విద్యార్థుల తరలింపునకు ఏపీఎన్‌ఆర్టీఎస్‌ చర్యలు | APNRTS activities for student evacuation of Ukraine stuck ap students | Sakshi
Sakshi News home page

విద్యార్థుల తరలింపునకు ఏపీఎన్‌ఆర్టీఎస్‌ చర్యలు

Published Fri, Feb 25 2022 4:16 AM | Last Updated on Fri, Feb 25 2022 3:39 PM

APNRTS activities for student evacuation of Ukraine stuck ap students - Sakshi

సాక్షి, అమరావతి :  ఉక్రెయిన్‌లో విద్య కోసం వెళ్లి అక్కడ చిక్కుకున్న ఏపీ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపట్టింది. అక్కడి ఏపీ విద్యార్థులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారిలో ధైర్యాన్ని నింపే కార్యక్రమాన్ని ఏపీఎన్‌ఆర్టీఎస్‌ (ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ) చేస్తోంది. ఇప్పటికే  సీఎం వైఎస్‌ జగన్‌ ఏపీ విద్యార్థులను క్షేమంగా తీసుకొచ్చే విషయమై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ కూడా రాశారు. ప్రస్తుతం అక్కడ విమాన ప్రయాణాలపై నిషేధం (నో ఫ్ల్లయింగ్‌ ఆంక్షలు) ఉండటంతో విమాన సర్వీసులు నడవడంలేదని, అవి మొదలుకాగానే విద్యార్థులందరినీ వెనక్కి తీసుకురానున్నట్లు ఏపీఎన్‌ఆర్టీఎస్‌ సీఈఓ దినేష్‌కుమార్‌ ‘సాక్షి’కి తెలిపారు.

రెండ్రోజుల క్రితం 30 మందిని స్వస్థలాలకు  క్షేమంగా తీసుకువచ్చామన్నారు. అలాగే, ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రాంతాల్లో సుమారు 200 మంది విద్యార్థులున్నారని, వీరితో ఎప్పటికప్పుడు ఏపీఎన్‌ఆర్టీఎస్‌ అధికారులు మాట్లాడుతూ వారికి మనోధైర్యాన్ని కలిగించడంతోపాటు అవసరమైన సహకారాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అక్కడి విద్యార్థులు అంతా ధైర్యంగానే ఉన్నారని, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎవరూ బయట సంచరించవద్దని చెప్పామన్నారు. ఉక్రెయిన్‌లో ఉన్న వారి వివరాలను ఏపీఎన్‌ఆర్టీ సేకరించడంతోపాటు స్థానిక ఎంబసీలో పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా వారికి సూచించినట్లు దినేష్‌కుమార్‌ తెలిపారు. 

ప్రత్యేక అధికారుల నియామకం 
ఇక ఉక్రెయిన్‌ నుంచి విద్యార్థులను క్షేమంగా స్వస్థలాలకు తీసుకొచ్చే బాధ్యతను ఇద్దరు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. రాష్ట్ర అంతర్జాతీయ సహకార ప్రత్యేక అధికారి, రిటైరైన విదేశీ వ్యవçహారాల అధికారి గీతేష్‌ శర్మతో పాటు నోడల్‌ అధికారి రవిశంకర్‌లకు ఈ బాధ్యతలను అప్పగించింది. గీతేష్‌ శర్మను 7531904820 నంబర్‌లో, రవిశంకర్‌ను 9871999055 నెంబర్లలో సంప్రదించవచ్చని ప్రభుత్వం తెలిపింది. అలాగే, ఇతర అత్యవసర సాయం కోసం ఏపీఎన్‌ఆర్టీఎస్‌ అధికారులను 0863–2340678 నంబర్, లేదా 91–8500027678 నంబర్‌ను వాట్సప్‌ ద్వారా సంప్రదించాలని కోరింది. అంతేకాక.. ఉక్రెయిన్‌లో భారతీయుల కోసం ప్రత్యేంగా +380–997300428, +380–997300483 హెల్ప్‌లైన్‌ నంబర్లను అందుబాటులో ఉంచింది.  

మరోవైపు.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోందని, వీటిని వినియోగించుకోవడం ద్వారా రాష్ట్ర ప్రజలను క్షేమంగా స్వస్థలాలకు తీసుకురావడానికి ఏపీఎన్‌ఆర్టీఎస్‌ ప్రణాళికలను సిద్ధంచేసిందని దినేష్‌కుమార్‌ వెల్లడించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement