జీనియస్ ఇంటర్‌నేషనల్‌ బుక్ ఆఫ్ రికార్డులో ఎపీఎస్‌ఎస్‌డీసీ | APSSDC Creates Genius International Book Of The Records | Sakshi
Sakshi News home page

జీనియస్ ఇంటర్‌నేషనల్‌ బుక్ ఆఫ్ రికార్డులో ఎపీఎస్‌ఎస్‌డీసీ

Published Wed, Feb 10 2021 5:25 PM | Last Updated on Wed, Feb 10 2021 7:53 PM

APSSDC Creates Genius International Book Of The Records - Sakshi

సాక్షి, అమరావతి : కోవిడ్ సమయంలోనూ విద్యార్థులు, నిరుద్యోగ యువతకు లబ్ధికలిగేలా నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను ఆన్ లైన్ వర్చువల్ ద్వారా నిర్వహించినందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపీఎస్‌ఎస్‌డీసీ)కు జీనియస్ ఇంటర్నేషన్ బుక్ ఆఫ్ రికార్డు సంస్థ గుర్తింపు రావడం సంతోషంగా ఉందని ఆ సంస్థ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని సంస్థ కార్యలయంలో ఎపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఎండీ సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్లకు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు మెమెంటోను ఆ సంస్థ సౌత్ ఇండియా, ఏపీ కో ఆర్డినేటర్ రాజా రమేష్, నేషనల్ కో ఆర్డినేటర్ డాక్టర్ విజయ రాఘవ అందజేశారు.

ఈ సందర్భంగా ఎపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ... కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అందరూ ఇంటికే పరిమతం అయ్యారన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఆన్లైన్ ద్వారా మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో నిపుణులతో శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించామన్నారు. కోవిడ్ సమయంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత, మహిళలతో కలిపి సుమారు 1,99,356 మంది లబ్ధి పొందారన్నారు. ఈ ఆన్లైన్ శిక్షణలో భాగంగా అధ్యాపకులకు ఇండస్ట్రీ 4.0 స్కిల్స్, ఐబీఎం స్కిల్ బిల్ట్, ఈ లెర్న్ ఓక్, ఫైనాన్సియల్ మార్కెటింగ్తోపాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న వివిధ కోర్సులపై నిపుణులతో శిక్షణ ఇవ్వడాన్ని జీనియస్ ఇంటర్నేషన్ బుక్ ఆఫ్ రికార్డు సంస్థ గుర్తించడం సంతోషంగా ఉందన్నారు. 

అనంతరం ఎపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో ఇళ్లలోనే ఉండే యువతకు ఆధునిక టెక్నాలజీల్లో నైపుణ్య శిక్షణ ఇస్తే బాగుంటుందని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమ చంద్రారెడ్డి, ఎపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి సూచించారని.. వారి ఆలోచనలకు కార్యరూపం ఇచ్చి 1,99,356 మందికి ఆన్ లైన్ శిక్షణ ఇవ్వగలిగామన్నారు.  తమ సంస్థ చేపట్టిన ఈ నైపుణ్య శిక్షణా కార్యక్రమాలకు జీనియస్ ఇంటర్నేషన్ బుక్ ఆఫ్ రికార్డు గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. 

జీనియస్ ఇంటర్నేషన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సౌతిండియా కోఆర్డినేటర్ రాజా రమేష్ మాట్లాడుతూ... కోవిడ్ సమయంలో ఇంతపెద్ద స్థాయిలో ఆన్లైన్ ద్వారా నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను ఎక్కడా నిర్వహించలేదన్నారు. కేవలం నైపుణ్య శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలోనూ ఎపీఎస్‌ఎస్‌డీసీ మంచి ఫలితాలు సాధించిందన్నారు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాతే జీనియస్ ఇంటర్నేషన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు ఎంపిక చేశామన్నారు.  

ఈ కార్యక్రమంలో ఎపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఎండీ సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ ఎపీఎస్‌ఎస్‌డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వి. హనుమ నాయక్, డాక్టర్ డి.వి. రామకోటిరెడ్డితోపాటు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు మెమెంటోను సంస్థ నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ విజయ రాఘవ, డాక్టర్ జె.వి.సోమయాజులు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement