సేవలు సరిగా అందుతున్నాయా?  | AP Government Has Focused On Services In Government hospitals | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులపై ఏపీ ప్రభుత్వం దృష్టి 

Published Tue, Dec 22 2020 11:38 AM | Last Updated on Tue, Dec 22 2020 12:48 PM

AP Government Has Focused On Services In Government hospitals - Sakshi

సాక్షి, అమరావతి: గత ఏడాదిన్నరగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల స్థితిగతులు మార్చేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..తాజాగా ఆయా ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న సేవలపై దృష్టి కేంద్రీకరించింది.  రెండు మాసాల క్రితమే డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది నియామకాల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. మరోవైపు నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా వాటి రూపురేఖలు మార్చే పనులు మొదలయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రులన్నిటినీ ఐపీహెచ్‌ఎస్‌ (ఇండియన్‌ పబ్లిక్‌హెల్త్‌ స్టాండర్డ్‌ సర్వీసెస్‌) ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. జిల్లా ఆస్పత్రుల్లో భారీగా మౌలిక వసతులు సమకూర్చుతున్నారు. అయితే సిబ్బంది, సదుపాయాలు ఉంటే సరిపోదని, రోగులకు సంతృప్తి కలిగించే విధంగా సేవలు కూడా అందాలని ప్రభుత్వం భావించింది.

ఆస్పత్రుల్లో చికిత్స పొందిన రోగుల అభిప్రాయాలు సేకరించడం (ఫీడ్‌బ్యాక్‌) ద్వారా మరింత మెరుగైన సేవలందించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు రాజస్థాన్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ వైద్య కళాశాల, ఆస్పత్రిలో మినహా దేశంలో మరెక్కడా ఇలాంటి పద్ధతి లేదు. ఇప్పుడు మన రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆస్పత్రుల్లో అందించే సేవలపై రోగుల మనోగతాలకు పెద్దపీట వేస్తోంది. తొలిదశలో 28 ఏరియా ఆస్పత్రుల్లో, 13 జిల్లా ఆస్పత్రుల్లో ప్రతిరోజూ రోగుల అభిప్రాయాలను సేకరించి పోర్టల్‌కు అప్‌లోడ్‌ చేస్తున్నారు. వాటి ఆధారంగా ఆయా ఆస్పత్రుల్లో లోపాలపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించి సరిచేసేందుకు చర్యలు చేపడుతోంది.  

డిశ్చార్జి సమయంలో ఫోన్‌ 
ఆస్పత్రిలో  చేరేందుకు రోగి రాగానే సిబ్బంది అతని ఫోన్‌ నంబర్‌ తీసుకుని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కార్యాలయానికి పంపుతారు. రోజువారీ వైద్యం వివరాలు ప్రత్యేక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. రోగి కోలుకున్నాక డిశ్చార్జి అయ్యే సమయంలో ఆ సమాచారం కూడా వెబ్‌సైట్‌లో పెడతారు. అదే రోజు కమిషనర్‌ కార్యాలయ సిబ్బంది రోగికి ఫోన్‌ చేసి అభిప్రాయం తీసుకుంటారు. చికిత్స వివరాలు, అందిన సేవలు, పారిశుధ్యం ఎలా ఉందీ.. తదితర వివరాలు అడుగుతారు. 

 ఫిర్యాదుల మేరకు చర్యలు 
♦    రోగి ఏ విషయంలోనైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే దానికి ఎవరు బాధ్యులో నమోదు చేస్తారు. 
♦    మందులు లేదా మౌలిక వసతుల లోపమైతే దాన్ని కూడా నమోదు చేస్తారు. 
♦    నెలకు ఒకసారి వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు దీనిపై సమీక్ష నిర్వహిస్తారు. 
♦   మౌలిక వసతులు, మందుల కొరత ఉంటే తక్షణమే చర్యలు తీసుకుంటారు. 
♦    డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిపై ఫిర్యాదులుంటే విచారించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. 

 రోగిని అడిగే కొన్ని ప్రశ్నలు  
♦   ఆస్పత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయి? 
♦    ఏ విషయంలోనైనా మీకు ఇబ్బంది కలిగిందా? 
♦    మీ పట్ల డాక్టర్లు, నర్సుల ప్రవర్తన ఎలా ఉంది? 
♦    చికిత్సకు మీ నుంచి డబ్బులేమైనా తీసుకున్నారా? 
♦    ఆస్పత్రిలో పారిశుధ్యం ఎలా ఉంది?  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement