చింతూరు : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బాలుడిని ఆటోలో ఇంటికి తీసుకెళ్తున్న క్రమంలో మృతిచెందగా ఆ మృతదేహాన్ని ఆటోడ్రైవర్ రోడ్డుపైనే దించేసి వెళ్లిపోయాడు. నడిరోడ్డుపై ఆ చిన్నారి మృతదేహంతో తల్లిదండ్రులు అల్లాడారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి దారిన పోయే ఆటోలను, వాహనాలను ఆపినా ఎవరూ కరుణ చూపలేదు. చింతూరు మండలం ఏజీకొడేరు వద్ద బుధవారం జరిగిన హృదయ విదారక ఘటన వివరాలివి. వీఆర్‌పురం మండలం కుంజవారిగూడెంకు చెందిన సోడె సుబ్బారావు, బుచ్చమ్మల కొడుకు హరికృష్ణారెడ్డి(9) అంతుచిక్కని వ్యాధితో వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
అతడిని చికిత్స నిమిత్తం చింతూరులోని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయినా అనారోగ్యం తగ్గక పోవడంతో బుధవారం వీఆర్‌పురం మండలంలోని ఓ నాటువైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. బాలుడిని పరీక్షించిన నాటువైద్యుడు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు తిరిగి బాలుడిని ఆటోలో ఎక్కించుకుని స్వగ్రామం తీసుకెళుతుండగా చింతూరు మండలం ఏజీకొడేరు వద్దకు రాగానే మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో మృతిచెందాడు.
దీంతో సదరు ఆటోడ్రైవర్ బాలుడి మృతదేహంతో పాటు తల్లిదండ్రులను అక్కడే బస్‌షెల్టర్ వద్ద రహదారిపై ఎండలో వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో బాలుడి మృతదేహంతో రహదారిపై రోదిస్తూనే మృతదేహాన్ని తరలించేందుకు అదే రహదారిలో వస్తున్న ఆటోలను ఆపేందుకు ప్రయత్నించగా ఎవరూ ఆపలేదని తల్లిదండ్రులు తెలిపారు.
దీనిని గమనించిన స్థానికులు మృతదేహాన్ని పక్కనే వున్న బస్‌షెల్టర్‌లోకి తరలించి తల్లిదండ్రులను ఓదార్చారు. రెండు గంటలపాటు నిరీక్షణ అనంతరం సోడె జోగారావు అనే ఉపాధ్యాయుడు స్పందించి ఎట్టకేలకు ఓ ఆటోను ఆపి బాలుడి మృతదేహంతో పాటు తల్లిదండ్రులను వారి స్వగ్రామానికి తరలించారు.
(చదవండి: రాచబాటల్లో రయ్ రయ్!)
Comments
Please login to add a commentAdd a comment