సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఆయా పత్రికల్లో ఇచ్చే ప్రకటనల్లో గత ప్రభుత్వంతో పోల్చుకోవడం తప్పెలా అవుతుందని హైకోర్టు బుధవారం పిటిషనర్‌ను ప్రశ్నించింది. గత ప్రభుత్వం కంటే తాము బాగా చేస్తున్నామని ప్రస్తుత ప్రభుత్వం చెప్పుకోకూడదా? అంటూ నిలదీసింది. అలా చెప్పుకోవడం తప్పెలా అవుతుందంది. ప్రభుత్వాలు తమ పనితనం గురించి వివరించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించింది. గత ప్రభుత్వంతో పోల్చుకోవడాన్ని తామెలా నిరోధించగలమని నిలదీసింది. అలాగే ప్రభుత్వ ప్రకటనల్లో లభ్దిదారుల చిత్రాలు, వారి అభిప్రాయాలు ఉండటం కూడా తప్పెలా అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది.
రాష్ట్ర ప్రభుత్వం తన ప్రకటనల్లో గత ప్రభుత్వం అన్నదే తప్ప, ఫలానా రాజకీయ పార్టీ అని పేర్కొనలేదని గుర్తు చేసింది. గత ప్రభుత్వం అని అనే దానికి, రాజకీయ పార్టీ అని అనే దానికి తేడా ఉందని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ స్పందనను తెలుసుకోవాలని భావిస్తున్నామని పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ మేరకు ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులతో పాటు వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉన్న సీఎం వైఎస్ జగన్‌కు, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, వైఎస్సార్సీపీ, సీబీఐ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 6కి వాయిదా వేసింది. ఈ లోపు జారీ చేసే ప్రకటనల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
చంద్రబాబును విమర్శిస్తున్నారు.. అడ్డుకోండి
రాష్ట్ర ప్రభుత్వం ఆయా పత్రికల్లో ఇచ్చే ప్రకటనల్లో గత ప్రభుత్వం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శిస్తోందని.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ బాపట్ల జిల్లాకు చెందిన చెన్నుపాటి సింగయ్య హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేరు మీద కాకుండా సీఎం వైఎస్ జగన్ పేరుతో పత్రికల్లో ప్రకటనలు వస్తున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమన్నారు.
ప్రభుత్వం ప్రకటనల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు నడుచుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ప్రకటనల ద్వారా ప్రజాధనాన్ని వృథా చేసిందని.. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని అభ్యర్ధించారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ సింగయ్య తరఫు న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ప్రకటనల్లో ప్రతిపక్షాలను విమర్శించడానికి వీల్లేదన్నారు.
గత ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ప్రస్తుత ప్రభుత్వం ప్రకటనలు ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని గొప్పగా చూపేలా ఈ ప్రకటనలు ఉంటున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలంటూ పోల్చిచూడటానికి వీల్లేదని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ పిటిషనర్‌కు పలు ప్రశ్నలు సంధించింది. ‘ఓ పథకానికి అప్పుడు ఇంత ఇచ్చేవారు.. మేం ఇప్పుడు ఇంత ఇస్తున్నాం’ అని చెప్పుకోవడం ఎలా తప్పు అవుతుందని నిలదీసింది.
పిటిషనర్ దురుద్దేశాన్ని చూడండి
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రకటనలనే పిటిషనర్ సవాల్ చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ప్రకటనల గురించి కనీసం ప్రస్తావించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్నిబట్టి ఈ వ్యాజ్యం దాఖలు వెనుక పిటిషనర్‌కున్న దురుద్దేశాలను సులువుగా అర్థం చేసుకోవచ్చన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ప్రకటనలను కోర్టు ముందుంచుతామని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment