సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని అప్పికొండ బీచ్‌లో ఓ యువతి రాళ్ల మధ్య చిక్కుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రాళ్ల మధ్య అపస్మారక స్థితిలో సదరు యువతి మృత్యువుతో పోరాడింది. అదృష్టవశాత్తు యువతిని స్థానికులు గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, సదరు యువతి.. మరో యువకుడితో కలిసి బీచ్‌కు వెళ్లడం గమనార్హం.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన కావ్య.. వర్మ రాజుతో కలిసి ఈ నెల 2 నుంచి అప్పికొండ శివాలయ పరిసరాల్లో ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం తీరం దగ్గరలో ఉన్న రాళ్ల గుట్టలపై ఆమె ఫొటో తీసుకుంటున్న క్రమంలో కిందపడిపోయింది. ఎత్తైన ప్రదేశం నుంచి జారి పడిపోయింది. ఈ క్రమంలో కావ్య.. అపస్మారక స్థితికి చేరుకోవడంతో వర్మ రాజు అక్కడి నుంచి పారిపోయడు. అప్పటికే రాత్రి కావడంతో కావ్య రాళ్ల మధ్యలో నుంచి కేకలు వేసింది.
వర్మ రాజు ఎక్కడ..
బీచ్‌లో రాత్రివేళ జన సంచారం లేకపోవడంతో అలాగే రాత్రంతా మృత్యువుతో పోరాడింది. సోమవారం ఉదయం బీచ్‌కు వచ్చిన కొందరు జాలర్లు యువతిని చూడగా.. అక్కడే ఉన్న గజ ఈతగాళ్ల సహాయంతో అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు. యువతి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. చికిత్స నిమిత్తం 108 వాహనంలో కావ్యను కేజీహెచ్‌కు తరలించారు. ఈ సందర్బంగా తాను కాలుజారి రాళ్ల మధ్య పడిపోయానని.. వర్మ రాజును ఏమీ అనవద్దని ఆమె పోలీసులు కోరడం విశేషం. ఇక పరారీలో ఉన్న వర్మరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అంబులెన్సు సిబ్బంది యువతి తల్లికి సమాచారమివ్వగా.. వారు విశాఖ బయలుదేరి వెళ్లారు.
ఇదిలా ఉంటే తమ కుమార్తె కనపడటంలేదని యువతి తల్లి మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేశారు.. ఇంతలో పీఎస్ నుంచి అంబులెన్స్ సిబ్బందికి సమాచారమిచ్చారు. దువ్వాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పరారీలో ఉన్న యువకుడికి ప్రమాదం జరిగిందని.. అతడు కూడా కేజీహెచ్‌లో ఉన్నట్లు సమాచారం. యువతి మిస్సింగ్ కేసు.. విశాఖకు వెళ్లడం ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment