
సాక్షి, అమరావతి: సర్వే ఉద్యోగుల దశాబ్దాల కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని వారి జీవితాల్లో వెలుగులు నింపింది. సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖను దశాబ్దాల తర్వాత పునర్వ్యస్థీకరించింది. అందుకనుగుణంగా రాష్ట్రంలోని 101 మంది మండల సర్వేయర్లకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేగా పదోన్నతులు కల్పిస్తూ ఆ శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్ ఉత్తర్వులిచ్చారు. నిజానికి.. సర్వే శాఖలో సర్వేయర్‌గా చేరితే మళ్లీ సర్వేయరుగానే పదవీ విరమణ చేయాలి.
ఆ శాఖ ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటివరకు పదోన్నతులు లేకపోవడమే ఇందుకు కారణం. 1971లో సర్వే శాఖ పునర్వ్యవస్థీకరణ జరిగింది. భూరికార్డుల నిర్వహణ, సరిహద్దు తగాదాల పరిష్కారం, భూసేకరణ కోసం తహసీల్దార్ కార్యాలయాలకు ఒక సర్వేయర్ చొప్పున కేటాయించారు. అప్పటినుండి భూ యాజమానుల అవసరాలు, ప్రభుత్వ భూ పంపిణీ, ప్రాజెక్టులకు భూసేకరణ, ఇళ్ల పట్టాల సర్వే, పారిశ్రామికీకరణకు భూముల సర్వే, రోడ్ల అభివృద్ధి వంటి అన్ని కార్యక్రమాలు ఎన్నో రెట్లు పెరిగినా సర్వేయర్ల సంఖ్య మాత్రం పెరగలేదు.
కనీసం 2 వేల మంది సర్వేయర్లను అదనంగా ఇవ్వాలని గత ప్రభుత్వాలను ఎన్నోసార్లు ఆ శాఖ ఉద్యోగులు కోరినా ఎవరూ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అడగకుండానే సర్వే అవసరాలు, రీ సర్వే కోసం కొత్తగా 11,118 గ్రామ సర్వేయర్ పోస్టులు సృష్టించి నియమించారు. సర్వే శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 410 కొత్త ఉద్యోగాలు మంజూరు చేశారు. దీనివల్ల 410 కొత్త ఉద్యోగాలే కాకుండా వివిధ స్థాయిల్లో 620 మందికి పదోన్నతి లభించనుంది. ఆ విధంగా ఎన్నో దశాబ్దాల సర్వే ఉద్యోగుల కల నెరవేరింది.101 మంది సర్వేయర్లకు తాజాగా పదోన్నతులు ఇచ్చారు. మిగిలిన కేడర్ల వారికీ త్వరలో ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment