బీసీల పట్ల సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరోసారి అభిమానం చాటుకున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌కు కేబినెట్‌లో చోటు కల్పించి బీసీల అభ్యున్నతి, స్త్రీ సంక్షేమం పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. బీసీ వర్గానికి చెందిన మహిళ ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిథ్యం వహించడం ఇదే తొలిసారి. దీన్ని బట్టి బీసీ వర్గాలకు ముఖ్యమంత్రి ఎంతటి ప్రాధాన్యతనిచ్చారో తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
సాక్షి , అనంతపురం: బీసీ కురుబ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ ఉన్నత విద్యావంతురాలిగా పేరుగడించారు. లైఫ్ సైన్సెస్‌లో బీఎస్సీ, ఎన్విరాన్‌మెంటల్ విభాగంలో ఎమ్మెస్సీ చదివిన ఆమె 2012లో సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2014లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ చేరారు. తర్వాత కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారు. నియోజకవర్గంలోని ప్రతి గడపకూ మూడు సార్లు తిరిగి ప్రత్యక్షంగా ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఐదేళ్లు పార్టీ అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఆమె కృషిని గుర్తించిన అధిష్టానం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దించింది. ప్రచారంలో రెట్టించిన ఉత్సాహంతో కదిలిన ఆమె సమీప ప్రత్యర్థి టీడీపీకి చెందిన మాదినేని ఉమా మహేశ్వర నాయుడిని 19,896 ఓట్ల తేడాతో ఓడించారు.
అసెంబ్లీలో గళం..
ఎమ్మెల్యేగా గెలిచాక తనదైన శైలిలో దూసుకెళ్తూ ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ కళ్యాణదుర్గం ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఎమ్మెల్యే గెలుపొందిన వెంటనే ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం అన్ని గ్రామాల్లో తిరిగి ప్రజలకు దగ్గరయ్యారు. ఇక.. నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో పలు పర్యాయాలు గళమెత్తి పరిష్కారానికి కృషి చేశారు. తొలిసారి ఎమ్మెల్యే అయినా అసెంబ్లీలో తన మాటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించారు. కళ్యాణదుర్గానికి ఆయువుపట్టుగా ఉన్న బీటీ ప్రాజెక్టుకు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి సాగునీరు తీసుకువచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇవన్నీ గుర్తించిన అధిష్టానం ఉషశ్రీచరణ్‌కు మంత్రి పదవి కట్టబెట్టింది. బీసీ మహిళకు సముచిత స్థానం కల్పించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బిజీబిజీగా ఉన్నా.. ఉన్నత విద్యపై ఆసక్తి..
ప్రజాప్రతినిధిగా ప్రజల మధ్య తీరిక లేని సమయం గడుపుతున్నా.. ఉన్నత చదువు చదివేందుకు ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ దరఖాస్తు చేసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ కోటాలో పీహెచ్‌డీ చేరే అవకాశం ఉండడంతో 3 నెలల క్రితం దరఖాస్తు చేశారు. గత నెలలో ఎస్కేయూ పాలకమండలి ఆమె పీహెచ్‌డీ దరఖాస్తుకు ఆమోదం తెలిపింది. త్వరలో అడ్మిషన్ కల్పించనున్నారు. ఫిజిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామ్‌గోపాల్ పర్యవేక్షణలో ఉషశ్రీచరణ్ పరిశోధన చేయనున్నారు.
ఉమ్మడి జిల్లా నుంచి తొలి బీసీ మహిళ..
ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి గతంలో ముగ్గురు మహిళలు మంత్రులుగా ప్రాతినిథ్యం వహించారు. కానీ ఇప్పటివరకూ బీసీ వర్గానికి చెందిన మహిళలు ఎవరూ మంత్రులు కాలేదు. కానీ ఉషశ్రీ చరణ్‌కు ఆ అవకాశం దక్కింది. గతంలో లక్ష్మిదేవమ్మ, శమంతకమణి, పరిటాల సునీత ఈ జిల్లానుంచి మంత్రులుగా వ్యవహరించారు. వారి తర్వాత మంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఉషశ్రీ చరణ్ నాల్గవ మహిళ. సోమవారం ఉదయం ఆమె మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక.. ఇప్పటివరకూ ఎవరికి మంత్రి పదవులు వరిస్తాయో అని ఎదురు చూసిన జిల్లా వాసులు.. ఇప్పుడు ఉషశ్రీచరణ్‌కు ఏ శాఖ దక్కుతుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
చదవండి: (ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రి వర్గ జాబితా.. పూర్తి వివరాలు..)
వైఎస్సార్ సీపీ శ్రేణుల సంబరాలు..
ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌కు మంత్రి పదవి దక్కడంతో అటు పార్టీ శ్రేణులు, ఇటు కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ఎమ్మెల్యే మంత్రి కానుండడంతో కళ్యాణదుర్గంలో సంబరాలు మిన్నంటాయి. టపాసులు పేల్చుతూ, స్వీట్లు పంచుకుంటూ నాయకులు, కార్యకర్తలు ఆనందం పంచుకున్నారు.
పూర్వజన్మ సుకృతం
రాజకీయాల్లోకి రావడం, ఎమ్మెల్యేగా గెలవడం, మంత్రి కావడం నిజంగా పూర్వ జన్మ సుకృతం. ఇది ముమ్మాటికీ నాకు జగనన్న ఇచ్చిన వరం. ఈ వరం వల్లే నేను ఇంతదాకా వచ్చా. గతంలో చంద్రబాబు బీసీలతో ఓట్లేయించుకుని వారిని ఓటుబ్యాంకుగానే చూశారు. ఏనాడూ బీసీ వర్గాలకు చెందిన మహిళను మంత్రిని చేయాలని చూడలేదు. నాకు ఏ శాఖ కేటాయించినా బాధ్యతగా, ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా నిర్వహిస్తా. అందరినీ కలుపుకుని ఈ ప్రభుత్వానికి, జగనన్నకు కీర్తి తెస్తా. – ఉషశ్రీ చరణ్
ఉషశ్రీ చరణ్ బయోడేటా
పూర్తి పేరు: కురబ విరుపాక్షప్ప గారి ఉషశ్రీ చరణ్ (కేవీ ఉషశ్రీచరణ్)
పుట్టిన తేదీ: 16–07–1976
తల్లిదండ్రులు : కేవీ రత్నమ్మ, డాక్టర్ కురుబ విరుపాక్షప్ప
పుట్టిన స్థలం: రాయదుర్గం
భర్త పేరు: శ్రీ చరణ్ రెడ్డి
పిల్లలు: కుమార్తె జయనా శ్రీచరణ్, కుమారుడు దివిజిత్ శ్రీచరణ్
విద్యార్హత : బీఎస్సీ (లైఫ్ సైన్సెస్), ఎంఎస్సీ (ఎన్విరాన్‌మెంటల్ సైన్స్).
ఎస్కేయూలో అట్మాస్పియరిక్ సైన్స్ అండ్ గ్లోబల్ వార్మింగ్‌పై పీహెచ్‌డీ చేయనున్నారు.
చదవండి: (నూతన మంత్రివర్గంలో చోటుదక్కించుకున్న అమరనాథ్ ఫ్రొఫైల్ ఇదే..)
Comments
Please login to add a commentAdd a comment