రిలే దీక్షలలో పాల్గొని మాట్లాడుతున్న బహుజన పరిరక్షణ సమితి నాయకులు
తాడికొండ: పేదలకు పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అందుతున్న వేళ ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రపన్ని తన వర్గీయుడైన నిమ్మగడ్డ రమేష్తో కలిసి అడ్డదారులు తొక్కుతున్నారని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా చేపట్టిన దీక్షలు శనివారం 102వ రోజుకు చేరుకున్నాయి. కార్యక్రమానికి హాజరైన బహుజన పరిరక్షణ నాయకులు మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం రాష్ట్రంలో పెద్దఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ, నూతన గృహాల శంకుస్థాపనలు, అమ్మ ఒడి పథకం అందే సమయంలో.. వాటిని ఓర్వలేక కరోనా నిబంధనల్ని సైతం ఉల్లంఘించి ఎన్నికల కోడ్ అమలులోకి తీసుకురావడం దుర్మార్గమన్నారు.
చంద్రబాబు పాలనలో పేదలను అట్టడుగు స్థాయికి అణగదొక్కింది చాలక.. ప్రజలకు మేలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న పథకాలను అడ్డుకోవడం తగదన్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డపై కోర్టులు చర్యలు తీసుకొనే సమయం ఆసన్నమైందన్నారు. బహుజనులను అణగదొక్కేందుకు ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు మల్లవరపు సుధారాణి, కొలకలూరి లోకేశ్, పులి దాసు, ఈపూరి ఆదాం, బేతపూడి సాంబయ్య, సినీ నిర్మాత వై.చంటి, నూతక్కి జోషి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment