సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ లభించింది. రూ.లక్ష పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయనకు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది .
స్కిల్ స్కాం కేసులో.. అదీ ఆరోగ్య కారణాల దృష్ట్యా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఈ క్రమంలో పలు షరతులు విధించింది. ‘‘చంద్రబాబు మీడియా, ఏ విధమైన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. కేవలం ఆస్పత్రి మినహా మరేయితర కార్యక్రమాల్లో పాల్గొనరాదు. బెయిల్ గడువు ముగిశాక నవంబర్ 28వ తేదీ సాయంత్రం లొంగిపోవాలి. చంద్రబాబు ఈ కేసును ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదు. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ మరుక్షణమే రద్దు అవుతుంది’’అని తీర్పు కాపీలో జస్టిస్ మల్లికార్జున రావు స్పష్టం చేశారు.
అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేవలం స్కిల్ స్కామ్ కేసులో.. అదీ కంటి సర్జరీ కోసం మాత్రమే చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ మంజూరు అయినట్లు తెలుస్తోంది. అలాగే నవంబర్ 10న ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటామని కోర్టు తెలిపింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో నేటికి రిమాండ్ ఖైదీగా 52 రోజులు పూర్తి చేసుకున్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment