సాక్షి, అమరావతి: గ్రామస్థాయిలో రైతులకు బ్యాంకింగ్ సేవలందించాలన్న లక్ష్యంతో ఇప్పటికే బ్యాంకింగ్ కరస్పాండెంట్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా.. ప్రతీ రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే)లో ఏటీఎంను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకొక ఆర్బీకేలో వీటిని ఏర్పాటుచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేలుండగా, ప్రస్తుతం 9,160 ఆర్బీకేల పరిధిలో బ్యాంకింగ్ కరస్పాండెంట్‌లు అందుబాటులో ఉన్నట్లుగా గుర్తించారు. వీరిలో ప్రస్తుతం 6,708 మంది మాత్రమే ఆర్బీకేల ద్వారా సేవలందిస్తున్నారు. మిగిలిన వారి సేవలకూ చర్యలు చేపట్టారు.
ఇక ప్రస్తుతం బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా రూ.25వేల వరకు పరిమిత నగదు ఉపసంహరణ.. కొత్త బ్యాంకు ఖాతాలు తెరవడం.. పంట రుణాల మంజూరు.. పాడి, మత్స్యకారులకు కేసీసీ కార్డుల జారీ, డిపాజిట్ల సేకరణ, రుణాల రికవరీ వంటి సేవలందిస్తున్నారు. తాజాగా.. గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు ఆర్బీకేల్లో ఏటీఎంలు ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచన చేయగా బ్యాంకర్లు అందుకు ముందుకొచ్చారు.
జిల్లాకొకటి చొప్పున ఆర్బీకేలతో పాటు గ్రామ–వార్డు సచివాలయాల్లో ఏటీఎంలను ఏర్పాటుచేస్తున్నారు. ఆ తర్వాత బ్యాంకుల్లేని గ్రామాల్లో ఏర్పాటుచేయనున్నారు. చివరిగా.. మిగిలిన ఆర్బీకేలు, గ్రామ–వార్డు సచివాలయాలోŠల్ స్థానికంగా ఉండే డిమాండ్‌ను బట్టి దశల వారీగా ఏర్పాటుచేస్తారు. రైతుల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం.. మొబైల్, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించడం, పేపర్లు లేని ఆర్థిక లావాదేవీల (పేపర్ లెస్)ను ప్రోత్సహించడం లక్ష్యంగా గ్రామస్థాయిలో బ్యాంకింగ్ సేవలను విస్తరిస్తున్నారు. మరోవైపు.. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి ఆర్బీకేల ద్వారా రైతు సంబంధిత బ్యాంకింగ్ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు బ్యాంకర్లు కసరత్తు చేస్తున్నారు.
జిల్లాకొకటి ఏర్పాటుచేస్తున్నాం
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆర్బీకేలు, గ్రామ–వార్డు సచివాలయాల్లో ఏటీఎంలు ఏర్పాటుచేసేందుకు కృషిచేస్తున్నాం. అందుకు బ్యాంకర్లందరూ ముందుకొస్తున్నారు. తొలుత ఆర్బీకేలు, సచివాలయాల్లో జిల్లాకొకటి చొప్పున ఏర్పాటుచేస్తున్నాం. ఆ తర్వాత దశల వారీగా మిగిలిన చోట్ల ఏర్పాటుచేస్తాం.
– వి. బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్‌ఎల్‌బీసీ
Comments
Please login to add a commentAdd a comment