
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను సురక్షితంగా రప్పించాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. విద్యార్థులు స్వస్థలాలకు చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని తెలిపారు. ఈ మేరకు బుధవారం సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. ‘ఉక్రెయిన్‌లో ప్రస్తుత అనిశ్చితి, ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంలో వేర్వేరు కళాశాలల్లో చదువుతున్న ఏపీ విద్యార్థులు రక్షించాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని సహాయం కోరిన విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా.
తాత్కాలికంగా దేశాన్ని విడిచి వెళ్లాలని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయులకు సలహా ఇచ్చినందున వారికి అవసరమైన మద్దతు, సహాయం అందించడానికి.. విద్యార్థులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. విదేశాంగ శాఖ అధికారులతో ఏపీ అధికారులు నిరంతరం మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను వారి స్వస్థలాలకు సురక్షితంగా చేర్చడానికి కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుంది. ఏ విధమైన సహకారం కావాలన్నా ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లేదా ఏపీలోని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని విదేశాంగ శాఖ అధికారులు సంప్రదించవచ్చు’ అని సీఎం వైఎస్ జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఏపీ భవన్ సిద్ధం
ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకునే విద్యార్థులు వారి స్వస్థలాలకు చేరుకునేలా అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఏపీ భవన్ సిద్ధమైంది. విద్యార్థులు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ఏపీ భవన్‌ను సంప్రదించాలని భవన్ అధికారులు పేర్కొన్నారు. ఏపీ భవన్ అసిస్టెంట్ కమిషనర్లు ఎంవీఎస్ రామారావు (ఫోన్ 9871990081), ఏఎస్‌ఆర్‌ఎన్ సాయిబాబు (ఫోన్ 9871999430), భవన్ ఓఎస్డీ, నోడల్ అధికారి పి.రవిశంకర్ (ఫోన్ 9871999055) విమానాశ్రయంలో సహాయ సహకారాలు అందిస్తారని ఏపీ భవన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.