AP: ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన | AP To Introduce Digital Teaching In Every Classroom: CM YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

AP: ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన

Published Sat, Jul 23 2022 3:56 AM | Last Updated on Sat, Jul 23 2022 7:58 AM

AP To Introduce Digital Teaching In Every Classroom: CM YS Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, అమరావతి: ఆధునిక బోధన విధానాలను అనుసరిస్తూ విద్యార్థులకు అత్యుత్తమ రీతిలో అత్యున్నత పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ విద్యా బోధనకు శ్రీకారం చుడుతున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన పరికరాలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విద్యా శాఖపై  అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు సబ్జెక్టులు మరింత నిశితంగా అర్థం అయ్యేలా బోధించేందుకు ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లే లేదా ప్రొజెక్టర్లు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అధికారులు చూపించిన ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లేలు, ప్రొజెక్టర్స్‌ పనితీరు, నాణ్యత, మోడల్స్‌ను పరిశీలించారు. వాటి వివరాలు, ఇతర అంశాలపై ఆరా తీశారు.

నాణ్యమైన డిజిటల్‌ పరికరాల ఏర్పాటుకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రొజెక్టర్‌లు, ఇంటరాక్టివ్‌ టీవీల నాణ్యతలో ఎక్కడా రాజీ పడరాదని స్పష్టం చేశారు. స్మార్ట్‌ బోధన సదుపాయాల వల్ల ఇటు పిల్లలకు, అటు ఉపాధ్యాయులకు మేలు జరుగుతుందన్నారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..

ట్యాబ్‌లు నాణ్యతతో ఉండాలి 
ఈ విద్యా సంవత్సరం సెప్టెంబర్‌లో 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్‌లు నాణ్యంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ట్యాబ్‌ల్లోకి ప్రఖ్యాత ఆన్‌లైన్‌ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ కంటెంట్‌ను అప్‌లోడ్‌ చేస్తుంది. దీని ద్వారా విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి రానుంది.

విద్యార్థుల చదువులకు అవసరమైన వస్తువులతో అమలు చేస్తున్న విద్యా కానుకకు సంబంధించి వచ్చే ఏడాదికి పంపిణీ కోసం తీసుకోవలసిన చర్యలపై ఇప్పటి నుంచే ప్రణాళికా బద్ధంగా సన్నద్ధం కావాలి.

ప్రతి స్థాయిలో పర్యవేక్షణ ముఖ్యం
రెండో దశ నాడు – నేడు పనులను వేగవంతం చేయాలి. స్కూళ్లలో విలువైన ఉపకరణాలను ఏర్పాటు చేస్తున్నందున భద్రత దృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలి. స్కూళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు గురించి ఆలోచించాలి.

సస్టయినబుల్‌ డెవలప్‌మెంటు గోల్‌ (ఎస్‌డీజీ) లక్ష్యాలను చేరుకునే ప్రక్రియలో భాగంగా విద్యా వ్యవస్థలో చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన డేటా నిరంతరం అప్‌లోడ్‌ అయ్యేలా చూడాలి. దీనికి సంబంధించి ఎస్‌ఓపీలను రూపొందించాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్లు కూడా సమీక్ష చేయాలి. 

టాయిలెట్స్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌ (టీఎంఎఫ్‌), స్కూల్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌ (ఎస్‌ఎంఎఫ్‌)లను సమర్థవంతంగా వినియోగించుకుని స్కూళ్ల నిర్వహణను పటిష్టం చేయాలి. విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినందున, ప్రతి స్థాయిలో పర్యవేక్షణ బలంగా ఉండాలి. ఇందు కోసం విద్యా శాఖలో డీఈఓ, ఎంఈఓ సహా వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ బాధ్యతలున్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.

ఎస్‌సీఈఆర్టీ, డైట్‌ సీనియర్‌ లెక్చరర్స్, డైట్‌ లెక్చరర్స్‌ పోస్టుల భర్తీపైనా దృష్టి పెట్టాలి. హాస్టళ్లలో కూడా నాడు – నేడు రెండో దశ కింద పనులు చేపట్టాలి. 

సీఎం గతంలో ఇచ్చిన వివిధ ఆదేశాల అమలు ప్రగతిని, నాడు – నేడు రెండో దశ కింద 22,344 స్కూళ్లలో చేపడుతున్న పనుల ప్రగతిని అధికారులు ఈ సమీక్షలో ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యా శాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, విద్యా శాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, పాఠశాల విద్యా శాఖ సలహాదారు ఎ మురళీ, ఏపీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ కార్యదర్శి సాంబశివారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

పీపీ–1 నుంచే..
రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్న పూర్వ ప్రాథమిక విద్యా తరగతుల నుంచే డిజిటల్‌ బోధనపై అధికారులు ఆలోచించాలి. పీపీ–1 (ప్రీ ప్రైమరీ–1) నుంచి రెండో తరగతి వరకు స్మార్ట్‌ టీవీలు, 3వ తరగతి.. ఆపైన తరగతులకు ప్రొజెక్టర్‌లు పెట్టేలా ప్రణాళికలు రూపొందించాలి.

నాడు – నేడు పూర్తి చేసుకున్న అన్ని హైస్కూళ్లలో మొదటి దశ కింద ఈ డిజిటల్‌ పరికరాలను ఏర్పాటు చేయాలి. వచ్చే వారం నాటికి దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement