అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేశారు. శుక్రవారం ఉదయం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం అయ్యన్న తరపున కూటమి నేతలు నామినేషన్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి మంత్రులు పవన్, నారా లోకేష్, ఇతరులు పాల్గొన్నారు.
ఏపీ అసెంబ్లీలో ఇవాళ 172 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాలుగు పార్టీల ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. ఇక రేపు మిగిలిన ముగ్గురు సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇక డిప్యూటీ స్పీకర్ పోస్ట్ జనసేన లేదంటే బీజేపీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. టీడీపీనే ఆ పోస్ట్ దక్కించుకునే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ బదులు జనసేనకు విప్ పోస్ట్‌తో సరిపెట్టవచ్చని సమాచారం.
అయ్యన్నపాత్రుడి కామెంట్స్..
చంద్రబాబు , పవన్, బీజేపీ నేతలు నన్ను స్పీకర్ గా నామినేట్ చేశారు. నామినేషన్ వేశాను. సాయంత్రం వరకు నామినేషన్ గడువు ఉంది..ఇంకా ఎవరైనా వేస్తారేమో వేచి చూడాలి. స్పీకర్ గా ఎన్నిక కావడం సంతోషం గా ఉంది. గతంలో ఎమ్మెల్యే గా, మంత్రిగా, ఎంపీ గా పని చేశాను. స్పీకర్ గా కుర్చీలో కూర్చున్న తరువుతా పార్టీ గుర్తు రాకూడదు. గౌరవ సభ్యులకు కూడా ప్రాధాన్యత ఇస్తాను. మాట్లాడేందుకు సమయం ఇస్తాను.
Comments
Please login to add a commentAdd a comment