కడప (వైఎస్ఆర్ జిల్లా): ప్రజా రవాణా సంస్థ ప్రయాణికులను ఆకర్శించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది. ప్రయాణికులు ప్రైవేటు ఆపరేటర్ల వైపు వెళ్లకుండా అనేక చర్యలు చేపడుతోంది. మరోవైపు ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) మెరుగు పరుచుకునేందుకు పాటుపడుతోంది. అలాగే సీనియర్ సిటిజన్ల (వయో వృద్ధులు)కు టిక్కెట్‌లో 25 శాతం రాయితీ కల్పిస్తోంది. దీంతోపాటు ఇప్పుడు మరికొన్ని రాయితీలను కల్పించింది.
నలుగురు ప్రయాణికులు (పిల్లలతోసహా) ఒకేసారి టిక్కెట్ తీసుకుంటే ఛార్జి మొత్తంలో 5 శాతం రాయితీ కల్పించింది. ఇది కుటుంబాలతో కలిసి ప్రయాణం చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. మరోవైపు ఈ–వ్యాలెట్ ద్వారా టిక్కెట్‌ను బుక్ చేసుకుంటే ఛార్జిలో ఐదుశాతం సొమ్ము తగ్గించే వెసులుబాటు కల్పించింది. ప్రయాణికులు రానుపోను టిక్కెట్‌ను ముందుగా రిజర్వు చేసుకుంటే తిరుగు ప్రయాణ ఛార్జిలో పది శాతం తగ్గిస్తోంది. ఈ సదుపాయాన్ని సంక్రాంతి, దసరా వంటి పండుగల సీజన్లలో నడిపే ప్రత్యేక సర్వీసులకు వర్తింపజేస్తోంది.
ప్రస్తుతం సంక్రాంతి సీజన్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. దీంతో ప్రయాణికులకు, ఆర్టీసీకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఆర్టీసీ అధికారులు ఇప్పటికే రానున్న సంక్రాంతికి కడప జోన్‌లోని కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి 400–450 ప్రత్యేక సర్వీసులను నడపనున్నారు. ఈ బస్సుల్లో రెగ్యులర్ ఛార్జీలే తప్ప మునుపటిలా టిక్కెట్‌పై 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఆర్టీసీ అందిస్తున్న రాయితీ సదుపాయాలను వినియోగించుకోవాలని కడప జోన్ ఈడీ గోపీనాథ్‌రెడ్డి కోరారు. (క్లిక్ చేయండి: సంక్రాంతి సంబరాలు షురూ.. గిరి పల్లెల్లో మొదలైన సందడి)
Comments
Please login to add a commentAdd a comment