సాక్షి, అమరావతి: మూడున్నరేళ్లుగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన విద్యారంగ సంస్కరణలు, అత్యుత్తమ బోధనా విధానాలు, శిక్షణా కార్యక్రమాలు, నాడు – నేడు ద్వారా పాఠశాలలను మౌలిక వసతులతో తీర్చిదిద్దడం సత్ఫలితాలనిస్తున్నట్లు మరోసారి తేటతెల్లమైంది. జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక తదితర ప్రోత్సాహాలతో ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున విద్యార్థుల చేరికలు పెరగగా అందుకు తగ్గట్లుగా ఉపాధ్యాయులను సమకూర్చడంతో నాణ్యమైన బోధన అందుతోంది.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి (పీపుల్, టీచర్ రేషియో)లో ఆంధ్రప్రదేశ్ మెరుగైన స్థితిలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇతర పెద్ద రాష్ట్రాల కన్నా ఏపీలో పరిస్థితి ఎంతో బాగున్నట్లు కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈమేరకు కేంద్ర విద్యా శాఖ ఈనెల 13వతేదీన పార్లమెంట్‌కు లిఖిత పూర్వకంగా తెలియచేసింది. రాష్ట్రాలవారీగా పీపుల్, టీచర్ రేషియో వివరాలను వెల్లడించాలని యూపీకి చెందిన బీజేపీ ఎంపీ అజయ్‌నిషాద్ కోరగా లోక్‌సభకు వివరాలను సమర్పించింది.
►2021–22 గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు – ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రైమరీ స్కూళ్లలో 24 : 1గా, అప్పర్ ప్రైమరీలో 17 : 1 చొప్పున ఉంది. అంటే ప్రైమరీ తరగతుల్లో 24 మంది విద్యార్ధులకు ఒకరు చొప్పున ఉపాధ్యాయుడు ఉండగా అప్పర్ ప్రైమరీలో 17 మంది విద్యార్ధులకు ఒకరు చొప్పున టీచర్ ఉన్నారు.
►పాఠశాల విద్యకు ఆయువు పట్టు లాంటి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్ధులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని జాతీయ విద్యాహక్కు చట్టం 2009లో స్పష్టంగా నిర్దేశించారు. ఈ చట్టం ప్రకారం పీపుల్, టీచర్ రేషియో ప్రైమరీలో 30 మంది విద్యార్ధులకు ఒక టీచర్ (30 : 1) ఉండాలి. అప్పర్ ప్రైమరీలో 35 మంది విద్యార్ధులకు ఒక టీచర్ (35 : 1) ప్రకారం ఉండాలని పేర్కొన్నారు. అయితే ఏపీలో అంతకంటే మెరుగ్గా టీచర్లు అందుబాటులో ఉండటం గమనార్హం.
►ఏపీలో పీపుల్, టీచర్ రేషియో జాతీయ సగటుకన్నా మెరుగ్గా ఉన్నట్లు కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యార్ధులు – ఉపాధ్యాయుల నిష్పత్తి జాతీయ స్థాయిలో ప్రైమరీలో 28 : 1 కాగా అప్పర్ ప్రైమరీలో 24 : 1 చొప్పున ఉంది.
పెద్ద రాష్ట్రాల కంటే మెరుగ్గా..
దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ ప్రమాణాలతో విద్యా బోధన జరుగుతున్నట్లు కేంద్రం విడుదల చేసిన సమాచారాన్ని విశ్లేషిస్తే స్పష్టమవుతోంది. దశాబ్దాలుగా విద్యారంగంలో అగ్రస్థానంలో కొనసాగిన కేరళ, తమిళనాడు, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల కంటే ఏపీలో టీచర్ల నిష్పత్తి మెరుగైన స్థితిలో ఉన్నట్లు వెల్లడవుతోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం అప్పర్ ప్రైమరీలో 35 : 1 నిష్పత్తిలో పీపుల్, టీచర్ రేషియో ఉండాలి. ఏపీలో అంతకంటే మెరుగ్గా 17 మంది విద్యార్ధులకు ఒకరు చొప్పున ప్రభుత్వం టీచర్లను నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment