ఏపీ: నేడు రీస్టార్ట్‌–2 ప్యాకేజీ విడుదల | CM YS Jagan Will release Restart 2 package | Sakshi
Sakshi News home page

ఏపీ: నేడు రీస్టార్ట్‌–2 ప్యాకేజీ విడుదల

Published Fri, Sep 3 2021 4:01 AM | Last Updated on Fri, Sep 3 2021 10:36 AM

CM YS Jagan Will release Restart 2 package - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో వరుసగా రెండో ఏడాది కూడా పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. కరోనా విపత్తు వల్ల రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా మూతపడకూడదన్న లక్ష్యంతో గత ఏడాది మే 22న దేశంలోనే తొలిసారిగా రీస్టార్ట్‌ ప్యాకేజీ పేరుతో రూ.1,100 కోట్ల ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌తో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిశ్రమలను ఆదుకునేందుకు ఈ ఏడాది కూడా ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్‌ మిల్లులకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను అందిస్తోంది.

శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా ఈ నిధులు విడుదల చేయనున్నారు. ఇందులో ఎంఎస్‌ఎంఈలకు రూ.440 కోట్లు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్‌ మిల్లులకు రూ.684 కోట్లు ఇవ్వనున్నారు. తద్వారా పారిశ్రామికాభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తూ రాష్ట్రంలో 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్‌ మిల్స్‌కు భరోసా కలగనుంది. పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహకాల్లో 62 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవే ఉన్నాయి. అదేవిధంగా ప్రోత్సాహకాలు అందుకున్న యూనిట్లలో 42 శాతం మహిళలు నిర్వహిస్తున్నారు.

గత ప్రభుత్వ బకాయిలు రూ.1,588 కోట్లు చెల్లింపు
గడచిన రెండేళ్లలో పరిశ్రమలకు రూ.2,086.42 కోట్ల విలువైన రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఇందులో రూ.1,588 కోట్లు గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలానికి సంబంధించిన బకాయిలే కావడం గమనార్హం. గత ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు రూ.904 కోట్లు, స్పిన్నింగ్‌ మిల్లులకు రూ.684 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను బకాయిపడింది. ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పటికీ గత ప్రభుత్వం పరిశ్రమలకు బకాయిలు చెల్లించలేదని, కానీ పరిశ్రమలకు ఇచ్చిన మాట ప్రకారం సకాలంలో ప్రోత్సాహకాలు విడుదల చేయాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత బకాయిలతో పాటు ప్రోత్సాహకాలను సకాలంలో చెల్లిస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. 


మౌలిక వసతులకు పెద్ద పీట
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తోందని మంత్రి మేకపాటి పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు నిర్వహణ వ్యయం తక్కువగా ఉండే విధంగా మూడు పారిశ్రామిక కారిడార్లలో మౌలికవసతులు అభివృద్ధి చేస్తున్నామని, అదే విధంగా ఇచ్చిన మాట ప్రకారం రాయితీలను కూడా సకాలంలో చెల్లించడం ద్వారా రాష్ట్రంపై పారిశ్రామికవేత్తల నమ్మకాన్ని పెంచుతున్నట్లు తెలిపారు.  దీనికి నిదర్శనమే ఈ రెండేళ్లలోనే 16,311 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు రాష్ట్రంలో రూ.5,204.09 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టాయని, వీటి ద్వారా 1,13,777 మందికి ఉపాధి లభిస్తోందన్నారు.


కొప్పర్తిలో రెండు భారీ పారిశ్రామిక పార్కులు
ఇదిలావుండగా.. రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా కొప్పర్తిలో వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ను 3,155 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇండస్ట్రియల్‌ హబ్‌లో విద్యుత్, నీరు, సీఈటీపీలు, ఎస్టీపీల వంటి అత్యున్నత మౌలిక సదుపాయాలతో బహుళ ఉత్పత్తి మెగా ఇండస్ట్రియల్‌ పార్క్‌గా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. తద్వారా 1.5 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని అధికారుల అంచనా. ఎలక్ట్రానిక్‌ పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.10 వేల కోట్ల పెట్టుబడిని ఆకర్షించడానికి కొప్పర్తిలో రూ.730.50 కోట్లతో 801 ఎకరాల్లో వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. తద్వారా మరో 30 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement