సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ సాగుతోంది. ప్రభుత్వాస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రులతో పాటు గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో వ్యాక్సిన్ వేస్తున్నారు. ఏప్రిల్ 6 నాటికి రాష్ట్రంలో 32,70,456 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. సగటున ఒక్కో కేంద్రంలో 39.04 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు గురువారం ముగియడంతో వ్యాక్సిన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా.. కేంద్ర ప్రభుత్వానికి మరో కోటి డోసుల వ్యాక్సిన్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోరింది.
60 ఏళ్లు దాటిన వారిలో 11.71 లక్షల మందికి..
కోవిడ్ ప్రమాదం ప్రభావం ఎక్కువగా ఉండే 60 ఏళ్ల వయసు దాటిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి వ్యాక్సిన్ వేస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వారు మొత్తం 51.02 లక్షల మంది ఉండగా.. ఈనెల 6వ తేదీ నాటికి 11,71,293 మందికి వ్యాక్సిన్ పూర్తయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1.19 లక్షల మంది వృద్ధులు తొలి డోసు తీసుకున్నారు. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 49,345 మంది మాత్రమే వేయించుకున్నారు. కాగా, ఇప్పటివరకూ రెండో డోసు వేయించుకున్న వారు 18,333 మంది ఉన్నారు.
అత్యధికంగా ‘తూర్పు’లో..
ఇప్పటివరకూ మొత్తం 13 జిల్లాల్లో 32.70 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేయగా, ఇందులో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 3,26,829 మందికి వేశారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 1,39,408 మందికి వేశారు. చిత్తూరు, విశాఖ జిల్లాల్లో సైతం వ్యాక్సిన్ వేయించుకున్న వారి సంఖ్య 3 లక్షలు దాటింది.
45 దాటిన వారిలో 7.83 లక్షల మందికి..
అలాగే, 45 ఏళ్లు దాటి 60 ఏళ్లలోపు ఉన్న వారిలో ఇప్పటివరకూ 7,83,947 మంది తొలిడోసు వేయించుకున్నారు. వీరు మొత్తం 82.05 లక్షల మంది ఉన్నట్లు అంచనా. ఈ కేటగిరీ కింద అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 80,344 మంది టీకా వేయించుకున్నారు. విజయనగరం జిల్లాలో కేవలం 29,019 మంది మాత్రమే వేయించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment