సాక్షి, అమరావతి: విశాఖపట్నం, రుషికొండ రిసార్ట్ పునరుద్ధరణ ప్రాజెక్ట్ అమల్లో భాగంగా చేపడుతున్న నిర్మాణాలకు సంబంధించి పూర్తి వాస్తవాలను కోర్టు ముందుంచుతామని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, ఇందుకు కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ హైకోర్టును అభ్యర్థించారు.
ఇందుకు అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజుల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం జిల్లా, యందాడ గ్రామంలోని సర్వే నంబర్ 19 పరిధిలోని కోస్టల్ రెగ్యులేషన్ జోన్‌లో చెట్ల నరికివేత, భూమి తవ్వకాలకు అధికారులు అనుమతులు ఇవ్వడం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ (ఎంఓఈఎఫ్) అనుమతులకు, విశాఖపట్నం పట్టణ ప్రాంతాభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధమంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గతేడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఇదే అంశంపై విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కూడా పిల్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కేఎస్ మూర్తి, న్యాయమూర్తి ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ.. కొన్ని ఫొటోలను ధర్మాసనం ముందుంచారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ జోక్యం చేసుకుంటూ, పిటిషనర్లు కోర్టు ముందుంచిన ఫొటోలు పాతవన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం లేదన్నారు.
ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో వాస్తవాలను తేల్చేందుకు అడ్వొకేట్ కమిషన్‌ను నియమిస్తామని ప్రతిపాదించింది. కౌంటర్ ద్వారా వాస్తవాలను కోర్టు ముందుంచుతామని, ఇందుకు కొంత సమయం ఇవ్వాలని సుమన్ ధర్మాసనాన్ని కోరారు. కౌంటర్‌ను పరిశీలించిన తరువాత అడ్వొకేట్ కమిషన్ నియామకంపై నిర్ణయం తీసుకోవచ్చునన్నారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.
వాస్తవాలను కోర్టు ముందుంచుతాం
Published Wed, Jul 6 2022 5:31 AM | Last Updated on Wed, Jul 6 2022 5:31 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment