకులు వచ్చి మందు తీసుకెళ్తే.. కోవిడ్ విస్తరించే ప్రమాదం తప్పుతుందని పేర్కొంది. మందు పంపిణీ సమయంలో తప్పనిసరిగా కోవిడ్ ప్రొటోకాల్ పాటించాలని స్పష్టం చేసింది. ఆనందయ్య దీన్ని ఆయర్వేద మందుగా గుర్తించాలని దరఖాస్తు చేస్తే చట్ట పరిధిలో పరిశీలిస్తామని అధికారులు తెలిపారు.
ఆనందయ్య మందుకు ప్రభుత్వం అనుమతి
Published Tue, Jun 1 2021 3:23 AM | Last Updated on Tue, Jun 1 2021 7:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment