ప్రపంచానికి గుణపాఠం నేర్పిన మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ఔటేజ్
ఖర్చుల నియంత్రణకు క్లౌడ్ సర్విసులపై ఆధారపడుతున్న ఐటీ సంస్థలు
అజూర్ క్లౌడ్ సర్విస్‌లో అప్‌డేట్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయిన పలు సేవలు.. ఇప్పుడు ఇతర క్లౌడ్ సర్విసులపై కంపెనీల దృష్టి
మ్యాక్, లీనక్స్ వంటి సేవలపైనా దృష్టి పెట్టాలంటున్న నిపుణులు
సాక్షి, అమరావతి: ఒక్క ‘క్లౌడ్’నే నమ్ముకొంటే ఇంతే.. మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ప్రపంచానికి నేర్పిన గుణపాఠమిది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్లౌడ్ సర్వీసులు ఉన్నప్పటికీ, మైక్రోసాఫ్ట్ అజూర్ పైనే ఆధారపడిన సంస్థలన్నీ ఇప్పడు చిక్కుల్లో పడ్డాయి. ఐటీ, ఇతర రంగాలకు చెందిన సంస్థలు ఖర్చుల నియంత్రణ కోసం క్లౌడ్ సర్వీసులపై ఆధారపడుతుంటే ఇప్పుడు వాటి ఉనికే ప్రశ్నార్థకం అవుతోంది.
తాజాగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన క్లౌడ్ సర్వీసెస్ ‘అజూర్’ సంక్షోభంతో ఐటీ కంపెనీలు వాటి విధానంపై పునరాలోచనలో పడ్డాయి. అజూర్ సైబర్ సెక్యూరిటీలో ఒక అప్‌డేట్ సందర్భంగా తలెత్తిన సమస్యతో ప్రపంచవ్యాప్తంగా విమాన, బ్యాంకింగ్, స్టాక్ ఎక్సే్ఛంజ్, వైద్యం వంటి పలు రంగాల్లో సేవలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఐటీ కంపెనీలు దీనిపైనే దృష్టి పెట్టాయి. డేటా బ్యాకప్ కోసం క్లౌడ్ సర్వీసులపై ఆధారపడితే వాటిల్లో అజూర్ లాగా సమస్య తలెత్తితే సాధారణ సేవలకు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారిస్తున్నాయి.
ఒక క్లౌడ్‌పైనే ఆధారపడొద్దు
ఐటీ కంపెనీలు డేటా బ్యాకప్ కోసం కేవలం ఒక క్లౌడ్ సర్వీసుపైనే ఆధారపడకుండా అత్యవసర సమయాల కోసం మరో క్లౌడ్ సర్వీసు కూడా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అజూర్ కాకుండా పదికి పైగా ప్రముఖ క్లౌడ్ సర్వీసు సంస్థలు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్ ఫ్లాట్‌ఫాంలతో పాటు ఐబీఎం, ఒరాకిల్, ఆలీబాబా, డిజిటల్ ఓషన్, వీఎంవేర్, రెడ్‌హాట్ వంటి అనేక క్లౌడ్ సర్వీసులు ఉన్నాయి.
తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అత్యంత చౌకగా క్లౌడ్ సర్వీసులు అందించే కోర్వేవ్ వంటి సంస్థలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇదే సమయంలో ఐటీ సంస్థలు కేవలం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఒక ఐటీ వెండర్‌పైనే ఆధారపడకుండా ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్‌పైనా సేవలంగించడానికి సిద్ధంగా ఉండాలని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ప్రొఫెసర్ ఓకు ఇస్క్ చెబుతున్నారు.
మైక్రోసాఫ్ట్‌తో పాటు మ్యాక్, లీనక్స్ వంటి ఐటీ వెండర్స్‌నూ వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణబమైన మైక్రోసాఫ్ట్‌కు సైబర్ సెక్యూరిటీ అందిస్తున్న క్రౌడ్‌స్ట్రైక్ చేసిన ప్రకటన దీనికి ఊతమిస్తోంది. సెబర్ సెక్యూరిటీలో అప్‌గ్రెడేషన్ సందర్భంగా తలెత్తిన సంక్షోభం కేవలం విండోస్‌కే పరిమితమైందని ఆ ప్రకటన తెలిపింది. మ్యాక్, లీనక్స్ వంటి వాటిపై ఈ ప్రభావం లేదని క్రౌడ్‌స్ట్రైక్ పేర్కొంది. అందువల్ల ఐటీ, ఇతర సంస్థలు ప్రత్యామ్నాయాలనూ అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.
తప్పించుకున్న రష్యా
మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రెడేషన్‌లో తలెత్తిన సమస్యలతో ప్రపంచవ్యాప్తాంగా అనేక దేశాల్లో పలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. రష్యాలో మాత్రం ఆ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. దీనికి ప్రధాన కారణం ఇతర దేశాలపై రష్యా దాడులు. ఈ యుద్ధం కారణంగా అమెరికాకు చెందిన పలు సంస్థలు రష్యాకు తమ ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించాయి. అందుకే మైక్రోసాఫ్ట్ సంస్థ కొన్ని సంవత్సరాలు రష్యాకు ఎటువంటి సహకారం అందించలేదు.
ఈ సంక్షోభానికి కారణమైన అమెరికాకు చెందిన క్రౌడ్ స్ట్రైక్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇంత వరకు రష్యాలో అడుగే పెట్టలేదు. దీంతో రష్యా సొంత సాఫ్ట్‌వేర్ పైనే ఆధారపడుతోంది. కాస్పర్స్క్రై వంటి స్వదేశానికి చెందిన సెబర్ సెక్యూరిటీ సేవలనే వినియోగించుకుంటోంది. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రెడేషన్‌తో తలెత్తిన సంక్షోభం తమ దేశంలో ఎక్కడా కనిపించలేదని రష్యా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment