సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. పేదలను టార్గెట్ చేస్తూ కొందరు కూటమి నేతలతో ఆదేశాలతో అధికారులు దౌర్జన్యాలకు దిగుతున్నారు. తాజాగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అన్యాయంగా పేదల ఇళ్లను కూల్చివేశారు. అర్ధరాత్రి పోలీసుల బందోబస్తు మధ్య ఇళ్ల కూల్చివేత జరిగింది. ఈ క్రమంలో అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేదల ఇళ్లపై కూటమి నేతల దౌర్జన్యం కొనసాగుతోంది. రేణిగుంట మండలం తూకివాకం గ్రామ పంచాయతీ పరిధిలోని గువ్వల కాలనీలో తాజాగా ఇళ్లను అధికారులు కూల్చివేశారు. కూటమి నేతల ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు, పోలీసులు ఇళ్లలోని వారిని బలవంతంగా ఖాళీ చేయించారు. అనంతరం, అర్థరాత్రి వేళ రేణిగుంట పోలీసుల బందోబస్తు మధ్య ఇళ్లను కూల్చివేశారు.
ఇదిలా ఉండగా, చెన్నై-తిరుపతి మూడవ లైన్ విస్తరణ పనుల్లో భాగంగా ఇల్లు కోల్పోతున్న వారికి ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వకుండానే కూల్చివేతలను ప్రారంభించారు. అర్థరాత్రి ఇల్లు కూల్చివేయడంతో గువ్వల కాలనీవాసులు ఆర్తనాదాలు చేశారు. గువ్వల కాలనీలో 52 కుటుంబాలను ఖాళీ చేయించి ఇంటి సామాన్లను పోలీసులు సహాయంతో అధికారులు బయట పడేశారు. దీంతో, వారి ఆవేదన తెలుసుకుంటున్న మీడియాను సైతం రేణిగుంట పోలీసులు అడ్డుకున్నారు. తమకు నష్ట పరిహారం ఇవ్వకుండా ఇల్లు కూల్చివేస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. తమను బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు పంపారని విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment